cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఓదేలుకి హామీలు.. కార్యకర్తలే వెర్రిపుష్పాలు

ఓదేలుకి హామీలు.. కార్యకర్తలే వెర్రిపుష్పాలు

తల్లిదండ్రుల కోసం ఏనాడూ అంత సాహసం చేసి ఉండరు, భార్యాబిడ్డల కోసం ఎప్పుడూ అలాంటి కఠిన నిర్ణయం తీసుకోని ఉండరు, కనీసం తన భవిష్యత్ కోసం కూడా ప్రాణాలతో చెలగాటం ఆడి ఉండరు. అలాంటిది ఓ నాయకుడి కోసం ఓ కార్యకర్త ఆత్మాహుతి యత్నం చేశాడు. తనతో పాటు మరో 15 మందిని మంటల్లోకి నెట్టాడు. ఫలితం.. 16 మందికి గాయాలు, వారి మంటల్లో చలికాచుకున్న ఆ నేతకు హామీలు. ఇదీ తెలంగాణ ముందస్తు ఎన్నికల ముఖచిత్రం. 

టీఆర్ఎస్ తరపున మరోమారు టికెట్ దక్కించుకోలేకపోయిన చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఎట్టకేలకు తాను అనుకున్నది సాధించాడు. కేసీఆర్ బుజ్జగించి తాయిలం ప్రకటించడంతో ఆయన శాంతించాడు. అధినేతతో చర్చల అనంతరం పార్టీ అభ్యర్థి గెలుపుకి కృషిచేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు ఓదేలు. 

మనసు మార్చుకునేవాడు మరి కార్యకర్తల్ని ఎందుకు రెచ్చగొట్టాలి. ఆయన రెచ్చగొట్టాడు సరే.. ఎవరి కోసం చేస్తున్నామో, ఏం చేస్తున్నామో తెలియకుండా ఒంటిపై పెట్రోల్ పోసుకునేవాడికైనా బుద్ధుండాలి కదా. వాడితో పాటు మరో 15 మందికి ఆ మంటలు అంటుకుని గాయాలయ్యాయి. పరిస్థితి చేయిదాటి ఉంటే ఆ 16 కుటుంబాలకు ఎవరు సమాధానం చెబుతారు. 

తన ముచ్చట తీర్చుకోడానికి ముందస్తుకి రంకెలు వేసిన కేసీఆర్ దీనికి కారణం అయ్యేవారా, సీటు కోసం అలకబూని కార్యకర్తల్ని ఉసిగొల్పిన ఓదేలు ఈ ఘటనకు బాధ్యత వహిస్తారా? ఎవర్ని ఏమనుకున్నా తప్పు మనలోనే ఉంది. వ్యక్తిపూజ పరాకాష్టకు చేరితే ఫలితం ఇలాగే ఉంటుంది. విజ్ఞత లేకుండా ప్రవర్తిస్తే ఇలాంటి దుర్ఘటనలే పునరావృతం అవుతుంటాయి. 

నాయకుల్ని అభిమానించాలి, కానీ ఎంతవరకు? ఓదేలుకి టికెట్ రాకపోతే ఏమై ఉండేది, మహా అయితే ఈ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యే అయ్యి ఉండేవారు కాదేమో. అంతమాత్రాన ఆయనకు, ఆయన కుటుంబానికి వచ్చిన నష్టం ఏముంది. సంపాదన, పలుకుబడి కాస్త తగ్గుతుందేమో. అగ్నిప్రమాదంలో కార్యకర్తల ప్రాణాలు పోతే ఆ నష్టాన్ని ఎవరు పూడ్చేవారు. నాలుగు సానుభూతి మాటలు చెప్పి, నష్టపరిహారం ప్రకటించేవారు అంతేగా. 

అయినా చివరకు ఏమైంది. టికెట్ దక్కలేదన్న కోపంతో సవాళ్లు విసిరినా కేసీఆర్ తో చివరకు ఓదేలు రాజీపడతాడని అందరూ ఊహించిన విషయమే. అధిష్టానం, అయ్యవారు ఒకటైపోయారు. మధ్యలో కార్యకర్తలే వెర్రిపుష్పాలుగా మిగిలారు.