Advertisement


Home > Politics - Gossip
‘‘రా.. కత్తీ.. రా..’’ ఎగబడ్డ న్యూస్ ఛానెళ్లు!

కత్తి మహేష్ అనగా ఎవరు ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నం అయినప్పుడు సాధారణంగా అందరూ అనుకున్నట్టు సినిమా విమర్శకుడు అనిగానీ, ఆయన తన గురించి చెప్పుకున్నట్టు సంఘ సంస్కర్త అనిగానీ మనకు తెలుసు.

కానీ.. తెలుగు టీవీ న్యూస్ ఛానెళ్లకు ‘‘టీఆర్పీల ప్రదాత’’ అని కూడా కొత్త నిర్వచనం జత చేసుకోవాలి. హైదరాబాదు నగరం కేంద్రంగా నడుస్తున్న దాదాపుగా అన్ని తెలుగు టీవీ ఛానెళ్లు ఆదివారం నాడు కత్తి మహేష్ ను తమ ఛానెల్ కు ఆహ్వానించడానికి ఎగబడ్డాయంటే అతిశయోక్తి కాదు. ప్రెస్ క్లబ్ లో ఆయన ప్రెస్ మీట్ అయిన వెంటనే తమ ఛానెల్ కు తీసుకువెళ్లాలని దాదాపుగా అందరూ అక్కడ కాపు కాశారు. ఆయన ఓ అగ్రశ్రేణి చానెల్ కు ముందుగా వెళ్లారు.

ఆది మొదలుగా ఆయన తమ ఛానెల్ కు వస్తేచాలు అని, రావాలని.. ఆయన రాకపోయినా సరే.. తమ చానెల్ లో ఆయనకు సంబంధించిన వ్యాఖ్యల మీద డిస్కషన్లు బులెటిన్లు మాత్రమే ప్రసారం కావాలని.. న్యూస్ ఛానెళ్లు వెంపర్లాడిపోయాయంటే అతిశయోక్తి కాదు.

మీడియా అయినంత మాత్రాన వ్యాపారపోకడలకు ఎగబడకూడదు అనే నిబంధన ఏమీలేదు. మారుతున్న కాలంతో పాటూ మీడియా విలువలు కూడా మారాయి. మీడియా ఒక మాధ్యం, మరియు ఇతర నిర్వచనాల నుంచి ఫక్తు వ్యాపారంగా మారిపోయింది.

అయితే నాణ్యమైన వార్తలు, విశ్లేషణలు అందివ్వడం ద్వారా నిలకడైన ప్రేక్షకులను సంపాదించుకోలేకపోతున్న కొన్ని ఛానెళ్లు సంచలనాలు జరిగేప్పుడు.. వాటికి మరింత మసాలా అద్దుతూ.. తమ క్రేజ్ పెంచుకోవడానికి మిగిలి ఉన్న నామమాత్రపు విలువలకు కూడా నీళ్లొదిలేస్తున్నాయి. తాజాగా కత్తి మహేష్ కోసం మీడియా ఛానెళ్లు ఎగబడడం కూడా అలాంటి వ్యవహారమే.

కత్తి మహేష్.. పవన్ కల్యాణ్ మీద విమర్శలు చేయడం ద్వారా మాత్రమేకాదు.. ఆ విమర్శలకు పవన్ ఫ్యాన్స్ స్పందించడం ద్వారా కూడా సెలబ్రిటీ స్టేటస్ కూడా చేరుకున్నాడు. పవన్ ఫ్యాన్స్ లేదా మరో హీరోయిన్ తనను ఉద్దేశించి చేసినట్లుగా భావిస్తున్న వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా స్పందించి.. ఆమెను తీవ్రంగా నొప్పించేలా కొన్ని ప్రశ్నలు వేశారు.

అసలే పవన్ కల్యాణ్ వ్యవహారం... ఫ్యాన్ ఫాలోయింగ్ అపరిమితం. వారి స్పందనలు కూడా హద్దులు దాటిపోయినవే జాస్తి. ఇటు టీవీలకు అతుక్కుపోయిన వారూ.. ఇతర ప్రాంతాల నుంచి ఇంటర్నెట్ ద్వారా చూసేవాళ్లూ అన్నిరకాల ప్రేక్షకులు కూడా ఈ ఎపిసోడ్ లకే అతుక్కుపోయారు. దాంతో ఒక్కసారిగా అందరికీ కత్తి మహేష్ టీఆర్పీ ప్రదాతగా టీవీ ఛానెళ్లకు కనిపించాడు. అందరూ ఎగబడి మరీ ఆయనను తమ స్టూడియోకు పిలిపించుకున్నారు.

ట్విస్టు ఏంటంటే..

మహాటీవీలో  ఆదివారం పొద్దుపోయిన తర్వాత.. డిస్కషన్ కు వచ్చారు కత్తి మహేష్. ఆ చర్చలో బెజవాడ సినిమా దర్శకుడు వివేక్ కృష్ణ కూర్చున్నారు. ఆయన అడిగిన ఒక ప్రశ్నకు తాను హర్ట్ అయ్యానంటూ డిస్కషన్ మధ్యలో లేచివెళ్లిపోయారు.

అందరి పర్సనల్ విషయాలను రోడ్డున పెట్టేసి.. ప్రశ్నించడం తనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అనే కత్తి మహేష్.. తన పర్సనల్ విషయాలను అడిగేసరికి.. కనీసం అభిప్రాయం చెప్పకుండా వెళ్ళిపోవడం ఎక్కడి నీతి.. అంటూ వివేక్ కృష్ణ కత్తి ఎపిసోడ్ కు ఆదివారం నాటికి భరత వాక్యం పలికారు.