cloudfront

Advertisement


Home > Politics - Gossip

ముందే చేతులెత్తేసిన మంత్రి నారాయణ?

ముందే చేతులెత్తేసిన మంత్రి నారాయణ?

నెల్లూరుజిల్లాలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ టికెట్ ఖరారైన తర్వాత కూడా విజయంపై అపనమ్మకంతో ఏకంగా పార్టీ ఫిరాయించారు ఆదాల ప్రభాకర్ రెడ్డి. వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకిదిగారు. కావలి టికెట్ కోసం టీడీపీలోకి వెళ్లి కుదరక వెనువెంటనే బ్యాక్ టు పెవిలియన్ అన్నారు మరో నాయకుడు. దీంతో ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన నారాయణలో టెన్షన్ మొదలైంది. అంతేకాదు, అందరికంటే ముందే ఆయన చేతులెత్తేసినట్టు తెలుస్తోంది.

మొన్నటివరకు ఓటుకు నోటునే నమ్ముకున్నారు నారాయణ. కోట్లరూపాయలు కుమ్మరిస్తున్నారు. అలాంటి నారాయణ కూడా ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారని తెలుస్తోంది. ఇప్పటికే చోటా నేతలకు, కార్పొరేటర్లకు డబ్బు సంచులు పంచేసిన నారాయణ, పంపిణీ ఆపేయాలని సూచించారట. దీనికి కారణం నారాయణలో నమ్మకం తగ్గడమే అంటున్నారు.

వాస్తవానికి మంత్రి నారాయణ నాలుగేళ్లుగా నెల్లూరులో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సిటీ సీటుపై కన్నేసిన ఆయన నెల్లూరుకు మున్సిపల్ కు నిధుల వరద పారించారు. హడ్కో రుణాలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ స్కీమ్ ని ఘనంగా ప్రారంభించారు. అయితే అభివృద్ధి పనులతో జరుగుతున్న అరాచకాలు ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. నగరంలో తవ్విన రోడ్లనే మళ్లీ తవ్వి, వేసిన రోడ్లపైనే మళ్లీ రోడ్లు వేసి, సమన్వయం లేక అధికారులు జనాల్ని హింసిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ అంతా నారాయణపై పడింది.

ఒకదశలో సింపతీ కోసం తన కుమార్తెను రంగంలోకి దించాలని చూశారు మంత్రి. మహిళా అభ్యర్థి అనే సాఫ్ట్ కార్నర్ ఉపయోగిస్తే ఓట్లు దక్కుతాయేమోనని ఆశించారు. తాను ఎమ్మెల్సీగా ఉంటూనే తన కుమార్తెను ఎమ్మెల్యేగా చేయాలని అనుకున్నారు. అయితే వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ బలమైన అభ్యర్థి కావడంతో చివరకు తానే రంగంలోకి దిగారు. ఓటును నోటుతో కొనడంపైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రత్యర్థి వర్గం కూడా ఇదే విషయంపై ఫోకస్ చేసింది.

సామాన్యుడికీ, ధనవంతుడికీ మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు అనిల్. ఇలాంటి టైమ్ లో రూరల్ లో తనకు సపోర్ట్ గా ఉంటారనుకున్న మాజీమంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి జెండా ఎత్తేసి వైసీపీలోకి వెళ్లిపోవడంతో మంత్రి నారాయణ దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సిటీ సీటు దక్కేలా లేదని సర్వేలు తేల్చేయడంతో చేతులెత్తేశారు.

ఓటర్లకు పంచిపెట్టడానికి, ప్రచార కార్యక్రమాల కోసం కేటాయించిన సొమ్ముని కూడా వెనక్కు తెప్పించేసుకున్నారట. ఇప్పటివరకూ ఖర్చుపెట్టింది చాలు, ఇకపై ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదని తన అనుచరులకు చెబుతున్నారట.

ప్రజల సొమ్ముతో ప్రలోభాలు.. ఇదే నయా రాజకీయం!