Advertisement


Home > Politics - Gossip
‘జమిలి’ కార్యరూపం దాల్చడం కలే!

దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, పార్లమెంటుకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, జమిలి ఎన్నికల వలన ఎన్నికల నిర్వహణకు అయ్యే వందల కోట్ల రూపాయల వ్యయాన్ని తగ్గించుకోవాలనే కేంద్ర ప్రభుత్వపు సంకల్పం అంత ఈజీగా కార్యరూపం దాల్చేలా లేదు. జమిలి ఎన్నికలను తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తూ ఉండడంతో, అది కార్యరూపం దాల్చే అవకాశం దాదాపుగా మృగ్యమైనట్లే లెక్క.

జమిలి ఎన్నికలు నిర్వహించడం అనేది మోడీ ప్రభుత్వం చేసిన కొత్త ఆలోచన కాదు. గతంలో వాజపేయి ప్రభుత్వ కాలం నుంచీ.. ఈ ఆలోచన నడుస్తోంది. కాకపోతే.. మోడీ గద్దె ఎక్కిన తర్వాత.. దానిమీద చురుగ్గా కసరత్తు చేశారు. ప్రభుత్వాలు కూలిపోవడం, గెలిచిన ప్రతినిధులు మరణించడం, రాజీనామా చేయడం, పార్టీలు ఫిరాయించడం ఇలాంటి అనేక పరిస్థితుల నేపథ్యంలో ఉత్పన్నం కాగల అంశాలను అధ్యయనం చేశారు. వాటికి తగిన పరిష్కారాలను కూడా రాబట్టారు.

అయితే జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగానికి, ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. సవరణలు అంటే.. పార్లమెంటులో తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు సింపుల్ మెజారిటీ సరిపోదు. మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాల్సిదే. అందువలన, ముందుగానే ఈ విషయంపై దేశంలోని అన్ని అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రస్తుతం జాతీయ న్యాయ కమిషన్ కసరత్తు చేస్తోం. పార్టీలను ఆహ్వానించి అభిప్రాయాలు తెలుసుకుంటోంది.

ఈ ప్రక్రియలో ఇప్పటిదాకా పదిహేను పార్టీల దాకా న్యాయ కమిషన్ ను కలవగా జమిలికి జై కొట్టింది కేవలం అయిదు పార్టీలే. వీటిలో తెరాస, వైకాపా కూడా ఉన్నాయి. తెదేపా వ్యతిరేకించింది. ఇదంతా ఒక ఎత్తుకాగా, అసలు జమిలి ఎన్నికలు అనే ఆలోచన రాజ్యాంగ విరుద్ధం అంటూ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాన్ని అధికారప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వెల్లడిస్తుండడంతో.. ఇక ఈ ఆలోచన కార్యరూపం దాల్చడం కష్టమనే అనుకోవాలి.

జమిలి ఎన్నికలు అసంబద్ధమైన వాదన అని.. అందుకు అంగీకరిస్తే.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించినట్లే అని సింఘ్వీ అంటున్నారు. కాంగ్రెస్ కూడా వ్యతిరేకిస్తున్నట్లయితే.. పార్లమెంటులో మూడింట రెండొంతుల  మెజారిటీని సాధించడం అనేది కల్ల. కాకపోతే.. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేందుకు భాజపా ఈ కుట్ర ఆలోచన చేసిందనే ఆరోపణలు మాత్రం మిగిలిపోతాయి. బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదన్న సామెత చందంగా.. జమిలి ఆలోచన పట్టాలెక్కకపోవచ్చు గానీ.. ప్రాంతీయపార్టీలను దెబ్బతీసే బుద్ధిగల పార్టీగా భాజపాకు నిందలు మాత్రం తప్పవు.