Advertisement


Home > Politics - Gossip
ఈ బ్లాక్‌మెయిల్‌ రాజకీయం.. నంద్యాల్లో వర్కవుట్‌ అవుతుందా?

రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన ఇప్పుడు చేస్తాం.. రోడ్లు వేసేది మాత్రం.. నంద్యాల్లో టీడీపీ అభ్యర్థి గెలిస్తేనే, ఇళ్ల పట్టాలకు, ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు ఇప్పుడు తీసుకుంటాం.. కానీ ఇళ్లను నిర్మించేది మాత్రం నంద్యాల్లో టీడీపీ అభ్యర్థి గెలిస్తేనే.. ఇవీ ప్రభుత్వం తరపు నుంచి వినిపిస్తున్న మాటలు. ఉపఎన్నిక అనివార్యం అయిన నేపథ్యంలో నంద్యాలను డెవలప్‌మెంట్‌తో తడిపేస్తున్నారు తెలుగుదేశం వాళ్లు. అయితే ప్రతిదానికీ షరతు.. నంద్యాల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలి.. అని!

ఇప్పటి వరకూ నంద్యాల్లో కొన్ని వందలకోట్ల రూపాయల విలువజేసే డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌కు శంకుస్థాపనలు జరిగాయి. ఇవన్నీ కూడా టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తేనే పూర్తి అవుతాయి అని టీడీపీ నేతలు ఓపెన్‌గా చెబుతున్నారు. పబ్లిక్‌ను పబ్లిక్‌గానే బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. అలాగే దాదాపు నలభైవేల మంది నుంచి కొత్త ఇళ్లకు దరఖాస్తులు తీసుకున్నారు.

ఇప్పుడు అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నాం కానీ.. ఈ ఇళ్లు శాంక్షన్‌ కావాలంటే.. నంద్యాల్లో టీడీపీ గెలవాలని ప్రజలకు సూటిగా చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థి గెలవకపోతే.. ఇళ్లు శాంక్షన్‌ అయ్యేది ఉండదని స్పష్టం చేస్తున్నారు.

ఓవరాల్‌గా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ప్రజలకు ఆశలు పెట్టి.. రాజకీయం చేస్తున్నారు. దీని ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి.. ఈ తెగింపు రాజకీయాన్ని, ప్రలోభ రాజకీయాన్ని ప్రజలు ఎంతవరకూ సహిస్తారు.. అనేది ఇక్కడ వచ్చే ఫలితాన్ని బట్టి అర్థం అవుతుంది. కామెడీ ఏమిటంటే.. ప్రజలనే కాదు, పార్టీ నేతలను కూడా ఇలాగే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు బాబు.

ఎమ్మెల్సీ పదవిని ఇస్తా, మండలి చైర్మన్‌ పదవిని ఇస్తా.. అని సీనియర్‌ నేత ఫరూక్‌కు హామీ ఇచ్చారు చంద్రన్న. కానీ.. నంద్యాల్లో భూమా బ్రహ్మానందరెడ్డి గెలిస్తేనే.. అని చంద్రబాబు స్పష్టం చేశారు.