cloudfront

Advertisement


Home > Politics - Gossip

తమరు రానక్కర్లేదు: ప్రధానికి ఏపీ సంకేతం!

తమరు రానక్కర్లేదు: ప్రధానికి ఏపీ సంకేతం!

మొన్న మొన్నటి దాకా రాష్ట్రముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోసం ఆయన చుట్టూ పదేపదే తిరిగినా పట్టించుకోలేదు. కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఏడాది తర్వాత భేటీ కుదిరినా.. ఫలితం తేలేదు. బడ్జెట్ లో ఎర్రని ఏగానీ విదిల్చలేదు. మరి అలాంటప్పుడు తగుదునమ్మా అంటూ.. రిబ్బను కత్తిరింపులకు, టెంకాయ కొట్టే కార్యక్రమాలకు తరలి వచ్చి.. నేను అది చేసేశా, ఇది  చేసేశా అంటూ టముకు వేసుకునే అవకాశం ఆయనకు ఇవ్వడం ఎందుకు? అని ఏపీ ప్రభుత్వం భావించినట్లుగా కనిపిస్తోంది.

అందుకే ప్రస్తుతానికి ఏపీలో శంకుస్థాపనలకు గానీ, ప్రారంభోత్సవాలకు గానీ పథకాలేమీ సిద్ధంగా లేవని రాష్ట్రప్రభుత్వ అధికారులు పీఎంఓ కు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వం ఆయన కోసం కార్యక్రమాలను సిద్ధం చేసి అపాయింట్ మెంట్ అడిగినప్పుడు మాత్రం ప్రధాని రాలేదు. అప్పట్లో ఆయన టెక్కు టమారం ప్రదర్శిస్తున్నారు.

అప్పట్లో కనీసం ఏపీ సీఎంకు అపాయింట్ మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అలాంటి రోజుల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్  కోవింద్ ను ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభింపజేసేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాజపాపై నీలినీడలు కమ్ముకుని ఉన్నాయి. ఏపీ రాష్ట్రంలో మోడీ సర్కారును తిట్టని వారంటూ లేరు. ఇలాంటి అపకీర్తి పెరుగుతున్న సమయంలో రాష్ట్రానికి ప్రధాని రావాలనుకోవడం చిత్రమైన సంగతే.

అయితే అధికారిక కార్యక్రమాలకు వచ్చినట్లయితే... కేంద్రం , రాష్ట్రానికి చాలా చేసేస్తున్నట్లుగా చెప్పుకోవడం సాధ్యమవుతుందని ఆయన భావించినట్లుగా ఉంది. ఇప్పుడున్న రాజకీయ అవసరాన్ని బట్టి ఆయన రాదలచుకున్నారు గానీ.. రాష్ట్రప్రభుత్వం మాత్రం ఆయన రాకను కోరుకోవడం లేదు. అందుకే ‘ఇప్పుడేం కార్యక్రమాలు ఖాళీ లేవు‘ అనే సంకేతాలను పంపేసింది.

నిజానికి ప్రధాని రావాలని రాష్ట్రప్రభుత్వం తలచుకుంటే గనుక.. చిటికెలో ఓ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయగలరు!  రాత్రికి రాత్రే జాతీయ స్థాయి ప్రాజెక్టు ఒకటి డిజైన్ చేసేసి.. దానికి శంకుస్థాపన చేయించగల చాకచక్యం సీఎం చంద్రబాబుకు ఉంది. అయితే ప్రధాని రాకను ఆయన ఇష్టపడడం లేదు గనుకనే.. ప్రస్తుతానికి కార్యక్రమాలేం లేవు అని చెప్పేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.