Advertisement


Home > Politics - Gossip
నేతలు అక్రమార్జనపై చంద్రబాబు కినుక!

ప్రజాప్రతినిధుల బాటలో అధికారులు

ప్రభుత్వంపై ప్రజల మండిపాటు

అధికారంలోకి వస్తే అవినీతి రహిత పరిపాలనను అందిస్తానని బాకా ఊడిన తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు పరిపాలనా దక్షత, పారదర్శకమైన పాలనను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తెలుగుదేశానికి ఓట్లు వేసి పట్టంకట్టారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు సారథ్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతుందని, అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని అంతా ఊహించారు.

అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వ హయానికి దీటుగా ఇపుడు అవినీతి అంశాలలో ఇటు కొందరు ప్రజాప్రతినిధులు అటు అధికారులు పోటీ పడుతున్నారంటే అతిశయోక్తి కాదు! ఇటీవలి కాలంలో అవినీతి నిరోధక శాఖాధికారులు జరుపుతున్న దాడుల్లో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు అధికారుల జాతకాలు బట్టబయలు అవుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఓ రవాణా శాఖాధికారిపై ఏసీబీ జరిపిన దాడుల్లో సుమారు వెయ్యికోట్లకు పైగా అక్రమాస్తులు వెలుగుచూడటం అప్పట్లో తీవ్ర సంచలనం రేపింది.

ఆ తర్వాత స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్స్‌, పంచాయతీరాజ్‌, రెవెన్యూ, రవాణా, పోలీస్‌ తదితర శాఖల అధికారులు ఆస్తులపై జరిపిన దాడుల్లో కోట్ల రూపాయల మేర అక్రమార్జన వెలుగుచూసింది. అధికారుల విషయం ఇలావుంటే అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల్లో కొందరు అవినీతికి గేట్లు ఎత్తేశారు. ముఖ్యమంత్రి అవినీతికి వ్యతిరేకంగా, నీతివంతమైన పాలన జరిగేలా పాటు పడుతున్నారని సదరు ప్రజాప్రతినిధులు ఓవైపు చెబుతూనే, మరోవైపు అక్రమార్జనకు అటువాటు పడ్డారు. ప్రతీ ఇంటికీ ఓ రేటు నిర్ణయించిన ప్రజాప్రతినిధులు తూర్పు గోదావరి జిల్లాలో కనిపిస్తారు.

భూ సెటిల్‌మెంట్ల నుండి మట్టి, ఇసుక, మైనింగ్‌ మాఫియా వరకు కొందరు చక్రం తిప్పుతుంటే, మరికొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సైతం పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన గృహ నిర్మాణ పథకాలు కొందరు పమ్మెల్యేలకు కాసులు వర్షం కురిపించాయి. ముఖ్యంగా ఇళ్ళ మంజూరు ప్రక్రియను పమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగేలా ప్రభుత్వం కూడా సహకరించింది. దీంతో రెచ్చిపోయిన సదరు పమ్మెల్యేలు రహస్యంగా ఈ ఇళ్ళ కేటాయింపులు జరిపారు.

ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా, నిబంధనలను తుంగలోకి తొక్కి, దొడ్డిదారిలో లక్ష నుండి 2 లక్షల వంతున వసూలు చేసిన పిమ్మట ఇళ్ళ కేటాయింపులు జరిపినట్టు కాకినాడ నగరంలో ప్రచారం జరుగుతోంది. ఇళ్ళ కేటాయింపులోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మాట కాదని, డబ్బులు ముట్టజెప్పిన ప్రతిపక్ష వైసీపీ కార్యకర్తలు, నేతలు సూచించిన వారికి అనేక చోట్ల కేటాయింపులు జరగడం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. ఇక సిమెంట్‌ రహదారుల నిర్మాణం నుండి రాష్ట్ర, జాతీయ రహదారుల నిర్మాణం వరకు ఆయా ప్రాంతాల నేతలు సంబంధిత కాంట్రాక్టర్ల నుండి పర్శంటేజీలు భారీగా వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాల నిర్మాణంలోనూ స్థానిక ప్రజాప్రతినిధులందే హవా! ఇక ఆయా శాఖలకు సంబంధించిన బదిలీలు, కాంట్రాక్ట్‌ పోస్ట్‌ల నియామకాల్లో కొందరు అవినీతి చక్రవర్తులు సాగిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీకావు. పలువురు బాధితుల ఆరోపిస్తున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఇరిగేషన్‌ పనులు విషయానికి వస్తే సదరు ప్రజా ప్రతినిధుల హవా దారుణంగా మారింది.

ప్రాజెక్ట్‌ల నిర్మాణం, ఆధునీకరణ పనులు కోట్ల మొత్తంలో జరుగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై ఆజమాయిషీ పేరుతో తెలుగుదేశం నేతలు సాగిస్తున్న అరాచకాలను చూసి అధికారులే విస్తుపోయే దుస్థితి ఏర్పడింది. ఏ విధమైన కాంట్రాక్ట్‌ వర్క్‌లైనా సదరు అధికారులనే నేరుగా బెదిరించి, తమ చిత్తానుసారం పెత్తనం సాగించే పమ్మెల్యేలకు ఈ జిల్లాలో కొదవలేదు! ఇక హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కూడా ఇదే విధంగా దందా నడుస్తోంది.

అవినీతి రహిత పాలన, పారదర్శకత అంటూ తరచూ మైకులు విరగ్గొట్టే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇదంతా తెలియదా? ఆయన వ్యక్తిగత ఇంటెలిజెన్స్‌ ఏంచేస్తోంది? పరిస్థితి ఇదే విధంగా సాగితే 2019లో పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదా? వంటి ప్రశ్నలు ప్రస్తుతం సామాన్యుల నుండి ఉదయిస్తున్నాయి.