cloudfront

Advertisement


Home > Politics - Gossip

మీడియా తత్వం బోధపడిందా?

మీడియా తత్వం బోధపడిందా?

ఎక్కడైనా బావ కానీ ఎన్నికల దగ్గరకాదు. అదీ దాదాపు తొంభైశాతం మన తెలుగు మీడియా వ్యవహారం. గత మూడు, నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వంతో మంచిగా వుంటూ, మంచి చేసుకుంటూ పబ్బం గడిపేసుకుంది దాదాపు తొంభైశాతం తెలుగు మీడియా. దాంతో ఇంకేముంది తమకు అడ్డం లేదనుకున్నారు కేసిఆర్ అండ్ సన్. కానీ వాళ్లకు తెలియని విషయం ఒకటి వుంది. ఎన్నికలు వస్తే, తెలుగుదేశం ప్రయోజనాల ముందు మరింకేదీ ముఖ్యంకాదు. ఇది చాలావరకు మీడియాల విషయంలో వాస్తవం.

ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి మీడియా సన్నాయి నొక్కులు మొదలయ్యాయి. బాబు స్నేహహస్తం చాచితే వద్దన్నారు అంటూ. బాబు-కేసిఆర్ కలిసినట్లయితే, ఓ సామాజిక వర్గ ప్రయోజనాలకు కట్టుబడిన మీడియాకు పనిసులువు అయివుండేది. కేసిఆర్ ను తిట్టనక్కరలేదు. బాబును పొగుడుకోవచ్చు. తెలంగాణలో కూడా తాము రాసింది రాత, వేసింది వార్త అన్నట్లు వుంటుంది వ్యవహారం.

కానీ అలా జరగలేదు. దాంతో ఎలా ఎలా అని కిందామీదా పడ్డారు. ఎన్నికల ప్రచారం ఆరంభంలో కేసిఆర్ కు 70శాతం బాబు అండ్ కో 30శాతం ఫ్రంట్ పేజ్ అప్పగించారు. మెల్లగా శాతాలు మారుతూ వచ్చాయి. ఇప్పుడు కేసిఆర్ కు 45శాతం బాబు అండ్ కో కు 55శాతం అయింది. అంతేకాదు, కథలు, కథనాలు మెల్లగా మహాకూటమి దిశగా సాగుతున్నాయి.

వాట్స్ అప్ ల్లో మహాకూటమికి అనుకూలంగా వచ్చే గాలి గ్యాసిప్ లు కూడా వార్తలయిపోతున్నాయి. కేసిఆర్ కు దూరమైన వారి ఇంటర్వూలు ఫుల్ పేజీల్లో దర్శనమిస్తున్నాయి. ఇదంతా కేసిఆర్ కోరి చేసుకున్నారనే సుభాషితాలు తానులకు తానులు వండి వార్చడం ఆరంభమైంది. చంధ్రబాబు ఉపన్యాసాలను ఉభయతారకంగా వుండేలా చూసి, పనిలో పని అటు ఆంధ్రలో కూడా వాడడం ప్రారంభమైంది.

ఇక కూకట్ పల్లి సుహాసిని విజయాన్ని అయితే ఓ మీడియా సంస్థ తన భుజాన వేసుకున్నట్లు కనిపిస్తోంది. ఇలా అన్నివిధాలా సాగుతున్న మీడియా వ్యవహారాలు ఇప్పుడు కేటీఆర్ కూడా గమనించినట్లుంది. అందుకే మీడియా మేనేజ్ మెంట్ కు చంద్రబాబుకు చాతనయినంత, తనకు రాదని ఓపెన్ గా అంగీకరించారు.

కానీ ఆయనకు తెలియనిది, ఇది మీడియా మేనేజ్ మెంట్ కాదు, సామాజిక బంధాలు అన్నది. లేదా సామాజిక బంధాలు అన్నది తెలిసీ ఏమీమాట్లాడలేక మౌనంగా వున్నారేమో? ఇప్పుడు ఇంతకీ కేసిఆర్ మళ్లీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఇదే మెజారిటీ మీడియా అట్టు ఎలా తిరగేస్తుందో చూడాలి.

అప్పుడు రికార్డు ఏ విధంగా వుంటుందో? అయినా 2014 తరువాత మార్చగా లేనిది 2019లో మాత్రం మార్చలేరా ఏమిటి? అలవాటైపోయిన విద్యే కదా?

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?