cloudfront

Advertisement


Home > Politics - Gossip

మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజా 'తూచ్‌' వెనుక.!

మాజీ జేడీ లక్ష్మీనారాయణ తాజా 'తూచ్‌' వెనుక.!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంకోసారి 'తూచ్‌' అనేశారు. రాజకీయాల్లోకి వచ్చేస్తున్నానంటూ కొన్నాళ్ళ క్రితం హడావిడి చేసిన లక్ష్మీనారాయణ, ఇప్పటికీ రాజకీయాలపై ఎటూ తేల్చుకోలేకపోతుండడం గమనార్హం. రాజకీయాల్లోకి వచ్చేందుకే ఉద్యోగానికీ రాజీనామా చేశారాయన. లక్ష్మీనారాయణ బీజేపీలో చేరతారనీ, బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగుతారనీ అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత, 'సొంత కుంపటి' దిశగా చాలా ప్రయత్నాలు చేశారు. 

ఇక, తాజాగా టీడీపీ లక్ష్మీనారాయణను తమవైపుకు తిప్పుకుందనీ, విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లేదా విశాఖ నార్త్‌ నుంచి ఆయన్ని బరిలోకి దింపబోతోందనీ టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు పుట్టుకొచ్చాయి. కానీ, సాయంత్రానికి లక్ష్మీనారాయణ షరామామూలుగానే ఇదంతా 'ఉత్త' ప్రచారమేనని తేల్చేశారు. రాజకీయాల విషయమై తాను ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదనీ, తన చుట్టూ జరుగుతోన్న ప్రచారంతో తనకేమీ సంబంధం లేదని వివరణ ఇచ్చారు లక్ష్మీనారాయణ. 

కొన్నాళ్ళ క్రితం లోక్‌సత్తా పార్టీని లక్ష్మీనారాయణ టేకప్‌ చేస్తారనే వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమే అయినా, ఆ ప్రతిపాదనను లక్ష్మీనారాయణ సున్నితంగా తిరస్కరించారు. ఇంతకీ, తెలుగుదేశం పార్టీ ఈ సీబీఐ మాజీ జేడీ విషయంలో ఎందుకింత హంగామా చేస్తున్నట్లు.? నిప్పు లేకుండా పొగ రాదన్నట్లు.. టీడీపీ - లక్ష్మీనారాయణ మధ్య చర్చలు జరగకుండానే టీడీపీ అనుకూల మీడియాలో ఈ వార్తలు వచ్చాయని ఎలా అనుకోగలం.! 

ఇదిలా వుంటే, 'తోడు దొంగలు' అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రబాబునీ, లక్ష్మీనారాయణనూ ఒకే గాటన కట్టి ఏకి పారేయడంతోనే లక్ష్మీనారాయణ, టీడీపీ నుంచి పోటీ విషయమై ప్రస్తుతానికి పక్కన పెట్టారనే ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్‌ - టీడీపీ కలిసి పెట్టించిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి విచారణాధికారిగా లక్ష్మినారాయణ అప్పట్లో చేసిన హల్‌చల్‌ ఎలా మర్చిపోగలం.? అప్పట్లో లక్ష్మినారాయణ అత్యుత్సాహంపై చాలా పెద్ద రచ్చే జరిగింది. 

'ఆ ముసుగు తొలగిపోయింది.. చంద్రబాబు - లక్ష్మీనారాయణ కలిసే జగన్‌ మీద కుట్ర పన్నారు.. దీనంతటికీ, కాంగ్రెస్‌ దర్శకత్వం వహించింది.. చంద్రబాబు - కాంగ్రెస్‌ కలిసిపోయారు.. ఆ చంద్రబాబుతో ఆనాటి పాత స్నేహం లక్ష్మీనారాయణ ఇప్పుడు బయటపెట్టుకుంటున్నారు..' అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలతో, రాష్ట్ర ప్రజానీకం కూడా చాలావరకు ఏకీభవిస్తోన్న పరిస్థితి కన్పిస్తోంది.