cloudfront

Advertisement


Home > Politics - Gossip

నిజం మాట్లాడితే అక్కడైనా అంతే...?

నిజం మాట్లాడితే అక్కడైనా అంతే...?

నిజం చెబితే నిష్టూరం అంటారు పెద్దలు! ఆమాట అక్షర సత్యం. పైగా రాజకీయాల్లో అయితే మరీ..! నిజాలు ఎలా ఉన్నప్పటికీ.. అవన్నీ మనకు తెలిసినప్పటికీ.. పార్టీకి మచ్చ రాకుండా.. పార్టీ విధానాల ప్రకారం.. ప్రత్యర్థుల మీద నిందలు వేయాలే తప్ప.. అసత్యాలను అందంగా పలకాలే తప్ప.. మనకు తెలిసినంత మాత్రాన, మనకు వ్యతిరేకంగా ఉండే నిజాలను కూడా చెప్పకూడదు.

చెబితే.. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నట్లుగా కోపగించి.. మనల్ని బయటకు వెళ్లగొడతారు. కుళ్లుకంపు కొట్టే సాంప్రదాయ రాజకీయ పార్టీల్లో ఇలాంటి ధోరణి మనకు పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. పేరుకు కొత్త తరం స్వచ్ఛమైన రాజకీయాలను భారతదేశానికి పరిచయం చేయడానికి పుట్టిన పార్టీ అన్నమాట నిజమే గానీ.. నిజం మాట్లాడితే అక్కడైనా అంతే అని.. ఢిల్లీలో ఏలుబడి సాగిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నిరూపించుకుంది.

ఇటీవలి సంఘటనల్లో సాక్షాత్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే చీఫ్ సెక్రటరీ మీద చేయిచేసుకుని కొట్టిన.. ఇద్దరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినందుకు కేజ్రీవాల్ కు సలహాదారుగా ఉన్న వీకే జైన్ ఇప్పుడు ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన వ్యక్తిగత, కుటుంబ కారణాల వలన పదవినుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఆయన కేజ్రీవాల్ కు వ్యక్తిగతంగా కూడా సన్నిహితులు కావడం విశేషం.

వ్యక్తిగత స్నేహం ఉన్నా కూడా ఆయన నిజాయితీకి అలాంటి నజరానానే దక్కింది. నిజానికి కేజ్రీవాల్ ఇంటిలో చీఫ్ సెక్రటరీ అన్షుప్రకాష్ పై ఎమ్మెల్యేలు దాడిచేసి కొట్టినప్పుడు జైన్ అక్కడే ఉన్నారు. దాడి విషయాన్ని ఆయన విచారణలో ధ్రువీకరించినట్లు పోలీసులు కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేలు ఇద్దరూ అరెస్టు అయ్యారు కూడా. అయితే జైన్ మాత్రం ఆ రోజు నుంచి సెలవులోనే ఉన్నారు. ప్రభుత్వానికి నచ్చని అధికారుల్ని సెలవుమీద పంపడం అనే శిక్ష సాధారణంగా జరుగుతూ ఉంటుంది.

చివరికి ఇన్ని రోజులు గడచిన తర్వాత.. జైన్ ఏకంగా పదవికి రాజీనామా చేసేశారు. మరి కేజ్రీవాల్ ఇలాంటి పరిణామాల ద్వారా ఢిల్లీ ప్రజలకు ఏం సందేశం ఇవ్వదలచుకున్నారు? తన పార్టీకి చెందిన గూండా ఎమ్మెల్యేల గురించి సాక్ష్యం చెప్పినా, వారి జోలికి వచ్చినా, స్నేహితుడని కూడా చూడకుండా తన్ని తగలేస్తానని ఆయన సందేశం ఇవ్వదలచుకున్నారా? అని ప్రజలు ప్రశినస్తున్నారు. దాడి వ్యవహారంపై పాటించినట్టే కేజ్రీవాల్ మౌనంగానే ఉండడం విశేషం.