Advertisement


Home > Politics - Gossip
నంద్యాల్లో కుల సమీకరణాలే గెలిపిస్తాయా...?

నంద్యాలను వార్డుల వారీగానో, బూత్‌ల వారీగానో విభజించకుండా.. కులాల వారీగా విభజించింది మీడియా. ప్రత్యేకించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల ఉపఎన్నిక షురూ అయ్యాకా మొదలుపెట్టిన కులాల వారీగా ప్రోత్సాహకాలతో నంద్యాల ఉప ఎన్నికను కుల సంగ్రామంగా చూస్తోంది మీడియా. ప్రధానంగా రెండు మూడు కులాలే జనాభా పరంగా ఎక్కువగా ఉండటంతో.. మీడియాకు కూడా చాలా ఈజీగా విశ్లేషించేస్తోంది. చంద్రబాబు ఒక్కో కులం తరపు నుంచి ఒక్కోరిని రంగంలోకి దించాడు.. కాబట్టి.. అయిపోయింది, అన్ని కులాలూ టీడీపీకే సాలిడ్‌గా అని ఒకవర్గం మీడియా విశ్లేషిస్తోంది.

కానీ కులాల వారీగా లెక్కలేసి ఎన్నికల్లో నెగ్గాలని చూడటం చంద్రబాబుకు అలవాటేమో కానీ నంద్యాల మాత్రం కులాల వారీగా నేతలను ఎన్నుకున్న చరిత్ర లేనిది. ఇక్కడ మెజారిటీ ఫలానా కులస్తులున్నారు కాబట్టి.. ఆ కులస్తులను రంగంలోకి దించేయాలని బాబు లాంటి వారు లెక్కలు వేస్తే వేయొచ్చు కానీ, నంద్యాల చరిత్రను బట్టి చూస్తే మాత్రం.. కులం ఇక్కడ సమీకరణమే కాదు.. అనేది స్పష్టం అవుతోంది.

ముస్లింల ఓట్లు అరవై వేల వరకూ ఉన్నాయని బాబుగారే తేల్చారు. ఒక్క ఓటు పక్కకు పోకూడదని హుకుం జారీ చేశారు. అలాగే నంద్యాల ఉపఎన్నిక షురూ కాగానే అక్కడ ఇఫ్తార్‌ విందు ఇచ్చాడు. నియోజకవర్గంలోని పార్టీ సీనియర్‌ నేత ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చాడు. అంతేనా.. నంద్యాల్లో గెలిచి వస్తే ఫరూక్‌కు మండలి చైర్మన్‌.. అని కూడా బాబుగారు ప్రకటించేశారు! ఇదంతా అరవై వేల ఓట్లకు వేసిన గాలం.

ఇక మరో ప్రధాన వర్గం ఆర్యవైశ్యులు.. వీరిని బంధించేయడానికి టీజీ వెంకటేష్‌ను రంగంలోకి దించారట.. ఇప్పటికే టీజీ అనేకమార్లు ఇక్కడ తిప్పారు. అనేక సమావేశాలు నిర్వహించారు. ఇంకా నిర్వహిస్తున్నారు కూడా.

సంఖ్యాపరంగా మూడో స్థానంలో ఉండే బలిజల కోసం లోకల్‌ లీడర్లు.. ప్లస్‌ పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు! దీంతో వాళ్లు ఫిదా. ఇక దాదాపు ముప్పై వేలమంది వరకూ ఉన్న రెడ్ల కోసం ఏకంగా ఆదినారాయణ రెడ్డి, అఖిలప్రియా రెడ్డి, అమరనాథ్‌ రెడ్డి! వీరికి తోడు సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, ఇంకా జేసీ దివాకర్‌ రెడ్డి. అయిపోయింది. ఇక బీసీల కోసం కాలువ శ్రీనివాసులు!!

బాబుగారు ఇలాంటి కుల ఉచ్చు పన్నిన విధానాన్ని గమనించి వైకాపా కూడా అలర్ట్‌ అయ్యింది. వైశ్యులను ఆకట్టుకోవడానికి వీరభధ్రస్వామిని, ముస్లింల కోసం రెహమాన్‌ను, బలిజలను ఆకట్టుకోవడానికి బొత్స సత్యనారాయణను నంద్యాలకు పంపింది. ఇక రెడ్లను ప్రత్యేకంగా ఆకట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా వైకాపా ధీమాతో ఉంది.

మరి వీళ్ల లెక్కలు బాగానే ఉన్నాయి కానీ, నంద్యాలకు ఎప్పుడైనా కుల సమీకరణాల ఆధారంగా ఓట్లు వేసిన చరిత్ర ఉందా? పార్టీలు ఇంత ప్రయాస పడుతున్నాయి కదా.. వీటి వల్ల ప్రయోజనం ఎంత? అనేదే కీలకమైన అంశం. నంద్యాల్లో ప్రధానంగా నాలుగైదు సామాజికవర్గాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నా.. ఆయా కులాలు వన్‌ సైడెడ్‌గా నిలబడిన చరిత్రలేదు.. అని చెబుతున్నా ఈ నియోజకవర్గం పాత ఫలితాలు.

