Advertisement


Home > Politics - Gossip
'నరసింహుడు' అందరివాడేనా.?

'కుటుంబ పెద్దగా నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అపోహలు మామూలే, వాటిని సరిదిద్దడం నా బాధ్యత..'

- ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌

ఈ గవర్నర్‌ మాకొద్దు .. గవర్నర్‌ అంటే అధికార పార్టీకి ప్రతినిథిగా వ్యవహరించడమేంటి.?

- తెలంగాణ కాంగ్రెస్‌ నేతల విమర్శ

నరసింహన్‌, తెలంగాణకు మాత్రమే గవర్నర్‌లా వ్యవహరిస్తున్నారు. అక్కడ నివసిస్తున్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌ని నిర్లక్ష్యం చేయడం తగదు. మా కోసం వీలైనంత త్వరగా కొత్త గవర్నర్‌ని ఏర్పాటు చేయాలి.!

- ఏపీ బీజేపీ నేతల డిమాండ్‌

ఇ.ఎస్‌.ఎల్‌. నరసింహన్‌.. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌.. నిజానికి, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోనే గవర్నర్‌గా పనిచేసిన నరసింహన్‌, తనకున్న అపార 'అనుభవం'తో అత్యంత సున్నితమైన 'విభజన' అంశాన్ని డీల్‌ చేసిన వైనం అందరికీ తెల్సిందే. అప్పట్లో ఆయన తెలంగాణ వాదులనుంచీ, అదే సమయంలో సమైక్యవాదుల నుంచీ విమర్శలు ఎదుర్కొన్నారు. గవర్నర్‌ అన్నాక ఆ మాత్రం విమర్శలు మామూలేననుకోండి.. అది వేరే విషయం.

అయితే, మిగతా గవర్నర్లతో పోల్చితే నరసింహన్‌ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. పంచెకట్టుతో సంప్రదాయాలకు పెద్ద పీట వేయగలరు, అదే సమయంలో సూటు వేసుకుని దర్పం ప్రదర్శించగలరు. దైవభక్తి చాలా చాలా ఎక్కువ ఈయనకి. అన్నిటికీ మించి, తెలుగు నాట గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటినుంచీ తెలుగులో మాట్లాడేందుకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారాయన. అలా తెలుగువారికి నరసింహన్‌ చాలా చాలా దగ్గరయ్యారు. అదే సమయంలో, నరసింహన్‌కి వ్యతిరేకంగా రాజకీయ పార్టీల నినాదాలూ గడచిన ఏడేళ్ళలో తక్కువేమీ కాదు.

ఐపీఎస్‌ నుంచి గవర్నర్‌ దాకా.!

ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఐపీఎస్‌గా పనిచేశారు నరసింహన్‌ గతంలో. ఆ అనుభవం తనకు పనికొచ్చిందంటారాయన. తెలుగు నేలకు తనకు కొత్తేమీ కాదని గవర్నర్‌గా పదవిలో కూర్చున్నప్పుడే ఆయన చెప్పారు. రాష్ట్ర సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకు వుందనీ, పరిస్థితుల్ని డీల్‌ చేయగలననీ నరసింహన్‌ చెప్పిన మాటలు ఊరకే పోలేదు. ఆయన సమర్థత నేపథ్యంలోనే ఇన్నేళ్ళుగా ఆయన తెలుగు ప్రజలకి గవర్నర్‌గా కొనసాగగలుగుతున్నారన్నది నిర్వివాదాంశం. వివిధ అంశాల విషయంలో గవర్నర్‌ తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేస్తారు.

అది ఎంతటి సున్నితమైన అంశమైనా కావొచ్చు గాక.! అదే సమయంలో, 'గోప్యత' పాటించడంలోనూ నరసింహన్‌ రూటే సెపరేటు. అదే ఆయన్ని మిగతా గవర్నర్లతో పోల్చితే ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్రానికి ప్రధమ పౌరుడైన గవర్నర్‌, గత సంప్రదాయాలకు విరుద్ధంగా 'పేపర్‌ వెయిట్‌, రబ్బర్‌ స్టాంప్‌' అన్న ఆలోచనల్ని మార్చేసి, గవర్నర్‌గిరీకి కొత్త అర్థం చెప్పారనే అనుకోవాలి.

