cloudfront

Advertisement


Home > Politics - Gossip

టీడీపీకి అమ్ముడుపోవడమే ఈశ్వరి చేసిన తప్పు

టీడీపీకి అమ్ముడుపోవడమే ఈశ్వరి చేసిన తప్పు

ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నారా? అప్రమత్తంగా లేకపోతే ఆమెను కూడా కడతేర్చే ప్రమాదం ఉందా? తాజాగా మావోయిస్టుల పేరుతో విడుదలైన ఓ లేఖ ఇవే విషయాలను స్పష్టం చేస్తోంది. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధికార పార్టీకి 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయారని, వ్యక్తిగత లాభం కోసమే ఆమె వైసీపీ నుంచి టీడీపీలోకి మారారని మావోయిస్టులు ఆ లేఖలో ఆరోపించారు.

పద్ధతి మార్చుకోవాలని, బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని లేఖలో ఈశ్వరిని హెచ్చరించారు మావోయిస్టులు. చెప్పినట్టు చేయకపోతే కిడారి, సోమకు పట్టినగతే పడుతుందని లేఖలో హెచ్చరించారు. వైసీపీ జెండాపై గెలిచి టీడీపీకి అమ్ముడుపోవడం వల్లే కిడారి హతమయ్యాడని స్పష్టమవుతోంది.

అటు గిడ్డి ఈశ్వరి కూడా అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి, బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరించడం వల్లే మావోల హిట్ లిస్ట్ లో చేరారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల తర్వాత మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేశారు.

సెంట్రల్ కమిటీ పేరుతో విడుదలైన ఈ లేఖలో కిడారి, సోమ హత్యలకు గల కారణాలు వెల్లడించారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, క్వారీ విషయంలో తమ హెచ్చరికలను లెక్కచేయకుండా గిరిజనులకు ద్రోహం చేస్తున్నందుకే ప్రజా కోర్టులో వారికి మరణ శిక్ష విధించామన్నారు.

అదే సమయంలో పోలీసులు ఆయుధాలతో తమకు దొరికినా వారికి ఎలాంటి హాని తలపెట్టలేదని, వారిని కేవలం పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేస్తున్నవారిగానే గుర్తించి వదిలేశామని వెల్లడించారు. మొత్తమ్మీద బాక్సైట్ తవ్వకాల విషయంలో అధికార పార్టీ వ్యవహారాలపై మావోయిస్టులు ఆగ్రహంగా ఉన్నట్టు స్పష్టమైంది. 

రూ.20 కోట్లకు అమ్ముడుబోయిన గిడ్డి మాకు నీతులు చెప్పడమా? 
ప్రజాద్రోహి, గిరిజన ద్రోహి, అధికారపార్టీకి తొత్తు అయిన గిడ్డి ఈశ్వరి తమను నిందించడమేంటని మావోయిస్టులు మండిపడ్డారు. రూ.20 కోట్లకు అధికారపార్టీకి అమ్ముడుపోయిన నువ్వు మాకు నీతులు చెప్పడమా? అని ధ్వజమెత్తారు. ‘ప్రజాకోర్టులో కిడారి నీ విషయంపై నిజం చెప్పాడు.

నీకందిన అవినీతి సొమ్మును 2 నెలల్లో గిరిజనులకు పంచి క్షమాపణలు చెప్పాలి. బాక్సైట్‌ తవ్వకాలను వ్యతిరేకించాలి. లేదంటే నీకూ కిడారి, సోమలకు పట్టిన గతే పడుతుంది. మేము చెప్పినట్లు చేస్తావు కదా! లేదంటే మంత్రి పదవి దొరుకుతుందని ఆశిస్తావా.. ఆలోచించుకో’’ అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హెచ్చరికలు చేశారు. 

మావోయిస్టులు విడుదల చేసిన బహిరంగ లేఖ