cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇప్పుడు కూడా గడప దాటి బయటకు కదలట్లే!

ఇప్పుడు కూడా గడప దాటి బయటకు కదలట్లే!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ప్రత్యేక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా తన పదవీకాలాన్ని కూడా దాదాపుగా పూర్తిచేసేసినట్లే లెక్క! ఒకపూర్తికాలం పదవిలో ఉన్న ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవహారాలకు కేంద్ర బిందువు అయిన సచివాలయానికి ఎన్ని సార్లు వెళ్లారంటే.. మనం వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. నాలుగున్నరేళ్లలో బహుశా  కేసీఆర్ అంత తక్కువగా సచివాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే మరొకరు ఉండకపోవచ్చు.

ప్రస్తుతం కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అభ్యర్థుల జాబితాను ప్రకటించేసి.. ఎన్నికల ప్రచార సమరాంగణంలోకి పార్టీ అభ్యర్థులందరినీ ఉరకలెత్తిస్తున్నారు. ఈనెలలో 2వ తేదీన ఇంట్లో కేబినెట్ నిర్వహించి, కొంగరకలాన్ లో బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్.. ఆ పిమ్మట 6వ తేదీన ఇంట్లో కేబినెట్ నిర్వహించి అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్ భవన్ కు వెళ్లి తీర్మానం గవర్నర్ కు అందించి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి సంసిద్ధత వ్యక్తం చేసి వచ్చారు.

ఆ వెంటనే హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఓ భారీ సభను నిర్వహించారు. ఎన్నికలు వచ్చేలోగా దాదాపు ఇలాంటివి యాభైకు పైగా బహిరంగ సభలు నిర్వహిస్తాం అంటూ కేసీఆర్ ఆ సభలోనే ప్రకటించారు కూడా. అంతే ఆ పర్వం ముగిసింది. మళ్లీ ఇప్పటిదాకా కేసీఆర్ ఇల్లు దాటి బయటకు రాలేదు.

బుధవారం నాడు.. కాంగ్రెస్ నుంచి కొందరు  కీలక నాయకులు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి లాంటి ప్రముఖులు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. మరో పార్టీ అయితే ఇలాంటి సందర్భాన్ని కూడా ఒక ఎన్నికల ప్రచార సభలాగా వాడుకుని ఉండేది. కానీ కేసీఆర్ తన ఇంట్లో జరిగిన కార్యక్రమంలో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారే తప్ప.. ఆతర్వాత.. పార్టీ కార్యాలయంలో జరిగిన సభకు కూడా  హాజరు కాలేదు. ఆ సభలో మంత్రి కేటీఆర్ అన్నీ తానే అయి ప్రధాన ప్రసంగంచేశారు.

కేసార్ ఉద్దేశ పూర్వకంగా ఇంటినుంచి బయటకు రాకుండా.. ఇంటినుంచే ఎన్నికల ప్రచార పర్వం మొత్తం పర్యవేక్షిస్తున్నారా? సమీకరణాలను పరిశీలిస్తున్నారా? లేదా, తన కొడుకు కేటీఆర్ ను అసమానమైన నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడానికి, సర్వం కేటీఆర్ చేతులమీదనే జరుగుతున్నదనే బిల్డప్ ఇవ్వడానిక తన పాత్రను పరిమితం చేసుకుంటున్నారా? అర్థం కావడం లేదు.