Advertisement


Home > Politics - Gossip
పార్టీలో విలేకర్లకు కుర్చీలు కూడా లేవు!

పేరుకు అది జాతీయ పార్టీ. రాజధాని నగరంలో రాష్ట్ర కార్యాలయం. కానీ ప్రెస్ మీట్ పెడితే.. విలేకర్లు వస్తే.. వాళ్లు కూర్చోడానికి కుర్చీలు కూడా చాలినన్ని వేయలేని దుస్థితి. టీవీ కెమెరాలు ఉంటే చాలు మరేం అక్కర్లేదన్నట్లుగా నాయకులు చెలరేగి మాట్లాడేస్తూ ఉంటే.. ఉద్యోగ ధర్మంగా.. ఇలాంటి ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. అక్కడకు వచ్చిన మీడియా మిత్రులు నిల్చునే మొత్తం ఆయన ప్రసంగ పాఠం రాసుకోవాల్సిన పరిస్థితి. ఇది మరెక్కడో కాదు.. విజయవాడ భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఉన్న తకరారు.

రాష్ట్ర భాజపాలో నిన్నటిదాకా ఫైర్ బ్రాండ్ నాయకుడు సోము వీర్రాజు ఇవాళ విజయవాడలో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల విషయంలో రాష్ట్రప్రభుత్వం అబద్దాలు చెబుతున్నదని.. ఇచ్చిన నిధులను ఏయే పనులకు ఖర్చు పెట్టారో ప్రభుత్వం వెల్లడంచాలని అన్నారు.

ఇదివరకటి లాగా కాకుండా.. చంద్రబాబునాయుడు మీద వ్యక్తిగత విమర్శలకు దిగకుండా కాస్త దూకుడు తగ్గించినప్పటికీ.. కేంద్రం మీద గానీ, భాజపా మీద గానీ ఈగ వాలనివ్వకుండా.. లోపం కేంద్ర ప్రభుత్వంలో లేదని రాష్ట్రప్రభుత్వంలోనే ఉన్నదని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. సోము వీర్రాజు కొత్తగా మాట్లాడారు తప్ప.. భాజపా తొలినుంచి చెబుతున్న విషయాలనే ఆయన మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారు.

కాకపోతే.. రాష్ట్ర రాజధానిలో పార్టీ కార్యాలయం పెట్టుకుని అంత పెద్ద స్థాయిలో విలేకర్ల సమావేశం నిర్వహించినప్పుడు.. కనీసం విలేకర్లకు చాలినన్ని కుర్చీలైనా ఏర్పాటుచేయాలనే ఆలోచన పార్టీ వారికి లేకపోవడం ఏమిటో అర్థంకాని సంగతి.

భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమన్నా, అమరావతి రాజధాని అన్నా.. ఒక చులకన భావం ఉన్నట్లే.. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా.. అదే చులకన భావనను విలేకర్ల పట్ల ప్రదర్శిస్తున్నదా అనే వెటకారాలు కూడా మీడియా వారిలో వినిపించాయి. సాధారణంగా.. అమరావతిలో ప్రెస్ మీట్ అంటే ఎందరు వస్తారో ఒక అంచనా వుంటుంది. ఆ మాత్రానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోకపోతే.. ఆ పార్టీ నిర్వహణ గురించి ఏమనుకోవాలి? అని విలేకర్లు విస్తుపోతున్నారు.