Advertisement


Home > Politics - Gossip
నారాయణా.. తమరు కూడానా?

గురివింద గింజ తన వీపు మీద ఉన్న నలుపు గురించి తెలుసుకోదు గానీ.. ఇతరుల వీపు మీద ఉన్న నలుపు గురించి నవ్వుతూ ఉంటుందనేది నానుడి. దీనినే గురివింద నీతి అంటారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ మంత్రి నారాయణ అచ్చంగా ఇదే నీతిని అవలంబిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తాము విమర్శించడం ప్రారంభించిన భారతీయ జనతా పార్టీకి కొత్త సారథిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులు కావడంపై, తెదేపా మంత్రి నారాయణ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంతకూ ఆయన చేస్తున్న విమర్శ ఏమిటో తెలుసా.. ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్నందునే కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా నియమించారట! సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన నాయకులకు ప్రాధాన్యమివ్వలేదట..!! అవినీతి, అవకాశవాద రాజకీయాల కోసం భాజపా దిగజారిందనడానికి ఇంతకన్నా నిదర్శనం మరోటి లేదట!!

మంత్రి నారాయణ గారి అభిమానులకు ఈ మాటలు తీయగానే.. చాలా కీలకమైన విమర్శలాగానే అనిపించవచ్చుగాక.. కానీ ఆయన తన సొంత గొడవ మరచిపోతే ఎలా? అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడచిపోయినంత మాత్రాన తన బాగోతాన్ని ప్రజలు అంత సులువుగా మరచిపోతారని అనుకుంటే ఎలా? వాస్తవాలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.

2014లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటికి ఈ నారాయణ అసలు ఎవరు? ఆయన కేవలం నారాయణ విద్యాసంస్థల రూపేణా విద్యావ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి మాత్రమే. అలాంటి నారాయణ.. అమాంతంగా రాష్ట్రమంత్రి అయిపోయారు. ఏ అర్హతలు చూసి ఆయనను చంద్రబాబునాయుడు మంత్రిగా ఎంపిక చేసినట్టు.

కేవలం ధనబలం, కులబలం మాత్రమే కాదా? అనే సంగతిని ప్రజలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. పైగా.. ఆ ఎన్నికలకు పూర్వం నారాయణ చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరుల దృష్ట్యా దన్నుగా నిలిచాడనే పుకార్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఆ రకంగా ఆయన అడ్డదారిలోనే, ధనకులాల బాటలోనే మంత్రి పదవిని దక్కించుకున్నారు. అలాంటి నారాయణ, ఇవాళ లక్ష్మీనారాయణను విమర్శిస్తే ఎలా?

ఎన్నికల నాటికి పార్టీలో ఏమీకాని నారాయణకు మంత్రిపదవి ఇచ్చి, ఆ తర్వాత ఎమ్మెల్సీ చేశారు చంద్రబాబు. మరి తనకంటె సీనియర్లు, పార్టీకోసం చెమట, నెత్తురు చిందించిన వాళ్లు, వయసు రీత్యా కూడా అర్హులూ అప్పటికే అనేక మంది ఏ పదవీ లేకుండా మూలనకూర్చుని ఉన్నారని.. వారి ప్రతిభను పార్టీ ఉపయోగించుకోవాలని.. హఠాత్తుగా ఊడిపడి తాను పదవి ఆశించడం తప్పు అని.. అవాళ నారాయణకు అనిపించలేదా? అని భాజపా వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి.