Advertisement


Home > Politics - Gossip
రిటైర్మెంట్ కు ముందు ఫైనల్ జంపింగ్!

రాజకీయ జంపింగ్ జపాంగ్ నాయకులు చాలా మందే ఉంటారు. అధికారం ఎక్కడ ఉంటే వీరు ఆ పంచకు చేరుతూ ఉంటారు. అచ్చంగా అధికారం కోసం పార్టీలు మార్చే బాపతుకు చెందిన రాజకీయ నాయకుడు అని ముద్ర వేయలేం గానీ.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో సీనియారిటీ ఉన్నప్పటికీ.. ఒకటిన్నర దశాబ్దానికి పైగా.. మసకబారిపోయిన నాయకుడు.. రాజకీయ తన రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చేసిన తర్వాత కూడా.. ఫైనల్ గా మరో పార్టీలోకి జంపింగ్ నిర్ణయం తీసుకోవడం చిత్రంగానే పేర్కొనాలి. అవును ఇదంతా తెలంగాణలో ప్రస్తుతం ఆయన చెబితే తప్ప.. తాను ఏ పార్టీలో ఉన్నారో ప్రజలు గుర్తించలేని స్థితిలో ఉన్న నాగం జనార్దనరెడ్డి సంగతే ఇది.

నాగం జనార్దనరెడ్డి సీనియారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాన్ని ఏలిన కాలంలో చంద్రబాబు కొలువులో సభ్యుడిగా ఆయన హవా నడిపించారు. ఆ తర్వాత.. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత.. తెలుగుదేశానికి ఠికానా ఉండదనే నమ్మకంతో.. సొంత పార్టీ పెట్టుకున్నారు. పాత సహచరుడు.. అదివరకు తెదేపాలో తనకంటె చిన్న నాయకుడు అయిన కేసీఆర్ పార్టీలోకి వెళ్లడానికి ఆయనకు అప్పట్లో ఈగో అడ్డు వచ్చింది.

సొంత పార్టీ పెట్టుకున్నారే తప్ప.. ఉద్యమం దిశగా నడపడంలో ప్రజల నమ్మకం చూరగొనడంలో విఫలం అయ్యారు. ఫలితం.. పార్టీని గంగలో కలిపేసి.. తాను కమలదళంలో కలవాల్సి వచ్చింది. భాజపాలోకి వెళ్లారే తప్ప.. అక్కడి వారు ఆయన ఉనికిని కూడా పట్టించుకోలేదు. తన  సీనియారిటీకి ఏదో పెద్ద పదవులు ఇచ్చేస్తారని ఆయన ఆశిస్తే.. ఉన్న పదవులు పాతవారికే చాలవన్నట్లుగా వారు వ్యవహరించారు. ఆయన కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు, దీక్షలు యాత్రలు చేశారు గానీ.. వాటికి   కూడా పార్టీ మద్దతు దక్కలేదు.

ఇలాంటి నేపథ్యంలో తాను భాజపాలోనే ఉన్నట్లుగా ప్రతిసారీ తన అస్తిత్వాన్ని పదుగురికీ చెప్పుకోవాల్సిన స్థితిలో పడిన నాగం జనార్దనరెడ్డి.. ఇప్పుడు పార్టీ మారాలని అనుకుంటున్నారట. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

తెలంగాణ తెరాసకు వ్యతిరేకంగా శక్తులన్నీ ఏకీకృతం కావాలని అనుకుంటున్న కాంగ్రెస్ ఎవరొచ్చినా చేర్చుకునే స్థితిలో ఉన్నట్లు అనిపిస్తోంది. అదే సమయంలో.. వచ్చే ఎన్నికలు తనకు చివరివి అని.. తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని కూడా నాగం చెబుతున్నారు. అయితే ఎటూ రిటైర్ కాబోతున్న సమయంలో.. ఇప్పుడీ ఫైనల్ జంపింగ్ ఎందుకుట? అనే పాయింట్ లేవనెత్తుతున్న వారు కూడా లేకపోలేదు.

నాగం జనార్దనరెడ్డి చేరిక కాంగ్రెస్ లో నాయకత్వ సమీకరణాలు మారడానికి కారణం కావచ్చు. అక్కడ ప్రస్తుతం రేవంత్ కు ఉన్నట్టే, ఆయనకు కూడా ఎంట్రీ లభిస్తుంది. కానీ అగ్రపూజ దక్కుతుందా అనేది అనుమానమే. ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా పార్టీ మారితేనే ఆయనకు బాగుంటుందని, ఏదో దక్కుతుందని అనుకుని వెళితే.. అక్కడ కూడా భంగపాటు, అలక, అసంతృప్తి తోనే బతకాల్సి ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు.