Advertisement


Home > Politics - Gossip
మరీ ఇంత చవకబారు ఆత్మవంచనా?

తెలంగాణ తెదేపా నాయకులకు తమ పరువు పోతున్న సమయంలో దాన్ని కాపాడుకునేందుకు ఏం మాట్లాడుతున్నమో విచక్షణ ఉండి మాట్లాడుతున్నట్లుగా లేదు. ప్రజలు తమ వైఫల్యాల్ని గుర్తించేయడానికంటె ముందే.. తాము ఏదో ఒకటి చెప్పేయకపోతే.. ఎవరి మీదనో ఒకరి మీద నింద వేసేయకపోతే.. దెబ్బతింటాం అనే కంగారులో.. ఎవరికి వారు.. మరీ కామెడీ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా పార్టీ తరఫున కొంతకాలం కామ్ గా ఉంటూ.. గవర్నరు గిరీ వస్తుందని, రాజభవన్ నివాసం దక్కుతుందని ఎదురుచూసిన మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు గరం అవుతున్నారు. కాకపోతే.. ఆయన కామెంట్లు నవ్వులపాలు అవుతున్నాయే తప్ప.. నమ్మించేలా ఎవ్వరికీ కనిపించడం లేదు. 

తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. 12 మంది అధికార పార్టీ తెరాసలోకి జంప్ చేశారు. తెలంగాణ తెదేపా పని అయిపోయింది అనే ఉద్దేశంతో, ఇక ఆ పార్టీ కోలుకోవడం అసాద్యం అనే నమ్మకంతోనే వారంతా వెళ్లిపోయినట్లుగా ఇన్నాళ్లుగా ప్రజలు అనుకుంటున్నారు. అయితే తాజాగా మోత్కుపల్లి నరసింహులు ఇవాళ కొత్త భాష్యం చెబుతున్నారు. రాజకీయాల్లో ఆత్మవంచన, వక్రభాష్యాలు నాయకులకు కొత్తకాదు గానీ.. మోత్కుపల్లి చెబుతున్న వర్షన్ మాత్రం.. మరీ ఆత్మవంచన లాగా ఉన్నదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

పార్టీని వీడి వెళ్లిపోయిన 12 మంది కేవలం రేవంత్ రెడ్డి వైఖరి నచ్చకనే పార్టీని వీడిపోయారట! (అక్కడికేదో ఇంకా ముగ్గురు మిగిలున్నట్టు ఆయన ఫీలింగ్. ఒక ఎమ్మెల్యే అసలు పార్టీలో ఉన్నాడో లేడో వారైనా చెప్పగలరో లేదో తెలీదు) అంటే ఇప్పటిదాకా తెలుగుదేశంలో జరిగిన పతనం మొత్తం రేవంత్ పుణ్యమే అన్నట్లుగా ఆయన ఖాతాలో వేయడానికి మోత్కుపల్లి శ్రమ పడుతున్నారు. సదరు మోత్కుపల్లి వెలిబుచ్చుతున్న అమూల్య అభిప్రాయాలు చంద్రబాబునాయుడుకు తెలియవా? మోత్కుపల్లికి ఉన్నపాటి విచక్షణ పరిశీలన చంద్రబాబుకు లేవా? మరి రేవంత్ వల్లనే అందరూ వెళ్లిపోయారని తెలిసీ... ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

రేవంత్ చేరితే కాంగ్రెస్ కూడా భ్రష్టు పట్టిపోతుందట. అంటే.. ఇన్నాళ్లుగా తెదేపా భ్రష్టు పట్టిపోయిందని ఆయన ఒప్పుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్లు ఈ సంగతి గుర్తించాలని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ను బాగు చేయడానికి మోత్కుపల్లికి అంత ఇంట్రస్ట్ ఎందుకో అర్థంకాదు. పార్టీనుంచి వెళ్లిపోయే నాయకుల మీద నాలుగు విమర్శలు రువ్వి, పోయేవాళ్లందరూ చెడ్డోళ్లు.. అంటూ దెప్పిపొడుపు మాటలు మాట్లాడడం కొత్తకాదు. కానీ అవి కూడా తర్కబద్ధంగా, లాజికల్ గా లేకుండా, ఆత్మవంచన లాగా ఉండడమే మోత్కుపల్లి కంగారుకు నిదర్శనంగా కనిపిస్తోంది.