cloudfront

Advertisement


Home > Politics - Gossip

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి: వైసీపీ లాజిక్‌ ఇదే

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి: వైసీపీ లాజిక్‌ ఇదే

'ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. ఈ రెండిట్లో దేంట్లోకి దూకినా అది ఆత్మహత్యే అవుతుంది. ఈ సంకట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజల తరఫున నిలబడ్డాం..' ఇదీ వైఎస్సార్సీపీ ముఖ్యనేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల సారాంశం.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికకు సంబంధించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తటస్థ వైఖరికి పరిమితమయ్యింది. ముందుగా విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన వైఎస్సార్సీపీ, అనూహ్యంగా 'రివర్స్‌ గేర్‌' వేసింది. దానిక్కారణం, రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ పాపం ఎంతవుందో, బీజేపీ పాపం కూడా అంతేవుందనీ.. ఈ రెండు పార్టీల్లో దేనికీ మద్దతివ్వాలని తాను అనుకోవడంలేదనీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విభజనతో కాంగ్రెస్‌ ద్రోహంచేస్తే, విభజన తర్వాత బీజేపీ ద్రోహం చేసిందన్నది ఆయన వాదన.

మరి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల సంగతేంటి.? అని ప్రశ్నిస్తే, 'రాజ్యంగ బద్ధమైన పదవులకు సంబంధించి ఏకగ్రీవం కావడమే మంచిది' అన్న ఉద్దేశ్యంతోనే తాము అప్పుడలా వ్యవహరించామంటూ, ఆ సమయంలో బీజేపీకి వైఎస్సార్సీపీ సహకరించిన వైనంపై విజయసాయిరెడ్డి వివరణ ఇచ్చుకున్నారు. ఇప్పుడు మాత్రం, వైఎస్సార్సీపీ తీరు బీజేపీని వ్యవహరిస్తున్నట్లు ఎలా అవుతుంది.? అన్న చర్చ జరగడం సహజమే. తటస్థ వైఖరి.. అంటే, పరోక్షంగా బీజేపీకి వైఎస్సార్సీపీ సహకరించినట్లే. ఇందులో ఇంకోమాటకు తావులేదు.

నిజానికి, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక హోరా హోరీగా జరిగే పరిస్థితులు కనిపించాయి. ఇలాంటప్పుడు ఒక్క ఓటు అయినా ఎంతో విలువైనదే. వైఎస్సార్సీపీకి రెండు ఓట్లున్నాయి రాజ్యసభలో. ఆ రెండూ ఇప్పుడు తటస్థం. అంటే అటు కాంగ్రెస్‌ అభ్యర్థికిగానీ, ఇటు ఎన్డీయే అభ్యర్థికిగానీ వైఎస్సార్సీపీ ఓటు వేయదన్నమాట. చిత్రమేంటంటే, తెలుగుదేశం పార్టీ - కాంగ్రెస్‌ అభ్యర్థికి అనుకూలంగా ఓటేయాలని నిర్ణయించుకోవడం. టీడీపీ కాంగ్రెస్‌కి మద్దతిచ్చింది. మేం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తామని నిన్న మొన్నటిదాకా చెప్పిన వైఎస్సార్సీపీలో ఇంతమార్పు ఎందుకు వచ్చిందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి. 

ప్రస్తుతం ఎన్డీయే ప్రతిపాదించిన అభ్యర్థి హరివంశ్‌ 125 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  హరిప్రసాద్‌ కు 105 ఓట్లు వచ్చాయి. విపక్షాల్లో అనైక్యత సహా, అనేక ఈక్వేషన్స్‌ నేపథ్యంలో గట్టిపోటీ ఇస్తారనుకున్న కాంగ్రెస్‌ అభ్యర్థి హరిప్రసాద్‌.. ఎన్నికకు కొద్దిగంటల ముందు దాదాపు పరాజయాన్ని ఖరారు చేసుకున్నట్లయ్యింది.