cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఇది తెరిచిన పుస్తకం.. అది మూసిన గుప్పెట

ఇది తెరిచిన పుస్తకం.. అది మూసిన గుప్పెట

ఒకేసారి, ఒకే సీజన్లో.. ఒకే సందర్భంలో ఇద్దరు మహానుభావుల జీవిత చరిత్రలు తెలుగు తెరకెక్కుతున్నాయి. ఒకటి ఎన్టీఆర్ జీవిత చరిత్ర కాగా, మరొకటి వైఎస్సార్ బయోపిక్. 2019 ఎన్నికల సందర్భంలో వస్తున్న ఈ రెండు నిజజీవిత గాథలు తెలుగు ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని మిగులుస్తాయనడంలో ఎలాంటి అనుమానంలేదు. అయితే తెరిచిన పుస్తకాల్లాంటి వీరి జీవిత చరిత్రలను వాస్తవానికి దగ్గరగా ఎంతమేర చిత్రీకరిస్తారనేది సందేహమే.

ముందుగా ఎన్టీఆర్ సినిమా గురించి మాట్లాడుకుంటే.. నిజానిజాలను ఇందులో గుప్పెటపట్టి మూసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తొలినుంచీ ప్రచారంలో ఉంది. ఎన్టీరామారావు జీవిత చరిత్రను సినిమాగా తీయాలనుకోవడమే ఓ పెద్ద సాహసం. అలాంటి సాహసాన్ని సరిగ్గా ఎన్నికల టైమ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు ఆయన తనయుడు బాలకృష్ణ. అయితే ఆదిలోనే సినిమా కథ, కథనం విషయంలో తేడాకొట్టడంతో దర్శకుడిని నిర్దాక్షిణ్యంగా మార్చేసి ఆ బాధ్యతను తేజ నుంచి క్రిష్ కి అప్పజెప్పాడు నిర్మాత కమ్ హీరో బాలకృష్ణ. 

అయితే క్రిష్ ఇక్కడ చాలా తెలివిగా వ్యవహరించాడు. ఎలాగూ వాస్తవాలు చెప్పలేరు కాబట్టి, అవాస్తవాలు వచ్చేసరికి సినిమా క్లోజ్ చేయాలని చూస్తున్నాడు. అందుకే పార్ట్-1, పార్ట్-2 అనే డివిజన్ చేసి, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కేవరకు పార్ట్-1లో చూపించడానికి కసరత్తులు చేస్తున్నాడు. అంటే ఒకరకంగా గుప్పెట మూసిపెట్టి ఎంతవరకు ప్రేక్షకులకు చూపించాలో, ఎంతవరకు సినిమా తీస్తే ఎన్నికల్లో టీడీపీకి మైలేజీ వస్తుందో అంతవరకే కొలత వేసి మరీ తెరకెక్కిస్తున్నారు. 

ఇక వైఎస్సార్ జీవిత చరిత్ర యాత్ర విషయానికొస్తే.. సినిమా టైటిల్ లోనే దాని స్టోరీపై ఓ క్లారిటీ ఇచ్చేశారు. కేవలం వైఎస్సార్ పాదయాత్ర ఆధారంగానే ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. పాదయాత్రకు ముందు, పాదయాత్ర తర్వాత ముఖ్యమంత్రి పాలన కంటే యాత్రలో ఆయన జనంతో ఎలా మమేకమయ్యారు, జనం ఆయన్ను ఎలా స్వాగతించారు అనే విషయాలే ఎక్కువగా చర్చిస్తారు. అంటే ఒకరకంగా జగన్ పాదయాత్రను వైఎస్సార్ పాదయాత్రతో పోల్చి చూసుకునే అవకాశం ఇప్పటికిప్పుడు జనాలకి ఇస్తున్నారన్నమాట. 

అయితే ఈ సినిమాలో ఎక్కడా వాస్తవాలు దాచాల్సిన అవసరం లేదు, అవాస్తవాలు, అభూతకల్పనలకు తావే లేదు. ప్రజలు వైఎస్సార్ కి అడుగడుగునా ఎలా నీరాజనాలు పలికారో, ఎలా బ్రహ్మరథం పట్టారో అంతా ఈ సినిమాలో చూపిస్తారు. 

ఇకపోతే.. సినిమా మేకింగ్ విషయానికొస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ లో తారాలోకం అంతా కదలివస్తోంది. ఎన్టీఆర్ క్యారెక్టర్లో బాలకృష్ణ సహా అన్ని ముఖ్యపాత్రలకు, స్టార్లను తీసుకుంటున్నారు. దర్శకుడు క్రిష్ కూడా ప్రేక్షకుల నాడి పట్టడంలో అందె వేసిన చేయి. సో.. ఎన్టీఆర్ సినిమాలో జనరంజకమైన విషయాలకు లోటే లేదన్నమాట. ప్రచార ఆర్భాటాలకు కూడా కొదవేలేదు. 

మరి యాత్ర విషయానికొస్తే.. మమ్ముట్టి మినహా మిగతా పాత్రల్లో అందరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లే కనపడతారు. రావు రమేష్, పోసాని, వినోద్ కుమార్.. ఈ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు మహి రాఘవ్ కమర్షియల్ హిట్లివ్వకపోయినా, మంచి దర్శకుడు, రచయిత అనే పేరు తెచ్చుకున్నాడు. ఇటు జగన్ కానీ, వైసీపీ శ్రేణులు కానీ ఎవరూ ఈ సినిమాతో అసోసియేట్ కాలేదు కాబట్టి, వారి మద్దతు, వారి ప్రచారం ఎంతవరకు ఉంటుందనేది సందేహమే. అయితే సినిమా వైఎస్సార్ అభిమానులకు, వైసీపీ కార్యకర్తలను మాత్రం కచ్చితంగా వందశాతం కదిలిస్తుంది, కంటతడి పెట్టిస్తుంది, ఆ మహానుభావుడిని మరోసారి గుర్తుకు తెస్తుంది. 

ఇప్పటికే విడుదలైన టీజర్ యాత్ర సినిమాపై అంచనాలను అమాంతం పెంచింది. సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని జనం ఎదురు చూసేలా చేస్తోంది. అయితే షూటింగ్ అప్ డేట్స్, షెడ్యూల్స్ ప్రకారం చూస్తే ఎన్నికల సమయానికి యాత్ర సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే దీన్ని సింగిల్ షెడ్యూల్ లో 70రోజుల్లో పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఎన్టీఆర్ సినిమా మాత్రం ఎన్నికల టైమ్ కు రాదు.