cloudfront

Advertisement


Home > Politics - Gossip

సొంత దుకాణమే బెటరనుకున్న పవన్!

సొంత దుకాణమే బెటరనుకున్న పవన్!

పవన్ కల్యాణ్ తన పోరాట యాత్రను ప్రారంభించడానికి ముందు.. తన యాత్రకు వివిధ మీడియా సంస్థలు, టీవీ ఛానెళ్లలో అనుకూల ప్రచారం విస్తృతంగా రావడం కోసం ఆయా ఛానెల్ యజమానులతో సంప్రదింపులు జరిపారు. అన్ని పార్టీలకూ ముమ్మరంగా ప్రచారం ఇస్తున్నట్లే మీకు  కూడా ఇవ్వగలమని, కానీ అన్ని పార్టీలు తమకు భారీ మొత్తాలు చెల్లిస్తున్నట్లే మీరు కూడా చెల్లించాలని దాదాపుగా అన్ని యాజమాన్యాలూ ఒకే మాట చెప్పాయి. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా.. ఛానెళ్లలో లభించేది ‘పెయిడ్ ప్రచారమే’ అనేది తెలిసిన సంగతే. పోనీ ఛానెళ్లలో ప్రచారానికి బేరమాడడానికి పూనుకునే సరికి అందరూ ఒక్కొక్క టూరుకు కోట్లలో చెల్లించాలని రేట్లు ప్రకటించారు. మొత్తానికి ఆ మొత్తాలు విని బిత్తర పోయిన పవన్ కల్యాణ్.. వీళ్లందరికీ యింతేసి సొమ్ము చెల్లించేకంటే సొంత ఛానెల్ పెట్టుకోవడమే బెటర్ అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ కు ఒక సొంత గొంతకు ఏర్పడబోతున్నది. జనసేన పార్టీ ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో.. ఆ పార్టీ కీలక నాయకుడు ఒక టీవీ ఛానెల్ ను సొంతం చేసుకున్నారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న 99 టీవీ ఛానెల్ ను తోటచంద్రశేఖర్ కొనుగోలు చేశారు. మొత్తానికి పవన్ కల్యాణ్ రాజకీయాలను చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారనడానికి.. అమీ తుమీ తేల్చుకునేలా.. తన మార్కు ప్రచారానికి కత్తెరలు లేకుండా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నారనడానికి ఇది నిదర్శనం.

సీపీఎం 10 టీవీ పెట్టుకోగానే.. మనకు  కూడా ఓ టీవీ వ్యాపారం ఉండాలని అనుకున్నదేమో గానీ.. సీపీఐ కూడా 99 టీవీని ప్రారంభించింది. ఇప్పుడు వారు దానిని విక్రయించేయగానే.. వీరు కూడా దీనిని విక్రయించేశారు. మొత్తానికి తమ పార్టీకి కూడా ఒక టీవీ ఛానెల్ ప్రచారం అవసరం అని భావిస్తున్న జనసేన కోసం.. తోట చంద్రశేఖర్ దానిని కొనుగోలు చేశారు.

సివిల్ సర్వీసెస్ కేడర్ కు చెందిన తోట చంద్రశేఖర్ ముంబాయి నగరాభివృద్ధి సంస్థ సీఈవో గా పనిచేసి పాపులారిటీ సంపాదించుకున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు.. తోట చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా పోటీచేశారు. భారీగా ప్రచారం నిర్వహించారు గానీ.. రాయపాటి సాంబశివరావు తదితరుల ముందు నిలవలేకపోయారు. చిరంజీవి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత.. ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. ఏలూరు నుంచి ఎంపీగా రంగంలోకి దిగారు గానీ.. ఆ ఆశ కూడా ఫలించలేదు.

తీరా ఇప్పుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తర్వాత.. ఆయనతో సన్నిహితంగా మెలగుతున్నారు. జెఎఫ్‌సి కసరత్తు చేసినప్పుడు కూడా కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇప్పుడు జనసేన ప్రచారం కోసం ఆయన టీవీ ఛానెల్ ను కొన్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టడమే లక్ష్యంగా తోట చంద్రశేఖర్ ఈ ఛానెల్ ఖర్చులకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది.