Advertisement


Home > Politics - Gossip
'నంద్యాల' తేలాక అమిత్‌ వ్యూహం?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చాలా కాలంగా ఓ పాట పాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని, ఆంధ్రాలో పార్టీని బలోపేతం చేస్తామని, విస్తరిస్తామని చెబుతున్నారు. తెలంగాణలో ఏం జరుగుతుందనేది పక్కన పెడితే ఆంధ్రాలో టీడీపీతో బీజేపీ కలిసి నడుస్తుందా? అనేది స్పష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఆంధ్రాలో ఏదో చేయాలనే తపన కనబడుతోందనేది స్పష్టమవుతోంది. ఏపీకి సంబంధించి అమిత్‌ షా దగ్గర కొన్ని వ్యూహాలున్నాయి.

ఆ వ్యూహాలు అమలు చేయాలంటే ఆయనకు ఏపీ రాజకీయ పరిస్థితి, పరిణామాలపై స్పష్టత రావాలి. అది రావాలంటే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితం తేలాలి. అందుకే ఉప ఎన్నిక ఫలితం తేలిన తరువాతే ఆంధ్రప్రదేశ్‌కు రావాలనుకుంటున్నారు. ఈ నెలాఖరులో (ఆగస్టు) వస్తారని సమాచారం. ఉప ఎన్నికలో టీడీపీ గెలిస్తే వ్యూహం ఒక విధంగా, వైకాపా విజయం సాధిస్తే ఒక రకంగా ఉంటుంది.

రెండు పార్టీలకు వచ్చిన మొత్తం ఓట్లు ఎన్ని? ఏ సామాజిక వర్గం నుంచి ఎన్ని ఓట్లు పడ్డాయి? ఏ వర్గం (యువత, మహిళలు, రైతులు మొదలైన వర్గాలు) ఏ పార్టీకి అనుకూలంగా ఉంది?...ఇలా ఉప ఎన్నికను అమిత్‌ పలు కోణాల నుంచి విశ్లేషిస్తారట...! నంద్యాల ఉప ఎన్నికలో ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీయే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందనే ప్రచారం సాగుతోంది. అయితే అమిత్‌ షా దీన్ని ప్రాతిపదికగా తీసుకోరని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయానికైనా, వైకాపా గెలుపుకైనా ఈ ఉప ఎన్నిక ఫలితమే ప్రాతిపదికగా ఉండదని, అనేక అంశాలు సాధారణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయని బీజేపీ నాయకులు చెబుతున్నారు. అమిత్‌ విశ్లేషణ ఆధారంగా, రాష్ట్ర బీజేపీ నాయకుల అభిప్రాయాల ప్రాతిపదికగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయం నిర్ణయమవుతుందని అంటున్నారు. ఉప ఎన్నికలో మిత్ర ధర్మం కనబడటంలేదు. అంటే టీడీపీతో కలిసి బీజేపీ ప్రచారం చేయడంలేదు. అంటే కమలం పార్టీ అసలు సీన్‌లోనే లేదన్నమాట. దీనిపై పలు కథనాలు వినబడుతున్నాయి.

బీజేపీని ఉద్దేశపూర్వకంగానే టీడీపీ పక్కన పెట్టిందట. ఎందుకు? నియోజకవర్గంలో ఎక్కువగా దళిత, ముస్లిం మైనారిటీ ఓటర్లున్నారట. బీజేపీ ప్రచారం చేస్తే ఈ ఓట్లు దూరం అవుతాయట. ఈ వర్గాలకు బీజేపీ అంటే పడదని చెబుతున్నారు. ఇక బీజేపీ నాయకులు చెబుతున్నదాని ప్రకారం...టీడీపీ కమలం పార్టీని ప్రచారానికి ఆహ్వానించలేదు. ఈ విషయమై టీడీపీ అధిష్టానం బీజేపీ నాయకత్వంతో అసలు మాట్లాడలేదు. బీజేపీని ఆహ్వానించలేదంటే దాన్ని పక్కన పెట్టినట్లే కదా.

వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రిగానే ఉన్నట్లయితే పొత్తు కొనసాగించడానికే ప్రయత్నాలు చేసేవారని, ఆయన అడ్డంకి  తొలగిపోయింది కాబట్టి అమిత్‌ షా ఏపీ విషయంలో స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశముందని, అవసరమైతే పొత్తు పెటాకులు చేయాలనే నిర్ణయం తీసుకుంటారని బీజేపీలో చంద్రబాబు వ్యతిరేకులు చెబుతున్నారు. అమిత్‌ షా రాష్ట్రానికి వచ్చాక చేసే ప్రధానమైన పనుల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకం ఒకటి. ప్రస్తుత అధ్యక్షుడు కంభంపాటి హరిబాబును కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని వార్తలొస్తున్నాయి.

వెంకయ్య నాయుడి మనిషిగా పేరుపడిన హరిబాబు సీఎం చంద్రబాబుకు అనుకూలుడనే అభిప్రాయముంది. దూకుడు స్వభావం లేని ఈయన టీడీపీ పట్ల మెతకగా వ్యవహరిస్తున్నారు. ఇది బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేకులకు నచ్చడంలేదు. కాని వెంకయ్య నాయుడు అడ్డుపడిన కారణంగా హరిబాబును మార్చడం కుదరలేదు. పలు రాష్ట్రాల్లో అధ్యక్షులు మారినా ఏపీలో సాధ్యం కాలేదు. వెంకయ్య ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించడంతో హరిబాబును మార్చబోతున్నారు. ఈయన స్థానంలో  'బాహుబలి' వంటి నాయకుడిని నియమించాల్సి ఉంది.

రాబోయే ఎన్నికల్లో పార్టీని సమర్థంగా నడిపించే సామర్థ్యమున్న నాయకుడు అవసరం. ఇలాంటి నాయకుడిని ఏ సామాజికవర్గం నుంచి ఎంపిక చేయాలనేదానిపై కసరత్తు సాగుతోంది. అమిత్‌ ముందు రెండు సామాజిక వర్గాలున్నాయి. ఒకటి రెడ్లు, రెండోది కాపులు. ఏపీలో ఈ రెండూ బలమైన వర్గాలు. రెడ్డి సామాజికవర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే నెల్లూరు జిల్లాకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి సురేష్‌ రెడ్డి కనబడుతున్నారు.

కాపు సామాజిక వర్గం నుంచి నియమించాలనుకుంటే ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు. విభజన సమయంలో కాంగ్రెసు నుంచి పార్టీలోకి వచ్చినవారు కూడా అధ్యక్ష పదవి కోసం ఆత్రంగా ఉన్నారు. కాని వీరి పేర్లే ప్రధానంగా వినబడుతున్నాయి. పార్టీలో వీర్రాజుకు ఎక్కువ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. దూకుడుగా వ్యవహరించే నేత కావాలనుకుంటున్నారు కాబట్టి ఈయన అందుకు సరిపోతారు. టీడీపీపై విమర్శలు చేయడంలో ఈయన ముందుంటారు. మరి ఎవరిని నియమిస్తారో చూడాలి. 

-మేనా