Advertisement


Home > Politics - Gossip
ఎంపీల రాజీనామాకే జగన్‌ కట్టుబడ్డారా?

రాజకీయ నాయకులు రచ్చ చేయడానికి ప్రతి రోజూ ఏదో ఒక అంశం దొరుకుతుంది. ప్రతిపక్షాలను ఉతికేయడానికి అధికారపక్షం ఏదో పాయింటు పట్టుకుంటుంది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షం ఏదో అంశాన్ని ఎంచుకుంటుంది. ఇలా రచ్చ చేయడంలో ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికుంటాయి.

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌ ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసిరావడం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రచ్చకు దారితీసింది.సామాన్యుల దృష్టి కోణం నుంచి చూసినప్పుడు ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు దేశ ప్రధానిని కలిసి సమస్యలు విన్నవించడం సాధారణమైన విషయం. కాని ఏపీలో ఇదొక రాజకీయ కుంభకోణంగా మారిపోయింది.

జగన్‌ ప్రధానిని ఎందుకు కలిశారు? ఆయన కలవడంతో టీడీపీ ఎందుకు కంగారు పడుతోంది? జగన్‌పై ఎందుకు ధ్వజమెత్తుతోంది? జగన్‌ ప్రధానిని కలిస్తే కాంగ్రెసు ఎందుకు సంతోషిస్తోంది? ...ఈ భేతాళ ప్రశ్నలన్నీ ఏపీలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఎవరెంత కంగారుపడినా కాలక్రమంలో జవాబులు దొరుకుతాయి. కేసుల్లో విచారణను ఎదుర్కొంటున్న జగన్‌ గతంలో రాష్ట్రపతినే కలిసినప్పుడు ప్రధానిని కలిస్తే తప్పేమిటి? టీడీపీ ఎందుకు నిప్పు తొక్కిన కోతిలా ఎగురుతోంది?

ఎందుకంటే రాష్ట్రపతి రాజకీయాలకు అతీతుడు. ఆయన్ని ఏ నాయకుడు కలిసినా రాజకీయంగా ప్రాధాన్యం ఉండదు. రాష్ట్రపతి రాజకీయాలు మాట్లాడరు కదా. కాని ప్రధానిని కలుసుకుంటే దానికి రాజకీయంగా ప్రాధాన్యం ఉంటుంది. ఆయన అప్పటికప్పుడు నేరుగా రాజకీయాలు మాట్లాడకపోయినా రాజకీయ వ్యూహాల్లో ఆయన పాత్ర ఉంటుంది కదా. 

రాజకీయాల్లో కలయికలకు, ఎన్నికల్లో పొత్తులకు కేసులు (తీర్పు రాలేదు కాబట్టి) అడ్డు రావు. చంద్రబాబుకు ప్రజల్లో ఆదరణ తగ్గిపోయి జగన్‌కు ఆదరణ పెరిగితే బీజేపీ వైకాపాతో పొత్తు పెట్టుకోవచ్చు. గెలిచేవారితో జత కట్టడమే రాజకీయం. అందుకే టీడీపీకీ కంగారు పుట్టి రచ్చ చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి నడుస్తామని చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. కాని ఈ స్పష్టత బీజేపీ నుంచి లేదు.

'కచ్చితంగా టీడీపీతోనే పొత్తు కొనసాగుతుంది' అని బీజేపీ జాతీయ నాయకులెవరూ ఇప్పటివరకు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పలేదు. తాజాగా అధ్యక్షుడు అమిత్‌ షా ఏపీ కమలం నాయకులతో 'టీడీపీతో పొత్తుపై మీరు వ్యాఖ్యలు చేయవద్దు. ఆ విషయం మేం నిర్ణయిస్తాం' అని చెప్పారు. అంటే పరిస్థితిని బట్టి బీజేపీ నిర్ణయం ఉంటుంది.

ఇదిలా ఉంటే, గతంలో జగన్‌ చెప్పిన మాటలను టీడీపీ, దాని అనుకూల మీడియా గుర్తు చేస్తున్నాయి. జగన్‌ ఏమన్నారు? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే జూన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళతామన్నారు. ప్రత్యేక హోదా రాదనే విషయం జగన్‌తో సహా అందరికీ తెలుసు. మరి చెప్పిన ప్రకారం వచ్చే నెలలో (జూన్‌) వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారా? ఈ విషయాన్ని టీడీపీ అనుకూల పత్రిక 'ఆంధ్రజ్యోతి' జగన్‌కు గుర్తు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి జగన్‌ విధించిన గడువు మరో పదిహేను రోజుల్లో ముగుస్తుందని వేమూరి రాధాకృష్ణ 'కొత్త పలుకు'లో రాశారు.

జగన్‌ను విమర్శస్తూ  ఏపీ టీడీపీ అధ్యక్షుడు కమ్‌ మంత్రి కళా వెంకటరావు రాసిన బహిరంగ లేఖలోనూ ఇదే విషయం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తామని జగన్‌ ప్రకటించారు. మరి ఎంపీలు రాజీనామా చేస్తే మద్దతు ఎలా ఇస్తారు? తాజాగా వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు జగన్‌ ప్రధానిని కలవడాన్ని పూర్తిగా సమర్థిస్తూ టీడీపీపై విమర్శలు చేశారు. ఆ సందర్భంగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే వైకాపా ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. దానికి కట్టుబడి ఉన్నామన్నారు.

ప్రత్యేక హోదా కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, అవి సఫలం కాకపోతే చివరి అస్త్రంగా ఎంపీలు రాజీనామా చేస్తారని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే జగన్‌ చెప్పినట్లు జూన్‌లో ఎంపీలు రాజీనామాలు చేయరు. ప్రయత్నాలు సఫలం కాకపోతే చేస్తారట...! కాని ఆ ప్రయత్నాలేమిటో తెలియదు.

2016 నవంబరులో మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం....హోదా కోసం పార్లమెంటులో పోరాడాలని, 2017 బడ్జెటు సమావేశాల్లోగా హోదా ఇవ్వకపోతే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయాలని పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. రాజీనామాలకు ఈ నెల (మే) 15వ తేదీ ముహూర్తంగా నిర్ణయించారు. ఆ తరువాత ఆ గడువు జూన్‌కు మారింది.

అంబటి చెప్పేదాన్నిబట్టి ఈ గడువు ఇంకా వాయిదా పడుతుంది. బీజేపీతో ఏదైనా అవగాహన కుదిరితే అసలు రాజీనామాలు చేయకపోవచ్చు కూడా. దానికేదో కథ అల్లేసి వినిపిస్తారు. ఎంపీలు రాజీనామాలు చేయకపోతే టీడీపీ జగన్‌ను కాకిలా పొడుస్తుంది. అప్పుడు ఆయనేం సమాధానమిస్తారో....!