cloudfront

Advertisement


Home > Politics - Gossip

లోకేష్ నోరు తెరిస్తే.. ఇలానే ఉంటుంది!

లోకేష్ నోరు తెరిస్తే.. ఇలానే ఉంటుంది!

చంద్రబాబు నాయుడు తనయుడు నారాలోకేష్ బాబు మాటా పటిమ గురించి కొత్తగా వివరించనక్కర్లేదు. మాట్లాడటం విషయంలో తన సత్తా ఏమిటో లోకేష్ చాటుకుంటూనే ఉన్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్ల పాటు లోకేష్ మాట్లాడటం మానేశాడు కూడా. కేవలం ట్విటర్ కే పరిమితం అయ్యాడు. ట్వీట్లు అయితే ఎవరు రాస్తున్నారో, ఎవరు పోస్ట్ చేస్తున్నారో తెలీదు. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది.

కానీ ఎంతసేపూ ట్విటర్లోనే రాజకీయాలు చేయలేడు కదా.. అప్పుడప్పుడు లోకేష్ మాట్లాడాల్సి వస్తోంది. ఇలా మాట్లాడినప్పుడే దొరికిపోతూ ఉన్నాడు. అలాగని తను మాట్లాడే టాపిక్స్ గురించి లోకేష్ కొంచెమైన ఆలోచిస్తాడో.. చించడో కానీ.. ఈయన నోరు తెరిస్తే ప్రత్యర్థులు కౌంటర్లు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతోంది.

తాజాగా చినబాబు తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై స్పందించాడు. ఒక లెవల్లో లెక్చరిచ్చాడు. అందులో చెప్పుకొచ్చింది ఏమిటంటే.. తెలంగాణకు ముందస్తు ఎన్నికలు సరికాదు అని. ప్రజలు ఐదేళ్లపాటు పాలించడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి.. కేసీఆర్ ఐదేళ్ల పాటు పాలించాల్సిందని, శాసనసభను రద్దు చేయడం సబబు కాదని లోకేష్ చెప్పుకొచ్చాడు.

ముందస్తు ఎన్నికలకు వెళ్లడం కేసీఆర్ బాధ్యతా రాహిత్యమే అని, రాజ్యాంగాన్ని అవమానించడమే అని.. లోకేష్ తనకు తెలిసిన పదాలన్నీ ఉపయోగించి విరుచుకుపడ్డాడు. సరే.. అలాగే అనుకుందాం. ముందస్తు ఎన్నికలు తప్పే, శాసనసభను రద్దు చేసుకుని ముందస్తుగా ఎన్నికలు తీసుకురావడానికి ముఖ్యమంత్రికి రాజ్యాంగం ఇచ్చిన విశేష అధికారాన్ని లోకేష్ తప్పు పడుతున్నాడు.

మరి అలాగైతే.. గతంలో లోకేష్ తండ్రివర్యులు చంద్రబాబు నాయుడు గతంలో చేసిన దాన్ని ఏమనాలి? 2004లో చంద్రబాబు నాయుడు వెళ్లింది ముందస్తు ఎన్నికలకు కాదా? తనపై అలిపిరిలో అటాక్ జరగగానే.. సానుభూతి వర్షిస్తుంది, ఓట్ల వాన వస్తుంది.. అని చంద్రబాబు నాయుడు శాసనసభను రద్దు చేసుకోలేదా? తను ముందస్తుకు వెళ్లడమే గాక.. బీజేపీని తీసుకెళ్లలేదా?

తాచెడ్డ కోతి వనమంతా చెడిపిందన్నట్టుగా అప్పట్లో చంద్రబాబు నాయుడు ముందస్తుకు వెళ్లి, వాజ్ పేయి ప్రభుత్వాన్ని కూడా కుప్పకూల్చాడు. అలాంటి చంద్రబాబు నాయుడు కొడుకు ఇప్పుడు వచ్చి.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది అధికార దుర్వినియోగం అని, ప్రజలను అవమానించడమే అని అంటున్నాడు. అందుకే లోకేష్ బాబు నోరు తెరవకుండా ఉంటే.. తెలుగుదేశం పార్టీకి పెద్ద మేలు చేసిన వాడవుతాడేమో!