cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

వైసీపీ ట్రాప్‌లో ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా

వైసీపీ ట్రాప్‌లో ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా

క‌రోనా విప‌త్తు వేళ‌లోనూ ఏపీలో రాజ‌కీయాల‌కు మాత్రం లాక్‌డౌన్ లేదు. ప్ర‌జా జీవ‌నం  మాత్రం స్తంభించినా...అధికార‌, ప్ర‌తిప‌క్ష నేత‌లు మాత్రం ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం మానుకోలేదు. అంతేకాదు, నేత‌ల ఆరోప‌ణ‌ల్లో ఘాటు పెరిగింది. ఈ నేప‌థ్యంలో ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌ర్సెస్ ఏపీ బీజేపీ అన్న‌ట్టు చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. ఒక్క దెబ్బ‌కు అనేక పిట్ట‌ల‌న్న‌ట్టు వైసీపీ వేసిన ఎత్తుగ‌డ రాజ‌కీయంగా స‌త్ఫ‌లితాల‌నే ఇస్తోంది.

రాజ‌ధాని నిర్ణ‌యం, ప్ర‌భుత్వ బ‌డుల్లో ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెట్ట‌డం, తాజాగా క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల కిట్ల కొనుగోలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నాడు. నిజానికి ఏపీలో బీజేపీకి నోటా పార్టీ అని పేరు. ఎందుకంటే గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒక్క‌చోట కూడా బీజేపీ నేత‌లు డిపాజిట్లు కూడా ద‌క్కించుకున్న దాఖ‌లాలు లేవు. కేంద్రంలో స్వ‌తంత్రంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌గ‌లిగిన పార్టీకి ఏపీలో ఉన్న బ‌లం అది.

ఇక ఆ పార్టీకి ఏపీలో నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ గురించి కూడా చెప్పుకోవాలి. క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌ర‌సారావుపేట పార్ల‌మెంట్‌ అభ్య‌ర్థిగా పోటీ చేశాడు. ఈ ఎన్నిక‌ల్లో న‌ర‌సారావుపేట పార్ల‌మెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్య‌ర్థి లావు శ్రీ‌కృష్ణ‌దేవ‌రాయ‌లుకు 7,45,089 ఓట్లు, టీడీపీ అభ్య‌ర్థి రాయ‌పాటి సాంబ‌శివ‌రావుకు 5,91,111, జ‌న‌సేన అభ్య‌ర్థి న‌య్యుబ్ క‌లాంకు 48 వేల ఓట్లు, బీజేపీ అభ్య‌ర్థి క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌కు 15,468 ఓట్లు ద‌క్కాయి.

కాంగ్రెస్ హ‌యాంలో మంత్రిగా ప‌నిచేసిన, బ‌ల‌మైన సామాజిక‌వ‌ర్గ నేప‌థ్యం క‌లిగిన క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ 15,468 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచాడు. మ‌రి ఈ ఓట్ల‌లో బీజేపీని చూసి వేసిన ఓట్లెన్ని? వ‌్య‌క్తిగ‌తంగా క‌న్నా సాధించిన ఓట్లెన్నో ఆ పార్టీ నేత‌లే చెప్పాలి. క‌న్నా నేతృత్వంలో ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేయాల‌నుకోవ‌డం...కుక్క తోక ప‌ట్టుకుని గోదారిని ఈదాల‌నుకోవ‌డమే.

ఇక ప్ర‌స్తుత విష‌యానికి వ‌స్తే, కిట్ల కొనుగోలులో జ‌గ‌న్ స‌ర్కార్ క‌మీష‌న్ల కోసం క‌క్కుర్తి ప‌డింద‌ని క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశాడు. ఏదైనా గుప్పిట ఉన్నంత వ‌ర‌కే విలువ‌. గుప్పిట తెరిస్తే...ఏమీ ఉండ‌దు. ఈ విష‌యాన్ని విస్మ‌రించిన క‌న్నా...ప‌దేప‌దే నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టం ఏపీ అధికార పార్టీకి కోపం తెప్పించింది. ఒక్క‌సారిగా ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. చంద్ర‌బాబు నుంచి రూ.20 కోట్లు ముట్ట‌డం వ‌ల్లే క‌న్నా ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నాడ‌ని ఘాటుగా సమాధాన‌మిచ్చాడు.

దీంతో రాజ‌కీయ వేడి ర‌గులుకుంది. క‌న్నాకు సొంత పార్టీలో మ‌ద్ద‌తు క‌రువైంది. దీంతో తానే మీడియా ముందుకు రావాల్సి వ‌చ్చింది. ఏయ్ విజ‌య‌సాయిరెడ్డి మ‌ర్యాద ద‌క్క‌ద‌ని హెచ్చ‌రించాడు. అంతేకాదు, త‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన విజ‌య‌సాయి కాణిపాకంలో ప్ర‌మాణం చేయాల‌ని డిమాండ్ చేశాడు. దీంతో విజ‌య‌సాయి వెన‌క్కి త‌గ్గుతాడ‌ని క‌న్నా న‌మ్మాడు. అబ్బే...సీన్ రివ‌ర్స్‌. క‌న్నా...కాణిపాకానికి ఎప్పుడొస్తావ్‌? అని విజ‌య‌సాయి ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించాడు. ఈ నేప‌థ్యంలో బీజేపీ నేత‌ల‌కు దిక్కుతోచ‌లేదు.

