Advertisement


Home > Politics - Gossip
అయిష్టంగా... లూప్‌లైన్ దిశగా...

దేశవ్యాప్తంగా ఇప్పుడు అభినందనల వర్షం కురుస్తోంది. పరిచయస్తులైన నాయకులు అందరూ ఫోన్లుచేసి కంగ్రాచులేషన్స్ చెబుతున్నారు. పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన ఒక మామూలు వ్యక్తి... దేశానికి ఉపరాష్ట్రపతి పదవి దాకా ఎదగడం అంటే...  అది అపురూపమైన విజయం, ఘనత అంటూ పలువురు కీర్తిస్తున్నారు.

భారతీయ జనతా పార్టీలో వెంకయ్యనాయుడు సేవలు సాటిలేనివని... వాటికి గుర్తింపుగానే ఇవాళ ఆయనను అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని చేశాం అని అటు ప్రధాని నరేంద్రమోడీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మీడియా ముందు చిలకపలుకులు వల్లె వేస్తున్నారు. ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ, ఆ దామాషాలో సంతోషంగా లేని వ్యక్తి ఒక్కరే... ఆయన ముప్పవరపు వెంకయ్యనాయుడు. అవును వెంకయ్య అయిష్టంగానే ఈ కొత్త పదవి వైపు అడుగులు వేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. 

‘‘వైస్ ప్రెసిడెంట్ పోస్టు ఎందుకులెద్దూ’’ అంటూ ఆంధ్రప్రదేశ్ నుంచి పలువురు నాయకులు వెంకయ్యకు సలహాలు ఇస్తున్నట్లుగా గ్రేటాంధ్ర డాట్ కామ్ ఇదివరలోనే ఒక కథనాన్ని అందించింది. ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చెలామణీ అవుతున్న ఆఫ్ ది రికార్డ్ సంగతుల ఆధారంగా సోమవారం సాయంత్రానికి అసలు వెంకయ్యనాయుడు అయిష్టంగానే ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు నిత్యం సలహాలు ఇవ్వగల స్థాయిలో ఉన్నవారు అందరూ కూడా పదవి గురించి విముఖంగానే.. మరో రకంగా చెప్పాలంటే గుర్రుగానే ఉన్నారని సమాచారం. 

కేంద్రమంత్రి పదవిలో దేశరాజకీయాల్లో కీలకంగా, క్రియాశీలంగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి తనను ఎంపికచేయడాన్ని లూప్ ‌లైన్లోకి పంపే చర్యగా భావిస్తున్నారనేది ఒక వాదన. ఉపరాష్ట్రపతి అంటే రాజ్యసభ ఛెయిర్ లో కూర్చుని సభను నడిపించడం మినహా పెద్దగా ఆ హోదాకు అస్తిత్వం ఏమీ ఉండదు. అందుకే ఆయన ఆ పోస్టు వద్దనుకుంటున్నారనేది కొందరు చెబుతున్న మాట.

అయితే పార్టీకి, మోడీకి ఎంతో విధేయుడు అయిన వెంకయ్య నాయుడు సూటిగా తన మనసులోని మాటను చెప్పకుండా... అయిష్టత గురించి బయటపెట్టకుండా... సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. దక్షిణాది నుంచి ఉపరాష్ట్రపతిని నిలబెట్టాలనేది పార్టీ నిర్ణయమే అయితే గనుక.. కర్ణాటక, కేరళ, తమిళనాడుల నుంచి వేర్వేరు సీనియర్ నాయకుల పేర్లను ఆయన ఈ పదవికి స్వయంగా సూచించినట్లుగా కూడా పుకార్లు వచ్చాయి.

అయితే మోడీ దళం మాత్రం... తాము అనుకున్నదే చేసుకుపోయారు. వెంకయ్యను ‘ఉపరాష్ట్రపతిగా చేస్తున్నారు’ అనే పదం కంటె.. ‘మంత్రి పదవినుంచి తప్పిస్తున్నారు’ అనే పదమే ఎక్కువ వైరల్ గా ప్రచారంలోకి వస్తోంది. సరిగ్గా ఈ రకం అభిప్రాయం వల్లనే వెంకయ్యనాయుడు కూడా అయిష్టంగానే కొత్త పదవి వైపుగా అడుగులు వేస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా నిర్ణయం జరిగిపోయింది.. అనుకోకుండా ఎదురైన పరిణామాల్ని ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే ఆయన ముందున్న ఆప్షన్ మరి!!