cloudfront

Advertisement


Home > Politics - Gossip

పదవులు అశాశ్వతం, మోడీ భజన శాశ్వతం

పదవులు అశాశ్వతం, మోడీ భజన శాశ్వతం

రాష్ట్రానికి కేంద్రం ఇంత స్పష్టంగా అన్యాయం చేస్తున్నదని ప్రతి సామాన్యుడికీ విపులంగా అర్థం అవుతోంటే.. భాజపా రాష్ట్ర నాయకులు మాత్రం.. ఎందుకు మోడీ సర్కారు చర్యలనే సమర్థిస్తూ రోజులు వెళ్లదీస్తున్నారు? జరుగుతున్న నష్టం కళ్లకు కడుతోంటే.. తాము మాత్రం మోడీ భజన చేస్తూ ఉండడం వలన ప్రజలు తమను ఛీ కొడతారనే భయం వారిలో లేదా? మళ్లీ తాము ఎన్నికల్లో ప్రజల ముందుకు రావాలని.. వారి ఓట్లు అవసరం తమకు ఉంటుందని.. అలాంటప్పుడు.. ప్రజల ఛీత్కారాలకు గురికాకుండా.. కేంద్రాన్ని ఒప్పించి అయినా .. రాష్ట్రానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారెందుకు ప్రయత్నించడం లేదు...?

ఇలాంటి సందేహాలు అనేకం సామాన్యులకు కలుగుతున్నాయి. ఆదివారం బెజవాడలో జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో కూడా ఇలాంటి చర్చ కూడా నాయకుల మధ్య చోటు చేసుకుంది. అయితే పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం మరో రకంగా ఉంది.

ఏపీలో కీలకంగా ఉన్న, ప్రస్తుతం తెలుగుదేశం మీద దాడిచేస్తున్న, అదేపనిగా.. కేంద్రాన్ని సమర్థిస్తూ మాట్లాడుతున్న అనేక మంది నాయకులు.. భిన్నమైన వ్యూహంతో ఉన్నారుట. ప్రజలు ఓట్లు వేసి గెలిపించే ఎన్నికలు అశాశ్వతం అని.. కానీ భాజపా పార్టీ, మోడీ నాయకత్వం మాత్రం శాశ్వతం అని వారు భావిస్తున్నారట.

రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు వస్తే మళ్లీ తాము గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు. కానీ.. కేంద్రంలో మాత్రం మళ్లీ మోడీ గ్యారంటీగా వస్తారు. కాబట్టి.. ఆయనకు వ్యతిరేకంగా, ఆయనకు ఆగ్రహం కలిగేలాగా మాత్రం మనం మాట్లాడకూడదు అని వారు నిర్ణయించుకుంటున్నారట. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయినా పర్లేదు గానీ.. మోడీ ప్రాపకం స్ట్రాంగుగా దక్కిందంటే మాత్రం.. తమ వ్యక్తిగత రాజకీయ వైభవానికి ఢోకా లేకుండా రోజులు గడచిపోతాయని వారు  భావిస్తున్నారట.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం బీజేపీని తిడుతున్న సమయంలో తాము అండగా నిలబడితే.. రేపు  పార్టీ ఓడిపోయినా కూడా.. తామంతా ఓడిపోయినా కూడా.. కేంద్రంలో మోడీ సర్కారు వస్తే.. దేశంలో ఏదో ఒక మూల నాలుగు కాంట్రాక్టులు దక్కించుకుంటే గుట్టుచప్పుడు కాకుండా.. కోట్లు వెనకేసుకోవచ్చునని.. అందుకే రాష్ట్రం కోసం వకాల్తా పుచ్చుకోవడం కంటె.. మోడీ భజన చేసి తరిస్తే.. తమకు కలకాలం లాభసాటిగా ఉంటుందని వారనుకుంటున్నారట. మరి ఇలాంటి వక్రఉపాయాలు వారిని ఎంతకాలం కాపాడుతాయో చూడాలి.