cloudfront

Advertisement


Home > Politics - Gossip

ఓన్లీ కాంగ్రెస్.. ఇతరులపై నో ఫోకస్!

ఓన్లీ కాంగ్రెస్.. ఇతరులపై నో ఫోకస్!

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తన తొలి ప్రచార సభను కూడా పూర్తి చేసేశారు. ఇంకా ఎవరెవరితో జట్టుకట్టాలో.. లేదా ఒంటరిగానో పోటీచేయాలో తేల్చుకోలేకుండా ప్రత్యర్థి పార్టీలన్నీ సతమతం అవుతున్న తరుణంలోనే... ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా చాలా దూకుడుగా శ్రీకారం చుట్టి.. ముందడుగు వేశారు. అయితే ఈ ఎన్నికలను ఫేస్ చేయడంలో కేసీఆర్ ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారు?... అనేదానికి కీలక సంకేతాలు తొలి సభ హుస్నాబాద్ లోనే కనిపించాయి.

హుస్నాబాద్ సభలో కేసీఆర్ ప్రధానంగా ప్రత్యర్థుల్లో కాంగ్రెస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టారు. హుస్నాబాద్ సభ ప్రసంగంలో మిగిలిన పార్టీల గురించి ఆయన పెద్దగా పట్టించుకోనేలేదు. ఆ రకంగా ఆయన ఈ ఎన్నికల్ల తన వ్యూహాన్ని బయటపెట్టినట్లయింది.

నిజానికి ప్రస్తుతం తెలంగాణలో కేసీఆర్ ను ఢీకొంటున్నది అంతో ఇంతో కాంగ్రెస్ మాత్రమే. తెదేపా, భాజపాలు ఏదో ప్రెస్ మీట్ లలో ప్రకటనలు చేయడానికే పరిమతమై ఉన్నారు. తెజస కాస్త ప్రజల్లో తిరుగుతున్నా.. అధికారపార్టీని ఎదిరించే స్థాయిలో లేదు. వామపక్షాల సంగతి సరేసరి.

ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్-తెరాసకు వ్యతిరేకంగా అన్నిపార్టీలూ జట్టు కట్టదలచుకున్నా కూడా.. ఆ కూటమికి కాంగ్రెస్ పార్టీనే సారథ్యం వహించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్సే అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఒక్క కాంగ్రెస్ ను దెబ్బకొడితే చాలు.. అని కేసీఆర్ డిసైడైనట్లు కనిపిస్తోంది.

పైగా ఈ రకమైన వ్యూహం ద్వారా.. కేసీఆర్ ఇతర ప్రత్యర్థులతో మైండ్ గేమ్ ఆడుతున్నారని కూడా పలువురు విశ్లేషిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ను మాత్రమే ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా.. తతిమ్మా పార్టీలన్నీ నా ప్రత్యర్థి స్థాయికి సరితూగేవి కాదు అనే సంకేతాలు ఇస్తూ... వారిలో ఇన్ఫీరియారిటీని పెంచడం అనేది కేసీఆర్ వ్యూహం అయి ఉండొచ్చునని కూడా అనుకుంటున్నారు.

విమర్శలు కానీ, వలసలు కానీ.. కాంగ్రెస్ ను బలహీన పరచడానికి మాత్రమే కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారు. ప్రసంగాల్లో వారిని తూలనాడుతూ.. మరోవైపు ఆ పార్టీ కీలక నాయకులను తెరాసలోకి చేర్చుకోవడానికి కూడా ప్రతిపాదనలు పంపుతున్నారు. మిగిలిన పార్టీలనుంచి వలసల గురించి పట్టించుకోకపోవడం కూడా విశేషమే.