cloudfront

Advertisement


Home > Politics - Gossip

అగ్గిపెట్టె ఉందా? వెలుగులు ఉన్నట్టే!!

అగ్గిపెట్టె ఉందా? వెలుగులు ఉన్నట్టే!!

ఒక సినిమాలో అప్పటి సూపర్ స్టార్ హీరో కృష్ణ ‘అగ్గిపెట్టె ఉందా’ అనే డైలాగును బాగా పాపులర్ చేశారు. ఆ డైలాగు వినిపించిందంటే చాలు, హీరో ఎంట్రీ ఇస్తున్నట్టు లెక్క. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి సారథి కోదండరాం కూడా.. అచ్చంగా అదే డైలాగును అనుసరించాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు. ఎందుకంటే కోదండరాం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ‘అగ్గిపెట్టె’ను ఎన్నికల గుర్తుగా కేటాయించింది.

కొత్తగా ఏర్పడిన పార్టీ జనసమితికి మొన్నటిదాకా గుర్తు కేటాయింపబడలేదు. దీంతో చాలా సందిగ్ధత నడిచింది. పార్టీ మాత్రం ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైపోతున్నది. గుర్తు ఇంకా రాకపోవడంతో.. తాత్కాలికంగా గుర్తు తీసుకుని.. ఈ ఎన్నికలను ఎదుర్కోవాలా? లేదా ఇంకేమైనా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా? అనే మీమాంసలో వారున్నారు. వారికి టెన్షన్ మరింత కొనసాగకుండా.. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం ఈ గుర్తు కేటాయింపు పూర్తిచేసింది.

కాగా, అగ్గిపెట్టె గుర్తు రావడంపై తెలంగాణ జనసమితి నాయకులు మాత్రం ఆనందంగానే ఉన్నట్లు సమాచారం. అగ్గిపెట్టె గుర్తు ప్రతి సామాన్యుడికి పార్టీ చేరువ కావడానికి సులువుగా ఉంటుందని పార్టీ నాయకులు భావిస్తున్నారు. అగ్గిపెట్టె ఉంటే మీతో వెలుగులు ఉన్నట్లే అంటూ ప్రచారం చేసుకోవచ్చునని భావిస్తున్నారు. ప్రతి సామాన్యుడికి తెలిసినదే ఎన్నికల గుర్తుగా ఉంటే అందరికీ చేరువకావడం సాధ్యమని ప్రతి రాజకీయ పార్టీ కూడా భావిస్తుంది. అలా.. అగ్గిపెట్టె తమకు కలిసివచ్చే గుర్తే అని తెజస శ్రేణులు అంచనా వేస్తున్నాయి.

పైగా ‘అగ్గి’ అనేది మానవ జీవిత స్వభావాన్ని మార్చేసిన పరిణామం అని... ‘అగ్గి’ని కనుగొనడం అనేది మానవ నాగరికత వికాసంలో ఓ అత్యద్భుత ఘట్టం అని.. తొలుత ‘అగ్గి’ నుంచి నాగరికత ప్రారంభం అయిందని.. అదే తరహాలో.. అగ్గిపెట్టె కూడా తెలంగాణ సమాజ వికాసానికి శ్రీకారం కాగలదని పార్టీ నాయకులు భావిస్తున్నారు.

రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్న తెజసకు అన్ని సంకేతాలూ బాగానే ఉన్నాయి గానీ.. కాంగ్రెస్ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనే సంగతి ఒక్కటే టెన్షన్ గా ఉంది. పార్టీ మనుగడకే ప్రమాదకరం అయ్యేలాగా వారు సీట్లు కేటాయిస్తే.. ఒప్పుకోకూడదని వారు ఖరారుగా అనుకుంటున్నారు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి