cloudfront

Advertisement


Home > Politics - Gossip

మోడీ చేజేతులా పార్టీని ముంచుతున్నారా?

మోడీ చేజేతులా పార్టీని ముంచుతున్నారా?

నిజానికి ఇలాంటి అభిప్రాయం దేశవ్యాప్తంగా పలువురు భాజపా నాయకుల్లోను, ఆరెస్సెస్ వాదుల్లోనూ కూడా ఉంది. ప్రధానిగా నరేంద్రమోడీ తన ఒంటెత్తు పోకడలతో పార్టీకి ఎప్పటికీ ప్రజాదరణ తిరిగి సంపాదించుకోలేని రీతిలో నష్టం చేస్తున్నారనే అభిప్రాయం ఉన్నవారు అనేకులు ఉన్నారు. ప్రజాకంటక నిర్ణయాల విషయంలో ఏదో మీడియా మేనేజిమెంట్ తో నెట్టుకొస్తున్నారే తప్ప, వాస్తవంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనేది పలువురి వాదన.

ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం తెలంగాణ భాజపా నాయకులు మాత్రం.. మోడీ చేజేతులా ఈ రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఆదరణను నాశనం చేసేస్తున్నారని భావిస్తున్నారు. నేరుగా అధిష్టానం దృష్టికి ఈ అభిప్రాయం తీసుకెళ్లే ధైర్యం ఏ ఒక్కరికీ లేకపోయినా.. నాయకులు లోలోన తెలంగాణలో పార్టీకి చేటు జరుగుతున్నదంటూ మధన పడిపోతున్నారు.

కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచనకు సహకరించడం ద్వారా మోడీ.. తెలంగాణలో పార్టీ అభివృద్ధికి గోతిని తవ్వినట్లుగా వాతావరణం తయారైందని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్షాలు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సన్నద్ధంగా లేవని.. ఈ పరిస్థితిని ఎడ్వాంటేజీగా మార్చుకుని నెగ్గడానికి కేసీఆర్ వ్యూహరచన చేశారని.. సార్వత్రిక ఎన్నికలు ఇంకా అతి తక్కువ వ్యవధిలోనే ఉండగా.. ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం సహకరిస్తున్నదని వారి అభిప్రాయం. ఆ రకంగా చూసినప్పుడు.. ముందస్తు వలన... భాజపాకు కూడా రాష్ట్రంలో గతంలో కంటె ఎక్కువ నష్టం జరుగుతుందనేది భావన.

కేసీఆర్ ఈ ముందస్తు ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుని... వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు సహకరిస్తానని చెప్పడం వల్లనే.. మోడీ సర్కార్ ఈ ముందస్తు వ్యూహానికి లోపాయికారీగా సహకరిస్తోందనే వాదన పలువురిలో ఉంది. సరిగ్గా ఈ విషయంలోనే తెలంగాణ భాజపా నాయకులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ గతంలో తెరాసను విలీనం చేస్తా అంటూ సోనియాకు బిస్కట్ వేశారని, దానికి పడిపోయి చివరి నిమిషంలో రాష్ట్రం ప్రకటిస్తే.. తర్వాత బురిడీ కొట్టించారని అంటున్నారు. అదే క్రమంలో ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో మద్దతిస్తా అంటూ మోడీకి బిస్కట్ వేశారని.. మోడీ కూడా అలా కేసీఆర్ మాయలో పడిపోయారని విమర్శలు వస్తున్నాయి.

ఒకసారి ఈ లోపాయికారీ ఒప్పందాలను ప్రజలు అనుమానిస్తే ఇక ఇప్పట్లో పార్టీ తిరిగి కోలుకోవడం కష్టమని కూడా అంటున్నారు.