తెలంగాణ, సమైక్య ఉద్యమాలపై ఆయన రూటే సెపరేటు

తెలంగాణ ఉద్యమానికి సహకరిస్తున్నారని సమైక్యవాదులు, సమైక్య ఉద్యమానికి సహకరిస్తున్నారని తెలంగాణ వాదులు ఒకప్పుడు నరసింహన్‌పై దుమ్మెత్తిపోశారు. గవర్నర్‌ తమ గోడు పట్టించుకోవడంలేదని అప్పట్లో టీఆర్‌ఎస్‌ సైతం ఆయనపై మండిపడ్డ విషయాన్ని ఎలా మర్చిపోగలం.? కాంగ్రెస్‌ హయాంలో నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌కి (ఉమ్మడి రాష్ట్రం) గవర్నర్‌గా వచ్చినా, ఆ పార్టీ నేతలకూ ఆయన తీరు అప్పట్లోనే మింగుడుపడలేదు. టీడీపీ సంగతి సరే సరి. దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ఆయన్ని విమర్శించినా, నరసింహన్‌ చలించలేదు.

అత్యంత సున్నితమైన విభజన అంశంలో తన అభిప్రాయాల్ని ఆయన కేంద్రం వద్ద నిక్కచ్చిగా తేల్చి చెప్పేసేవారట. అయితే, అక్కడ ఆయన ఏం చెప్పారన్నది ఎవరికీ తెలియనంత గోప్యంగా వుండేది. ఢిల్లీకి నరసింహన్‌ ఎప్పుడు వెళ్ళినా, కేంద్రానికి నివేదికలు ఇవ్వడం మామూలే. అయినాగానీ, మీడియా ముందు ఆయన 'చిరునవ్వు'తోనే కన్పించేవారు. 'సాధారణ పర్యటన మాత్రమే..' అని చెబుతుంటారాయన. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడరు. తన మీద వచ్చే విమర్శల్నీ లైట్‌ తీసుకోవడం నరసింహన్‌కే చెల్లింది. రాష్ట్ర విభజనలో గవర్నర్‌ నరసింహన్‌ అత్యంత కీలక భూమిక పోషించారనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.

వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ ఈ 'నరసింహుడు'

గవర్నర్‌ నరసింహన్‌ గొప్ప భక్తుడు. 'రాష్ట్ర సమస్యలపై స్పందించేదేమన్నా వుందా.? ఎప్పుడూ గుళ్ళూ గోపురాలూ పట్టుకుని తిరగడమేనా.?' అని ఎంతోమంది రాజకీయ ప్రముఖులు నరసింహన్‌ని విమర్శించారంటే, ఆయన దైవభక్తి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. తిరుమల సహా తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దేవాలయాల్ని నరసింహన్‌ కన్నా ఎక్కువగా దర్శించుకున్న గవర్నర్‌ ఇంకొకరు లేరనడం అతిశయోక్తి కాదేమో.

దైవ దర్శనం విషయంలోనే కాదు, ప్రజలతో మమేకం అవడంలోనూ నరసింహన్‌ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారనీ, పార్టీ ఫిరాయింపులకు వత్తాసు పలుకుతున్నారనీ, ఢిల్లీ స్థాయిలోనూ, రాష్ట్రాల స్థాయిలోనూ లాబీయింగ్‌ చేసుకుంటూ పదవిని కాపాడుకుంటున్నారనీ నరసింహన్‌పై వచ్చే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఎవరెంతలా విమర్శించినా, నరసింహన్‌ నుంచి చిరునవ్వే సమాధానంగా వస్తుంటుంది.

