Advertisement


Home > Politics - Gossip
నంద్యాల వేదికగా నిస్సిగ్గు రాజకీయం

పార్టీ ఫిరాయింపులకు ఏ రాజకీయ పార్టీ అతీతం కాదిప్పుడు. అందరూ పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారం అని విమర్శించినవారే.. దురదృష్టవశాత్తూ అందరూ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్స హిస్తూ రాజకీయ వ్యభిచారాన్ని సర్వసాధారణంగా మార్చే స్తున్నవారే.! ప్రజాస్వామ్యంలో విలువలకు అర్థమెక్కడుంది.? కానీ, నైతిక విలువలనీ, సెంటిమెంట్‌ అనీ, ఇంకో టనీ ప్రజల్ని మభ్యపెట్టేందుకు అధికారంలో వున్న పార్టీలు పడ్తున్న పాట్లు చూస్తోంటే నవ్వు రాకుండా వుంటుందా.?

కర్నూలు జిల్లా నంద్యాలలో ఉప ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. నిజానికి, 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని వైఎస్సార్సీపీ గెలుచుకుంది. కానీ, గెలిచిన భూమానాగిరెడ్డి పార్టీ ఫిరాయించారు. మంత్రి పదవి కోసం ఆశపడి భంగపడ్డ భూమా నాగిరెడ్డి, గుండెపోటుతో మరణించిన విషయం విదితమే. అలా నంద్యాల ఉప ఎన్నిక ప్రత్యేక పరిస్థితుల్లో తలెత్తింది.

నిజానికి, ఈ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్సార్సీపీ జెండానే ఎగరాల్సి వుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతి చెందారు గనుక, ఆయన కుటుంబ సభ్యులకు అక్కడి నుంచి అవకాశమివ్వాలన్నది టీడీపీ వాదన. రేసులో భూమా కుటుంబం నుంచి ఎవరూ నిలబడలేదు. భూమానాగిరెడ్డి సోదరుడు కుమారుడు బ్రహ్మానందరెడ్డి బరిలోకి దిగారక్కడ. ఆసక్తికరమైన విషయమేంటంటే భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియ 'తండ్రి కోటా'లో మంత్రి పదవి దక్కించుకోగా, మరో కుమార్తె ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు, సర్దుకుపోయారు.

ఇదీ, నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యం. ఇక్కడ ఎవరు పోటీలో నిలవాలి.? ఎవరు గెలవాలి.? ఏ పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలి.? అన్న విషయాల్ని ఆలోచిస్తే, పూర్తిగా అధికార పార్టీ, ఆ ఛాన్స్‌ని ప్రతిపక్షానికే ఇచ్చి వుండాల్సింది. కానీ, పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం ద్వారా అనైతిక రాజకీయాలకు తెరలేపిన తెలుగుదేశం పార్టీ, భూమా కుటుంబాన్ని నానా తిప్పలూ పెట్టి, నానా రకాల రాజకీయమూ చేసి, చివరికి ఇప్పుడు విలువల గురించి మాట్లాడుతోంది.

ప్రతిపక్షం వైఎస్సార్సీపీ అభ్యర్థిని బరిలోకి దించడమే నేరమన్నట్లు ప్రచారం చేస్తోంది. ఇక్కడే, వైఎస్సార్సీపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిన శిల్పా చక్రపాణిరెడ్డితో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించడం ద్వారా వైఎస్‌ జగన్‌, 'నైతిక విలువల్ని' చాటేందుకు ప్రయ త్నించారు. శిల్పా చక్రపాణిరెడ్డి సోదరుడు శిల్పా మోహన్‌ రెడ్డి, నంద్యాల ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తోన్న విషయం విదితమే.

వాస్తవానికి, నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి శిల్పా మోహన్‌రెడ్డే పోటీ చేయాల్సి వుంది. చంద్రబాబు మార్క్‌ రాజకీయాల దెబ్బకి, శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీకి గుడ్‌ బై చెప్పాల్సి వచ్చింది. ఇలా ఎలా చూసినా, నంద్యాలలో తెలుగుదేశం పార్టీ పిల్లిమొగ్గలు సుస్పష్టం. స్వర్గీయ భూమానాగిరెడ్డిపై కేసులు నమోదయ్యింది టీడీపీ హయాంలోనే. మానసికంగా ఆయన వేధింపులకు గురయ్యారంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీనే. వైఎస్సార్సీపీ నేతగా వున్న సమయంలో భూమాపై అధికార టీడీపీ వేధింపులు ఏ స్థాయిలో వుండేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఆ వేధింపులు తాళలేక ఆయన అప్పట్లో గుండెపోటుకి గురయ్యారు కూడా. ఆ తర్వాత కోలుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి, మంత్రి పదవిని ఎరగావేసి, అనేకానేక రకాలుగా భూమానాగిరెడ్డిని వేధించి ఆయనతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేయించి, టీడీపీలోకి తీసుకొచ్చిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? భూమానాగిరెడ్డికి జరిగిన అన్యాయాన్ని బహుశా ఆయన కుమార్తె, మంత్రి అఖిలప్రియ మర్చిపోయారేమోగానీ, భూమా అభిమా నులు మాత్రం ఇప్పటికీ ఆనాటి ఆ వేధింపుల్ని మర్చిపో లేదు. సోషల్‌ మీడియా ద్వారా భూమా అభిమానులు, అఖిల ప్రియ అండ్‌ కో తీరుని తప్పుపడ్తున్న వైనాన్ని ఎలా విస్మరింగచలం.?

టీడీపీలో వున్నప్పుడు శిల్పా మోహన్‌రెడ్డి, నంద్యాల అభివృద్ధి కోసం నిధులు అడిగితే, 'డబ్బులెక్కడున్నాయ్‌.?' అని విసుక్కున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, నంద్యాల ఉప ఎన్నిక అనగానే కాళ్ళకు చక్రాలు కట్టుకుని కర్నూలు జిల్లా లో వాలిపోయారు. ఎడాపెడా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేశారు. ఇప్పుడేమో, టీడీపీలో వుండగా నంద్యాల నియోజకవర్గ అభివృద్ధికి శిల్పా మోహన్‌రెడ్డి అడ్డుపడ్డారంటే ఇదే తెలుగుదేశం పార్టీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు.

నిస్సిగ్గు రాజకీయానికి తెరలేపిన చంద్రబాబు అండ్‌ టీమ్‌, ప్రతిపక్షం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా.? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించినందుకు ఆయన ఉన్మాదిలా అధి కార పార్టీకి కన్పిస్తుండడం శోచనీయం కాక మరేమిటి.? పార్టీ ఫిరాయింపులనే ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న దెవరు.? ప్రలోభాలతో, బెదిరింపులతో ఉన్మాద రాజకీయాలకు పాల్పడుతున్నదెవరు.? నంద్యాల ఓటరే తేల్చాలి.!