cloudfront

Advertisement


Home > Politics - Gossip

ముత్తంశెట్టి దీక్షపై చంద్రబాబుకు ఫిర్యాదులు

ముత్తంశెట్టి దీక్షపై చంద్రబాబుకు ఫిర్యాదులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించడం కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నది? సైకిల్ ర్యాలీలు చేయడం, ఎంచక్కా ఏ వేదిక దొరికినా సరే.. నరేంద్రమోడీని తీవ్రస్థాయిలో తూర్పారపట్టడం తప్ప వారు చేస్తున్నది ఏమీ లేదనే సంగతి అందరికీ తెలుసు. ఢిల్లీలో అవిశ్వాసం నోటీసుల తర్వాత రాష్ట్రానికి వచ్చేసి తెలుగుదేశం ఎంపీల్లో ఆ తర్వాత ఎవ్వరైనా, ఎన్నడైనా ప్రత్యేకహోదా గురించి గట్టిగా మాట్లాడారా, తమ పోరాట నైజాన్ని కనబరిచారా? అంటే.. ఆ ఘటనలను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

అలాంటిది ఇప్పుడు తెలుగుదేశానికి చెందిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్, తన పుట్టిన రోజు చేసుకోకుండా ప్రత్యేకహోదా కోసం రిలే నిరాహార దీక్ష చేశారు. అయితే ట్విస్టు ఏంటంటే.. ముత్తంశెట్టి దీక్ష గురించి తెలుగుదేశంలోని కొన్ని వర్గాల నాయకులు అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన అయిదుగురు ఎంపీలు ఢిల్లీ ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తేనే.. హోదా డిమాండును కేంద్రం ఖాతరు చేయలేదు. అలాంటిది.. తెలుగుదేశానికి చెందిన వారిలో ఒక ఎంపీ.. ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తే ఫలితం ఉంటుందనుకోవడం భ్రమ. కాకపోతే.. తెదేపా ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్.. పార్టీకి అతీతంగా తన వ్యక్తిగత ఇమేజి పెంచుకునేలా వ్యవహరిస్తున్నారని, కొన్ని కోణాల్లో ఆయన తీరు పార్టీకి నష్టం చేయవచ్చునని కొందరు నాయకులు ఫిర్యాదుచేసినట్లుగా సమాచారం.

విషయం ఏంటంటే.. ముత్తంశెట్టి నిర్దిష్టంగా ఇలాంటి దీక్ష చేయడం వలన తెలుగుదేశం పార్టీలోని మిగిలిన ఎంపీలు ఏమీ చేయడం లేదు.. ఎవరికి వారు వారి వారి వ్యాపారాలు చూసుకుంటూ గడిపేస్తున్నారు.. అనే భావన ప్రజల్లోకి వెళుతుందని, పార్టీ ఆదేశాలకు కట్టుబడి పార్టీ సూచించిన రూట్ మ్యాప్ ప్రకారమే తాము కార్యక్రమాలు చేస్తున్నామని, అలాంటప్పుడు పార్టీ యాక్షన్ ప్లాన్ లో లేకుండా ముత్తంశెట్టి దీక్షకు దిగడం మిగిలిన వారి పరువు తీసేలా ఉందని.. పలువురు ఎంపీలు భావిస్తున్నారు.

ఇదే విషయాన్ని వారు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ముత్తంశెట్టి చేసిన పనివల్ల.. తతిమ్మా పార్టీ ఏమీ చేయడం లేదనే విషయం ప్రజలకు అర్థమవుతుందని అందరూ అనుకుంటున్నప్పటికీ, ఆయనను మందలించినా హెచ్చరించినా మరింతగా పార్టీ పరువు పోతుందేమోనని భయపడుతున్నారు.