ఆంద్రప్రదేశ్‌లో అలా, తెలంగాణలో ఇలా

ఏపీ బీజేపీ నేతలకి నరసింహన్‌ అంటే గిట్టడంలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి నరసింహన్‌ అంటే అస్సలేమాత్రం పొసగడంలేదు. మొన్నీమధ్యనే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు, గవర్నర్‌ని కలిసేందుకు వెళ్ళి అక్కడ పెద్ద పంచాయితీనే పెట్టుకున్నారు. ఆ విషయమై నరసింహన్‌ కూడా కొంత కలత చెందారట. హద్దులు దాటి కాంగ్రెస్‌ నేతలు వ్యవహరించినా, గవర్నర్‌ సంయమనం పాటించారనే వాదన తెరపైకొస్తోంది.

అదే సమయంలో, తన స్థాయిని మరచి నరసింహన్‌ అధికార టీఆర్‌ఎస్‌కి వత్తాసు పలికి, తమను అవమానించారన్నది కాంగ్రెస్‌ వాదన. ఇక, ఏపీ బీజేపీ నేతల వాదన ఇంకోలా వుంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెచ్చిన 'నాలా' బిల్లుకి ఆమోద ముద్ర వేసిన నరసింహన్‌, ఏపీ ప్రభుత్వం తెచ్చిన అదే 'నాలా' బిల్లుకి మాత్రం ఆమోద ముద్ర వేయకపోవడాన్ని ప్రశ్నిస్తోంది బీజేపీ. తక్షణం గవర్నర్‌ని మార్చేలా తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని సాక్షాత్తూ ఏపీ బీజేపీ ముఖ్య నేత విష్ణుకుమార్‌రాజు చెబుతుండడం గమనార్హం.

ఆ లాబీయింగే నరసింహన్‌ని కాపాడుతోందా.?

కాంగ్రెస్‌ హయాంలో గవర్నర్‌ అయిన నరసింహన్‌, బీజేపీ హయాంలోనూ గవర్నర్‌గా కొనసాగుతుండడం ఆషామాషీ విషయమేమీ కాదు. అప్పట్లో ఆయన కాంగ్రెస్‌ పెద్దల్ని మెప్పించగలిగారు. ఇప్పుడు బీజేపీ పెద్దల్ని మెప్పించగలుగుతున్నారు. నిజానికి, ఆయన కేంద్ర ప్రభుత్వ పెద్దలతో టచ్‌లో వుంటారన్నది నిజమేగానీ.. ఆ కేంద్రాన్ని నడిపేది మళ్ళీ రాజకీయ పార్టీలే కదా.! రాజకీయం వేరు, ప్రభుత్వం వేరని ఎలా అనగలం.? ఇక్కడ 'లాబీయింగ్‌' పనిచేస్తోందని అనకుండా వుండగలమా.?

ఆ సంగతెలా వున్నా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నరసింహన్‌ కేంద్రానికి ఇచ్చే నివేదికల్లో 'స్పష్టత, ఖచ్చితత్వం' ఆయన్ని ఇంకా గవర్నర్‌గా కొనసాగేలా చేస్తోందన్నది మరో ముఖ్యమైన వాదన. ఇందులోనూ నిజం లేకపోలేదు. గవర్నర్‌గా తన పరిధిలో, ప్రభుత్వాల్ని, వివిధ వ్యవస్థల్నీ ఆయన ప్రశ్నిస్తుంటారు. విద్యా వ్యవస్థపైనా, వైద్య రంగంపైనా గవర్నర్‌ అప్పుడప్పుడూ లేవనెత్తే అంశాలు, ప్రభుత్వాల చెంప ఛెళ్ళుమనిపించేస్తుంటాయి. ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల విషయంలో అప్పుడప్పుడూ గవర్నర్‌ చూపే చొరవ కూడా, ఆయన పట్ల కేంద్రానికి సానుకూలత పెరిగేలా చేస్తోందని చెప్పొచ్చు.

మొత్తమ్మీద, తెలుగు రాష్ట్రాల స్థాయిలో నరసింహన్‌ పట్ల ఆయా రాజకీయ పార్టీలకు వ్యతిరేకత వుండొచ్చేమోగానీ, కేంద్రం దృష్టిలో మాత్రం నరసింహన్‌ 'అందరివాడు' అన్నట్లుగానే వుందన్నమాట. అదే ఆయన్ని మళ్ళీ మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగేలా చేస్తోందేమో.!

- సింధు