ఇదిలా ఉంటే క‌న్నాకు మ‌ద్ద‌తుగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ట్విట‌ర్‌లో ప్ర‌క‌ట‌న ఇచ్చాడు. క‌రోనా విప‌త్తులో చిల్ల‌ర రాజ‌కీయాలు స‌రికాద‌ని హిత‌వు ప‌లికాడు. అంత వ‌ర‌కే ఆయ‌న ఆగి ఉంటే పెద్ద‌రికంగా ఉండేది. కానీ క‌న్నాకు క్ష‌మాఫ‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిచ్చింది. ఇక ఎల్లో మీడియా అయితే వైసీపీ-బీజేపీ మ‌ధ్య అనుబంధం తెగిపోయింద‌ని సంబ‌ర‌ప‌డుతూ వంట‌కాలు వండింది. చ‌ర్చ‌ల పేరుతో ర‌చ్చ‌ర‌చ్చ చేసింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు నేరుగా ఎలాంటి కామెంట్ చేయ‌న‌ప్ప‌టికీ...ఆయ‌న కేంద్రంగానే విజ‌య‌సాయి ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు. చంద్ర‌బాబుకు చీమ కుడితే బీజేపీలో ఉన్న సుజ‌నా, సున్నా గిల‌గిల‌లాడుతారని, బానిస‌త్వం, బ్రోక‌రిజం నేర్పిన విశ్వాసం అది అని ట్విట‌ర్‌లో విజ‌య‌సాయి తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశాడు.  రాష్ట్రంలోని అన్ని పార్టీలూ బాబు క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాయని, అందుకే బాబు ఉస్కో అన‌క‌ముందే భౌభౌమంటాయ‌ని, ఎప్పుడు ఏ విధంగా విషం చ‌ల్లాలో దేశం ఆఫీసే క‌మాండ్స్ ఇస్తుందంటూ విజ‌య‌సాయి ట్వీట్ వెనుక లోతైన అర్థాలు దాగి ఉన్నాయి.

ఈ ట్వీట్‌తో సీపీఐ రామ‌కృష్ణ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌ల‌ను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించాడు. బీజేపీ విమ‌ర్శ‌ల‌పై వేచి చూసే ధోర‌ణిలో వైసీపీ ఉండ‌టంతో, కిందిస్థాయి శ్రేణుల్లో ఒక ర‌క‌మైన అస‌హ‌నం క‌నిపించేది. అలాగే బీజేపీపై వివిధ సామాజిక వ‌ర్గాల్లోనూ, ప్ర‌జ‌ల్లోనూ అనేక కార‌ణాల వ‌ల్ల అసంతృప్తి ఉంది. కానీ బీజేపీకి వైసీపీ ద‌గ్గ‌ర‌గా ఉంద‌న్న కార‌ణంగా...జ‌గ‌న్‌పై కూడా ఈ వ‌ర్గాలు కొంత వ‌ర‌కు అసంతృప్తిగా ఉంటున్నాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిని టార్గెట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా సీన్ మారిపోయింది.

వైసీపీ తాజా రాజ‌కీయ పంథాపై ఆయా వ‌ర్గాల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. రానున్న రోజుల్లో బీజేపీపై ఇదే ధోర‌ణి కొన‌సాగించాల‌ని, అంతేకాకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్ర స‌ర్కార్‌ను కూడా విడిచి పెట్టొద్ద‌నే వాద‌న కూడా బ‌ల‌ప‌డుతోంది. అయితే బీజేపీతో టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌ను క‌లిపి విమ‌ర్శించ‌డం ద్వారా ఆ మూడు పార్టీలను బ‌ద్నాం చేయాల‌న్న వైసీపీ ట్రాప్‌లో ఎల్లో మీడియా కూడా ఇరుక్కుంది. ప్ర‌తిప‌క్షాల క‌ళ్ల‌ను వాళ్ల వేళ్ల‌తోనే పొడిపించాల‌న్న వైసీపీ ఎత్తుగ‌డ‌లు ప్ర‌స్తుతానికి స‌క్సెస్ అయిన‌ట్టే క‌నిపిస్తున్నాయి.

రాజ‌కీయంగా ఇదే వైఖ‌రితో ముందుకు పోతే మాత్రం...వైసీపీ మ‌రింత బ‌లోపేతం అయ్యే అవ‌కాశాలున్నాయి. ఎందుకంటే కేంద్రంతో , బీజేపీతో స‌న్నిహితంగా ఉండ‌టం వ‌ల్ల ఏపీకి, జ‌గ‌న్‌కు ఒన‌గూరిన ప్రయోజ‌నాలేవీ లేవు. అలాంట‌ప్పుడు వాళ్ల‌తో అంట‌కాగ‌డం వ‌ల్ల మైనార్టీల ఓట్ల‌ను పోగొట్టుకోవాల్సిన అవ‌స‌రం వైసీపీకి ఉంద‌ని జ‌గ‌న్ భావిస్తార‌ని ఎవ‌రూ అనుకోవ‌డం లేదు. బీజేపీతో వైసీపీకి స్నేహం చెడింద‌ని ఎల్లో మీడియాలో ఎంత ఎక్కువ ప్ర‌చారం చేస్తే...జ‌గ‌న్‌కు అంత మంచిది. ప్ర‌స్తుతం వైసీపీ కోరుకుంటున్న‌ట్టే ఎల్లో మీడియా, ప్ర‌తిప‌క్షాలు చేస్తున్నాయి.  

కన్నా బీజేపీకి మాత్రం కన్నం వెయ్యకు