Advertisement


Home > Politics - Gossip
'మన్నార్‌గుడి' తప్పుకుంటే 'అమ్మ' పార్టీ బతుకుతుందా?

రాజకీయాల్లో, సినిమా రంగంలో కొందరిని 'ఇనుప కాలు' (ఐరన్‌ లెగ్‌)గా, కొందరిని 'బంగారు కాలు' (గోల్డెన్‌ లెగ్‌)గా భావిస్తుంటారు. ఐరన్‌ లెగ్‌, గోల్టెన్‌ లెగ్‌ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండకపోయినా ఇదో నమ్మకం. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే శశికళ వర్గం ప్రభుత్వం ప్రస్తుతం కష్టాల ఊబితో ఇరుక్కుంది. మంత్రితో సహా భారీఎత్తున ఆదాయపు పన్ను శాఖ దాడులు జరగడం, ముగ్గురు మంత్రులపై కేసులు నమోదు కావడం, ముఖ్యమంత్రి పళనిసామి చిక్కుల్లో పడటం తదితర పరిణామాలన్నింటికీ అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ అక్క కుమారుడు కమ్‌ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ కారణమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు  నిర్ధారణకు వచ్చారు. దినకరన్‌ పదవి నుంచి తప్పుకుంటే అన్నాడీఎంకే బతుకుతుందని, ప్రభుత్వం కష్టాల నుంచి బయటపడుతుందని భావిస్తున్నారు. శశికళ, దినకరన్‌ పార్టీని తమ నియంత్రణలోకి తీసుకున్న మరుక్షణం నుంచి కేంద్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసింది. శశికళ ముఖ్యమంత్రి అవుదామనుకున్న సమయంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరింపచేసి జైలుకు పంపింది. 

ఎన్నికల కమిషన్‌ ఆర్కే నగర్‌ ఉప ఎన్నికను వాయిదా వేసింది. శశికళ పార్టీ పదవికి ఎంపిక కావడం అక్రమమా? సక్రమమా? అనేది ఎన్నికల సంఘం విచారిస్తోంది. అన్నాడీఎంకేలోని రెండు వర్గాల పోరాటం కారణంగా ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తు 'రెండాకులు' స్తంభింపచేసింది. అన్నాడీఎంకే పేరును కూడా ఫ్రీజ్‌ చేయడంతో రెండు వర్గాలు పార్టీ పేరు పక్కన 'అమ్మ', పురట్చితలైవి' అని చేర్చుకున్నాయి. తాజాగా ఐటీ దాడులు జరిగాయి. ఇక ముందు ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. ఇదంతా శశికళ, ఆమె అక్క కుమారుడు దినకరన్‌ కారణంగానే జరుగుతోందని మంత్రులు, ఎమ్మెల్యేలు బలంగా నమ్ముతున్నారు. శశికళ జైల్లో ఉంది. దినకరన్‌ బయట ఉండి వ్యవహారాలు నడిపిస్తున్నాడు. ఆర్కే నగర్‌లో శశికళ వర్గం అభ్యర్థి కూడా ఆయనే.  దీంతో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు  ఆయనపట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దినకరన్‌ పదవి నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారు. దీంతో దాదాపు డజన్‌ మంది ఎమ్మెల్యేలు, అంతే సంఖ్యలో  మంత్రులు మొన్న తమిళ సంవత్సరాదినాడు దినకరన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

ఈ సందర్భంగానే వారు ఆయనతో పదవి నుంచి దిగిపోవాలని కోరారని సమాచారం. అలాగే పన్నీరు శెల్వం వర్గాన్ని పార్టీలోకి తీసుకోవాలని  కూడా డిమాండ్‌ చేశారట...! అయితే దినకరన్‌ ఈ వార్తలను తోసిపుచ్చారు. కేవలం తనకు శుభాకాంక్షలు చెప్పడానికే వారు వచ్చారని అన్నారు. అయితే అన్నాడీఎంకే శశికళ  వర్గంలో తిరుగుబాటు ధోరణులు కనబడుతున్నాయని అన్ని ఆంగ్ల పత్రికలు రాశాయి. మన్నార్‌ గుడి మాఫియా కారణంగానే పార్టీ చీలిపోయి ఇన్ని కష్టాలు వచ్చిపడ్డాయని ఎక్కువమంది నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. శశికళ, దినకరన్‌ లేకపోతే పార్టీ సమైక్యంగా ఉంటుందని చెబుతున్నారు. చిన్నమ్మ, దినకరన్‌ తమ పదవులు వదిలేస్తే పార్టీ సమైక్యంగా ఉండటమే కాకుండా ఎన్నికల చిహ్నం రెండాకులు మళ్లీ వస్తుందని అనుకుంటున్నారు. మన్నార్‌గుడి మాఫియా నుంచి పార్టీని రక్షించుకోవాలని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారట...! 

అన్నాడీఎంకే అస్తవ్యస్తంగా మారితే డీఎంకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దొరుకుతుందేమోనని భయపడుతున్నారు. తాము చెప్పింది వినకుండా దినకరన్‌ మొండికేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కొందరు మంత్రులు హెచ్చరించారని సమాచారం. శశికళ వర్గంలో జరుగుతున్న పరిణామాలను పన్నీరుశెల్వం వర్గం ఆసక్తితో గమనిస్తోంది. పళనిసామి మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు పన్నీరుశెల్వంను ప్రశంసలతో ముంచెత్తారు. అన్నాడీఎంకే రెండు వర్గాలు ఒక్కటై పన్నీరుశెల్వం నాయకత్వంలో పనిచేయాలని కోరారు. పన్నీరు నాయకత్వంలో మాత్రమే పార్టీకి ఓట్లు పడతాయంటున్నారు. శశికళ పేరు చెప్పికొని ఓట్లు అడిగితే ప్రజలు 'పచ్చడి' చేసేలా ఉన్నారని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. మరి కొద్ది రోజుల్లోనే మన్నారుగుడి మాఫియాను బయటకు పంపి పార్టీని సమైక్యం చేస్తామని కూడా చెప్పారు. ఆదాయపు పన్ను శాఖ దాడులతో శశికళ వర్గానినికి బలమైన దెబ్బ తగలగా, మరో దెబ్బ విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన 'ఫెరా' కేసులో తగిలింది. ఇరవై ఏళ్ల క్రితం నాటి ఈ కేసు మళ్లీ తెర మీదికి వచ్చింది. శశికళ, దినకరన్‌ నిందితులుగా ఉన్న ఈ కేసు విచారణకు రాబోతున్నది. ఇందులో నేర నిరూపణ జరిగితే శశికళకు, దినకరన్‌కు జైలు శిక్ష పడుతుంది.