2004లో ఫరూక్‌ తెలుగుదేశం పార్టీ తరపున నిలబడ్డాడు, శిల్పా మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌ తరపున నిలబడ్డాడు. ఆ ఎన్నికల్లో ఫరూక్‌కు వచ్చిన 40వేలు అయితే, శిల్పాకు వచ్చిన ఓట్లు 90వేలు! స్వయంగా ముస్లిం అభ్యర్థి, ఫరూక్‌ వంటి సీనియర్‌ నిలబడితే.. పడ్డ ఓట్లు అవి. అందులో.. అన్ని సామాజికవర్గాల ఓట్లూ ఉన్నాయి. మరి ఇప్పుడు అదే ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవిని ఇస్తే ముస్లింలు సాలిడ్‌గా చంద్రబాబు పార్టీకి ఓటేస్తారా?

2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఏవీ సుబ్బారెడ్డి నిలబడ్డాడు. భూమా కుటుంబం అప్పట్లో ప్రజారాజ్యంలో చేరింది కదా.. ఏవీ సుబ్బారెడ్డికి నంద్యాల్లో టికెట్‌ ఇప్పించుకున్నాడు భూమా.. మరి భూమా బలగం ప్లస్‌ ప్రజారాజ్యం బలం కలిసి ముప్పైవేల ఓట్లకు తూగింది. మరి బలిజలు సాలిడ్‌గా ప్రజారాజ్యం పార్టీకి ఓటేసినట్టా? భూమాతో వచ్చే రెడ్డి ఓట్లు, ప్రజారాజ్యం తరపున నిలిచిన బలిజల ఓట్లు, ప్లస్‌ చిరంజీవికి పడిన అన్ని సామాజికవర్గాల ఓట్లు కలిసి ముప్పై వేలకు మూలిగాయి. మరి ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ వచ్చి చేయి ఊపితే.. బలిజల ఓట్లన్నీ గంపగుత్తగా ఆయన చెప్పిన వారికే పడతాయా? చిరు, పవన్‌లు కలిసి వచ్చినప్పుడు పడని ఓట్లు ఇప్పుడు పడతాయా?

ఇక వైశ్య సామాజికవర్గాన్ని టీజీ వెంకటేష్‌ ప్రభావితం చేసేస్తాడా? మరి అంత సీనే ఉంటే.. ఆయన ఎందుకు నామినేటెడ్‌ పదవి తీసుకుని వెళ్లిపోతాడు? అనేది నంద్యాల సగటు ఓటర్‌ ప్రశ్న!

నంద్యాల గత ఫలితాలన్నింటినీ కూలంకషంగా పరిశీలించిన పిమ్మట అర్థం అయ్యే విషయం ఏమిటంటే.. ఇక్కడ కుల సమీకరణాలు పారవు. అలా పారేటట్టు అయితే.. నంద్యాల నియోజకవర్గం ముస్లిం నేతలకో, లేక వైశ్య నేతలకో కంచుకోట కావాల్సింది! విజయవాడలో కమ్మోళ్ల జనాభా ఎక్కువ కాబట్టి.. అక్కడ ఏ పార్టీ అయినా కమ్మ వ్యక్తికే టికెట్‌ ఇస్తుంది కదా.. అదే లెక్కన నంద్యాల్లో కూడా కుల రాజకీయం చెల్లుబాటు అయ్యేటట్టు అయితే.. ఇక్కడ ముస్లిం నేతలో, మైనారిటీ నేతలో ఏనాడో పాతుకుపోవాల్సింది. 

అలా జరగలేదు. నియోజకవర్గంలో ఇతర సామాజికవర్గాలతో పోలిస్తే తక్కువ జనాభా అయిన 'రెడ్డి' సామాజిక వర్గీయులే ఇక్కడ విజయం సాధిస్తూ ఉన్నారు. కాబట్టి కుల సమరానికి నంద్యాల వందల మైళ్ల దూరంలో ఉందని స్పష్టం అవుతోంది. అయితే చంద్రబాబుగారు తనకు తెలిసిన రాజకీయాన్నే ఇక్కడ చేస్తున్నారు, ఒక్కో కులానికి ఒక్కో బిస్కెట్‌ వేస్తున్నారు. అదెక్కడ కొంప ముంచుతుందో అని జగన్‌ కూడా తనవంతు యత్నం చేస్తున్నాడు. చరిత్రను చూస్తే మాత్రం.. ఇక్కడ కులం చెల్లని కాసే అని స్పష్టం అవుతోంది.