Advertisement


Home > Politics - Gossip
తెలంగాణ కలలకు మోడీ ఉప్పుపాతర!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలో భాజపా-కాంగ్రెస్ వ్యతిరేక మూడోకూటమి స్థాపిస్తానంటూ చాలా ఆర్భాటంగా పలికి ఉండవచ్చు గాక... మోడీని గద్దెదింపి తీరాల్సిందేనంటూ.. దేశంలోని కొన్ని ప్రముఖ ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి చాలా ప్రయత్నాలే చేసి ఉండవచ్చు గాక... కానీ.. ఆయన మాత్రం మోడీ సర్కారు నుంచి తమ రాష్ట్రానికి చాలాఎక్కువ ఆశిస్తూ వచ్చారు. అలాంటి వాటిలో తెలంగాణ సమాజం మొత్తం కోరుకున్న ప్రధానమైన ఆశకు మోడీ సర్కార్ ఉప్పుపాతర వేసేసింది.

కేవలం తెలంగాణ రాష్ట్రసమితి, నాయకులు, తెలంగాణ ప్రజలు ఆశలు పెంచుకోవడం మాత్రమేకాదు... తెలంగాణ భాజపా నాయకులు కూడా పలు సందర్భాల్లో కేంద్రం తప్పక ఇస్తుందని ప్రకటించిన దాని గురించే.. ఇక ఆశలు పెట్టుకోవద్దన్నట్లుగా కేంద్రం తేల్చేసింది. ‘తెలంగాణకు ఇవ్వబోం’ అని డైరక్టుగా చెప్పకపోయినప్పటికీ.. పోలవరం తర్వాత.. దేశంలో మరే ఇతర సాగునీటి ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ సభలో తేల్చిచెప్పడం ఈ సందర్భంగా గమనార్హం.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. తెలంగాణ సర్కారు సాగునీటి ప్రాజెక్టుల మీద చాలా పెద్దస్థాయిలోనే దృష్టిపెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతూ వచ్చిందని.. పోరాట సమయంలో తాముచేసిన ఆరోపణలు నిజం అని ప్రజలు నమ్మాలంటే.. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత.. కొన్ని ప్రాజెక్టులనైనా చురుగ్గా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవడం అనేది వారికి తక్షణ కర్తవ్యంగా కనిపించి ఉండవచ్చు. ఈ క్రమంలో కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాలు కూడా వేగంగా జరుగుతున్నాయి.

ఒకవైపు ఆంధ్రప్రదేశ్ లో విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులు మొత్తం కేంద్రం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో తెలంగాణలో కీలకమైన కాళేశ్వరంను కూడా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. దత్తాత్రేయ వంటి భాజపా నాయకులు కూడా కాళేశ్వరానికి జాతీయ హోదా తప్పక వస్తుందంటూ ప్రజల్లో ఆశలు పెంచారు. కేసీఆర్ సహా, తెరాస ప్రతినిధులు అనేకమార్లు ఈ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కానీ.. ఆ ఆశలన్నిటికీ తాజాగా నితిన్ గడ్కరీ మాటలు గండికొడుతున్నాయి.

మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరి ఆశలను తీర్చే ఉద్దేశం కూడా తమకు లేదన్నట్టుగా మోడీ సర్కార్ వ్యవహరిస్తున్నదని ప్రజలు విమర్శిస్తున్నారు.