Advertisement


Home > Politics - Gossip
మోడీ నీతి: బాప్ ఖారా.. బేటీ మీటా!!

‘తల పగ- తోక చుట్టరికం’ అంటూ తెలుగులో ఒక సామెత ఉంది. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్న తీరు కూడా అచ్చం అలాగే కనిపిస్తోంది. ఒకవైపు మోడీ సర్కారు రాష్ట్రాల విషయంలో ఫెడరల్ స్ఫూర్తిని తుంగలో తొక్కుతూ.. ఏదో ముష్టి వేస్తున్నట్లుగా వ్యవహరిస్తూ.. అరాచక పాలన సాగిస్తున్నదని.. భాజపా, కాంగ్రెస్ వ్యతిరేక కేంద్రప్రభుత్వాన్ని గద్దెమీదకు తీసుకురావడానికి తాను ఢిల్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి చక్రం తిప్పుతానని ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రత్యక్ష సమరాన్ని ప్రకటించారు. మరోవైపు.. ఆయన తనయ కల్వకుంట్ల కవితకు.. జన్మదినం సందర్భంగా.. నరేంద్రమోడీ నుంచి తెలుగులో శుభాకాంక్షల ఉత్తరాలు వచ్చి ఆశ్చర్య పరుస్తున్నాయి.

‘శ్రీమతి కల్వకుంట్ల కవిత, మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి. దేశ ప్రజలకు మీరు సేవలందించేందుకు వీలుగా కావలసిన ఆరోగ్యకర, ఆనందమయ జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నాను. శుభాభినందనలతో నరేంద్రమోదీ’ అంటూ ఆయన హిందీలో సంతకం చేసిన ఉత్తరం ఆమెకు ప్రధాని కార్యాలయం నుంచి అందింది.

ప్రధాని మోడీ.. వివిధ దేశాల అధినేతలకు వారి వారి భాషలో గ్రీటింగ్స్ పంపడం చాలాసార్లు జరిగింది. అలాగే.. దేశంలోని ప్రతి ఎంపీకి వారి బర్త్ డే రోజున.. వారి మాతృభాషలో మోడీ కార్యాలయం ఇలా గ్రీటింగ్స్ లేఖలు పంపుతుందో లేదో తెలియదు గానీ.. కల్వకుంట్ల కవితకు పంపడాన్ని మాత్రం చాలా మంది ప్రత్యేకంగా భావిస్తున్నారు.

ఎందుకంటే.. ఒకవైపు కేసీఆర్ కొన్ని వారాలుగా మోడీ మీద యుద్ధాన్ని ప్రకటించారు. ప్రతిరోజూ కేంద్రం మీద కత్తి నూరుతున్నారు. తాను మోడీనే టార్గెట్ చేసినట్టుగా కూడా డైరక్టుగానే వెల్లడించారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ.. కేంద్ర రాజకీయాల్లోకి వచ్చినట్టుగా తాను కూడా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ.. ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లి.. ఫెడరల్ స్ఫూర్తితో కొత్త రకం పాలన చేస్తానంటూ కేసీఆర్ చెబుతున్నారు.

ఆ రకంగా ఆయన మోడీకి ప్రత్యర్థి కిందే లెక్క. అందుకే.. ఆయన కూతురుకు మోడీ పంపిన శుభాకాంక్షలను చూసిన వారు.. ‘‘బాప్ ఖారా.. బేటీ మీఠా’’ అంటూ నవ్వుకుంటున్నారు. తండ్రితో సున్నం పెట్టుకున్నాడు గానీ.. కూతురు మీద మాత్రం అభిమానం ఒలకబోస్తున్నాడు అని వ్యాఖ్యానిస్తున్నారు. ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు పంపడంలో మోడీ వ్యూహం ఏమిటో మరి!!