Advertisement


Home > Politics - Gossip
జోన్ కు నో: బాబుకు ఇంకా క్లారిటీ కావాలా?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. ఎన్డీయే సర్కారు నుంచి తమ పార్టీ కేంద్రమంత్రుల్ని ఉపసంహరించుకున్న తర్వాత.. ఒకవైపు భాజపా సర్కారును విచ్చలవిడిగా తిడుతూ ఉన్నప్పటికీ.. ఎన్డీయే నుంచి ఎందుకు బయటకు రావడంలేదు అనే సందేహం.. ప్రజల్లో కలుగుతోంటే అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసంబద్ధం కాదు. కొందరు భావిస్తున్న ప్రకారం.. చంద్రబాబునాయుడు ఒక స్కెచ్ ప్రకారం.. ఎన్డీయే నుంచి వైదొలగకుండా గడుపుతున్నారు.

ఎటూ కేంద్రం రైల్వేజోన్ ఇస్తుందనే సంకేతాలు వస్తున్నాయి. జోన్ ఇవ్వబోతున్నారని, కడప ఉక్కు ఫ్యాక్టరీ కూడా వచ్చేస్తున్నదని.. భాజపా నాయకులు కూడా చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో జోన్ నేడో రేపో వస్తే గనుక.. తమ ఒత్తిడి ద్వారా మాత్రమే అది సాధ్యమైందని అంటూ.. ఎన్డీయేతో బంధాన్ని అలాగే ఉంచేసుకోవచ్చునన్నది చంద్రబాబు వ్యూహం కావచ్చునని కొందరి అభిప్రాయం.

అయితే ఆయనలో అలాంటి దీర్ఘకాలిక ఆశలు ఉన్నాయో లేదో గానీ.. ఆ జోన్ ముచ్చటకు కూడా కేంద్రం మంగళం పాడేసింది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికార్లతో కేంద్రం నిర్వహించిన సమావేశంలో.. రైల్వేజోన్ వచ్చే అవకాశమే లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెగేసి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజానికి విశాఖ రైల్వేజోన్ కోసం పరితపించడం అనేది ఇవాళ్టి సంగతి కాదు. ఎన్నో దశాబ్దాలుగా ఈ డిమాండ్ ఉంది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నప్పుడు దీన్నొక వెసులుబాటు, ఊరడింపు కింద ప్రకటించారు.

అయితే దాన్ని కూడా ఇప్పటిదాకా కార్యరూపంలోకి తేకుండా, ఒదిశా అభ్యంతరాలపేరిట నానుస్తూ వచ్చారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తాజా ప్రతిష్టంభన ఏర్పడిన తర్వాత.. ఇటీవలి వరకూ ఒదిశాతో చర్చలు కూడా పూర్తయ్యాయని.. త్వరలోనే విశాఖ రైల్వేజోన్ వచ్చేస్తుందని కేంద్రం చెప్పింది. భాజపా నాయకులు కూడా మురిసిపోతూ.. రాష్ట్రానికి తాము ఇంత చేసేస్తున్నాం అంటూ టముకు వేసుకున్నారు. తీరా ఇప్పుడు రైల్వేజోన్ కు కూడా మంగళం పాడేశారు.

కనీసం ఇప్పటికైనా ఈ కేంద్రం తమకోసం ఏమీ చేయదు అనే క్లారిటీ చంద్రబాబుకు వస్తుందో లేదో చూడాలి. ఎన్డీయే నుంచి ఆయన ధైర్యంగా బయటకు వస్తారో లేదో చూడాలి. ఇప్పటికైనా వీరితో వ్యవహారం తెగదు లెమ్మనుకుని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి.. రాష్ట్రం సమైక్యంగా కేంద్రం ధోరణిని నిరసిస్తున్నదనే సంకేతాలు ఇస్తారో లేదో చూడాలి. ఏ పనీచేయకపోతే గనుక.. ఆయన మరోసారి రాష్ట్రాన్ని వంచించడానికి ప్రయత్నిస్తున్నట్టే లెక్క.