cloudfront

Advertisement


Home > Politics - Gossip

మంత్రికి మైనార్టీల సెగ.. టీడీపీకి ఓపెన్ వార్నింగ్

మంత్రికి మైనార్టీల సెగ.. టీడీపీకి ఓపెన్ వార్నింగ్

తెలుగుదేశం పార్టీకి చేసిన "సేవల"కు, అందించిన ఆర్థిక సాయానికి ప్రతిఫలంగా మంత్రి పదవి దక్కించుకున్న మంత్రి నారాయణ, ఈ దఫా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని ఆయనకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే స్థానికంగా మైనార్టీ నాయకుల సెగ మంత్రికి గట్టిగా తగులుతోంది.

మైనార్టీలంతా కలసి నారాయణకు వ్యతిరేకంగా ఏకంగా సభ పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేశారు. నెల్లూరు సిటీ సీటు తమ నేత అబ్దుల్ అజీజ్ కి ఇవ్వకపోతే నారాయణకి వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. ఇది ఈ ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాదని, రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీలను, మైనార్టీ నేతలను టీడీపీ మోసం చేసిందని, ఇంతకు ఇంత ప్రతిఫలం వచ్చే ఎన్నికల్లో అనుభవిస్తారని శాపనార్థాలు పెట్టారు.

సీటు కోసం అసంతృప్తులు, వారి వర్గం వారు పార్టీ అధిష్టానంతో మంతనాలు జరపడం ఒక లెక్క. కానీ ఇక్కడ బహిరంగంగానే మైనార్టీ నేతలంతా కలసి పార్టీకి హెచ్చరికలు జారీ చేసే సరికి స్థానిక టీడీపీ నేతల్లో భయం మొదలైంది. ఈ వ్యతిరేకత రాష్ట్రవ్యాప్తంగా వస్తే తట్టుకోవడం కష్టమేనని అటు అధినాయకత్వం కూడా ఆలోచనలో పడింది.

వైసీపీ తరపున నెల్లూరు నగర మేయర్ గా గెలిచిన అబ్దుల్ అజీజ్ ని అప్పట్లో ఎమ్మెల్సీ ఆశ చూపి టీడీపీ తమవైపు తిప్పుకుంది. ఎప్పటికప్పుడు మొండిచేయి చూపిస్తూ.. చివరకు నెల్లూరు సిటీ నియోజకవర్గం టికెట్ ఇస్తామని ఆశ పెట్టింది. తీరా ఇప్పుడు మంత్రి నారాయణ నెల్లూరు సిటీని ఖరారు చేసుకునేసరికి అజీజ్ అవాక్కయ్యారు. దీంతో అజీజ్ వర్గం రంగంలోకి దిగింది. బహిరంగంగానే మంత్రి నారాయణకు హెచ్చరికలు జారీ చేశారు మైనార్టీ నేతలు.

నెల్లూరు సిటీలో మైనార్టీలకు మంచి పట్టు ఉండటంతో మంత్రి కూడా వెనకడుగు వేస్తున్నారని వినికిడి. వారిని కాదని బరిలో దిగితే ఓటమి ఖాయమని ఆయనకు కూడా తెలుసు. దీంతో తనకు అలవాటైన రూట్లోనే ఈసారి కూడా సైడ్ ట్రాక్ లో ఎమ్మెల్సీగానే సరిపెట్టుకోవాలని చూస్తున్నారు నారాయణ. ఏపీలో ఎన్నికల సమయానికి టీడీపీకి ఇంకెన్ని హెచ్చరికలు వస్తాయో, ఎంతమంది తిరుగుబావుటా ఎగరేస్తారో చూడాలి.