Advertisement

Advertisement


Home > Politics - Gossip

‘మహా డైలాగులు వేయకుండా బతకలేరు’

‘మహా డైలాగులు వేయకుండా బతకలేరు’

‘తాము ఎన్నికల్లో ఓడిపోతే.. అది ఛత్రపతి శివాజీ స్ఫూర్తికి జరిగిన అవమానం.. తాము తప్పుడు మార్గంలో అధికారంలోకి రాలేకపోతే.. అది మహారాష్ట్ర ప్రజలకు జరిగిన పరాభవం.. శివసేన ఎన్సీపీతో పొత్తు పెట్టుకోడానికి ప్రయత్నించడం తప్పు కాదు గానీ.. భాజపా వారి మద్దతు తీసుకోవడం మాత్రం రాజ్యాంగాన్ని అవమానించడం.. ప్రజల తీర్పును అవమానించడం.. మహారాష్ట్ర ప్రజలపై ఒక లక్ష్యంతో చేసిన దాడి...’ అని రకరకాల అతిశయోక్తులతో తుస్సుమనిపించిన పులి.. ఉద్ధవ్ థాక్రే ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. ఇవన్నీ పసలేని డైలాగులు అని ఆయన తప్ప అందరూ గుర్తిస్తున్నట్లే ఉంది.

కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఉద్ధవ్ కూడా అచ్చంగా చంద్రబాబునాయుడు బాటలోనే నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ.. ఇలాంటి కుయుక్తులను ప్రదర్శించడం, అతిశయోక్తుల డైలాగులను వల్లించడం ద్వారా చంద్రబాబునాయుడు మూటగట్టుకున్నది ఏమీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన, ఆయన పార్టీ పూర్తి భ్రష్టు పట్టిపోయారు. తెలంగాణలో నామరూపాల్లేకుండా పోగా, ఆంధ్రప్రదేశ్‌లో.. ఈ అయిదేళ్లలోనే ఆ పరిస్థితి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చంద్రబాబునాయుడు కూడా ఇదేమాదిరిగా మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్- చంద్రబాబును పచ్చిగా తిడితే.. ఆ తిట్లు యావత్ తెలుగుజాతికి అవమానం అని బిల్డప్ ఇవ్వడానికి చంద్రబాబు ఆరాటపడ్డారు. తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్లంతా.. సిగ్గుపడాలని.. కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని.. తనకు జరిగిన అవమానాన్ని జాతికి రుద్దడానికి ప్రయత్నించారు. ఆ కుట్రలు దారుణంగా బెడిసికొట్టాయి.

కానీ బుద్ధి తెచ్చుకోకుండా ఏపీలో మళ్లీ అదే కూహకాలను అమల్లో పెట్టారు. తనకు వ్యతిరేకంగా మోడీ కుట్ర చేస్తున్నారని.. ఆయనతో జగన్ జట్టుకట్టారని ప్రచారం సాగించారు. తెలుగుజాతి మొత్తం ఈ కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఇలా.. వ్యక్తిగత పరాభవాలను జాతికి రుద్దడానికి ప్రయత్నించి.. రెండు చోట్ల ఆయన దెబ్బతిన్నారు.

మహారాష్ట్రలో ఉద్ధవ్ కూడా అదే పనిచేస్తున్నారు. తాము రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును భ్రష్టు పట్టించే ఆలోచనలు చేస్తే.. అవి నెరవేరేలోగా.. మరో మార్గంలోంచి భాజపా మరో రీతిగా ప్రజల తీర్పును అపహాస్యం చేసిన తీరును జీర్ణం చేసుకోలేక ఆయన మహా ప్రజలకు అవమానం అనే పడికట్టు పదాలు వాడుతున్నారు. మహా రాష్ట్రలో మెజారిటీ సీట్లు భాజపాకు కట్టబెట్టి.. ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో.. అదే ఇప్పుడు అమలవుతోంది. ఈ పరిణామాలకు తన సొంత భాష్యం చెప్పగల నైతిక హక్కు ఆయనకు లేదని తెలుసుకోవాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?