cloudfront

Advertisement


Home > Politics - Gossip

నందమూరి ఫ్యామిలీ అంతకన్నా ఇంకేం చేయగలదు?

నందమూరి ఫ్యామిలీ అంతకన్నా ఇంకేం చేయగలదు?

'పార్టీకి అవసరం అయితే.. నేనూ, తారక్‌ ఇద్దరం ఎన్నికల ప్రచారం చేస్తాం. పార్టీకి ఎప్పుడు అవసరమైనా సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నాం..' అని ప్రకటించాడు కల్యాణ్‌రామ్‌. తెలుగుదేశం పార్టీతో తమ అనుబంధం కొనసాగుతోందని కల్యాణ్‌రామ్‌ చెప్పాడు. మామ చంద్రబాబు విజన్‌ ఉన్న నేత అని, అందుకే ఆయన ప్రజాదరణను పొందాడు అని కల్యాణ్‌రామ్‌ చెప్పుకొచ్చాడు. ఒకేసారి అటు మామ చంద్రబాబును పొగిడేసి, పార్టీ తరఫున ప్రచారానికి కూడా సై అని ప్రకటించేసుకున్నాడు కల్యాణ్‌రామ్‌.

ఇక్కడ గమనించాల్సిన మొదటి అంశం ఏమిటంటే.. ఎన్టీఆర్‌ తరఫున కూడా కల్యాణ్‌రామ్‌ ప్రకటించేయడం. అన్నను అనే ఆత్మవిశ్వాసంతో చెప్పాడో, తమ్ముడు తనమాట జవదాటడు అనే ఫీలింగ్‌తోనే చెప్పాడో కానీ.. చంద్రబాబు కోరితే తను, తారక్‌ ఇద్దరం పార్టీ కోసం ప్రచారం చేస్తామని అన్నాడు. ఈ మధ్య కాలంలోనే కాదు, చాలాకాలం నుంచినే తారక్‌కు తెలుగుదేశంతో దూరం పెరిగింది. 2009 ఎన్నికల ప్రచారంలో ఎన్టీఆర్‌ను తెగవాడేశాడు చంద్రబాబు. అయితే ఫలితం దక్కలేదు. ఆ తర్వాత ప్రాధాన్యత తగ్గించేశారు. లోకేష్‌ను తెరపైకి తేవడం, పార్టీ అధికారం అందుకున్నాకా తారక్‌ను చంద్రబాబు తనదైన రీతిలో సైడేసేయడం జరిగింది. 

అయితే కల్యాణ్‌ రామ్‌ను మాత్రం చంద్రబాబు టచ్‌లో పెట్టుకున్నాడు. ఆ మధ్య లోకేష్‌ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఇటీవల ఎన్టీఆర్‌ బయోపిక్‌ ఆరంభోత్సవానికి కూడా పిలిచారు. కల్యాణ్‌ రామ్‌ను చంద్రబాబు అండ్‌ కో ప్రత్యేకంగానే ఈ కార్యక్రమాలకు ఆహ్వానించారో లేదో కానీ.. ఈ హీరో బాబు, బాబాయ్‌ల మద్దతుదారు అయ్యాడు. హరి కుటుంబానికి బాబు, బాలయ్యలతో దూరం పెరిగిందని అనుకుంటే.. కల్యాణ్‌రామ్‌ మాత్రం అలాంటిదేమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు.

ఇక గమనించాల్సిన రెండో విషయం ప్రస్తుతానికి చంద్రబాబును సమర్థించుకొంటూ పోవడమే తప్ప నందమూరి ఫ్యామిలీకి ఇంకో మార్గంలేదు. అలాగే ఇంకో విషయం ఇప్పుడు ప్రచారం చేస్తామన్నా.. ఎన్టీఆర్‌ అవసరం కానీ, కల్యాణ్‌రామ్‌ అవసరం కానీ చంద్రబాబుకు లేనే లేదు. ఆయన చేతిలో అధికారం ఉంది కాబట్టి వీరి అవసరం ఇప్పుడు లేనేలేదు. కాబట్టి.. కల్యాణ్‌ రామ్‌కు పిలుపు అయితే వచ్చే అవకాశాల్లేవు!