Advertisement


Home > Politics - Gossip
పరువు పోయిందని 'సిద్దూ' ఫీలింగా?

సాధారణంగా ఏ పార్టీ ముఖ్యమంత్రి అయినా సరే అవినీతిని సహించనని, అవినీతిపరుల భరతం పడతామని, తప్పు చేసినవారు ఎంత పెద్దవారైనా సరే వదిలేది లేదని గొప్పగా చెబుతుంటారు. వీరి మాటలు నమ్మి నిజాయితీపరులైన అధికారులు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టారనుకోండి, ఫలానవారు అవినీతి చేస్తున్నారని చెప్పారునుకోండి ఆశించినట్లుగా ప్రశంసలు దక్కవు. వేధింపులకు గురి చేస్తారు.

అందుకే నిజాయితీపరులైన అధికారులు కొందరు అవినీతి విషయాలు తెలిసినా తమకెందుకని సర్దుకొనిపోతారు. ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పినట్లు విని రిస్కు తప్పిందని సంతోషిస్తారు. ఇందుకు ఇష్టపడనివారు పాలకులు పెట్టే వేధింపులు భరిస్తూ, అప్రాధాన్య పోస్టులకు, దూర ప్రాంతాలకు బదిలీ అవుతూ నానా కష్టాలు పడతారు. కాబట్టి అవినీతిని సహించమని పాలకులు చెప్పారంటే నిజాయితీపరులను సహించలేమని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కర్నాటక జైళ్ల శాఖ డీఐజీ డి.రూపకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నిజాలు చెప్పినందుకు అక్కడి సిద్ధరామయ్య సర్కారు ఆమెను వేధిస్తోంది.

నిజాలు చెప్పిన అధికారిని అభినందించకుండా వేధించడం ఏమిటి? నిజాలు చెప్పి ప్రభుత్వం పరువు తీసిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అభిప్రాయం. ఇంతకూ డీఐజీ రూప చెప్పిన నిజాలు మామూలు వ్యక్తికో, చిల్లర దొంగకో సంబంధించినవి కావు కదా. అక్రమాస్తుల కేసులో బెంగళూరు సమీపంలోని పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తున్న దివంగత జయలలిత ప్రియ సఖి శశికళకు సంబంధించినవి. ఆమె చరిత్ర ఏమిటో తెలిసిందే కదా.

సాధారణ ఖైదీ మాదిరిగా శిక్ష అనుభవించాల్సిన శశికళ 'అసాధారణ ఖైదీ'గా మారిపోయింది. జైలు అధికారులు ఆమెకు ఫైవ్‌స్టార్‌ హోటల్‌ సౌకర్యాలు కల్పించారు. వీవీఐపీ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారు. ప్రత్యేకంగా వంటశాల ఏర్పాటు చేసి షడ్రుచులతో పంచభక్ష్య పరమాన్నాలు వడ్డిస్తున్నారు. ఇదంతా జైలు అధికారులు ఉచితంగా చేయరు కదా. ప్రతిఫలంగా వారికి శశికళ రెండు కోట్ల రూపాయలు ముట్టజెప్పింది. ఆమెకు డబ్బుకు కొదువా? జైలు అధికారులకు లంచం ఇచ్చినట్లు నిర్థారించుకున్న డీఐజీ రూప దానిపై నివేదిక తయారుచేసి తన పై అధికారులకు అందచేశారు. ఇది మంచి పనే కదా.

కాని ఆమె ఈ వివరాలు మీడియాకు వెల్లడించారని సీఎం సిద్దరామయ్య ఆగ్రహించారు. ఈ పని సర్వీస్‌ నిబంధనలు అతిక్రమించడమేనన్నారు. సమస్యలను మీడియాకు చెప్పకూడదనేది ఆయన వాదన. ఈ విషయంలో రూప వెనక్కి తగ్గలేదు. మీడియాతో ముందుగా తాను మాట్లాడలేదని, డైరెక్టర్‌ జనరల్‌ మాట్లాడారని చెప్పారు. చర్యలు తీసుకుంటే అందరిపై తీసుకోవాలని, తనను మాత్రమే టార్గెట్‌ చేయడమేంటని ప్రశ్నించారు.

పరప్పన అగ్రహారం జైల్లో శశికళకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. దీనిపై చాలాకాలం క్రితమే పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. రూప పరిశోధనలో ఆరోపణలు నిజమని తేలింది. శశికళ  తనను తాను వీవీఐపీగా భావిస్తూ ప్రత్యేక సౌకర్యాల కోసం డిమాండ్‌ చేసిందని,  ఆమెకు జైల్లో ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా గతంలో మీడియాలో వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు.

ఒక న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు జైళ్ల శాఖ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సమాధానమిస్తూ శశికళకు, ఇళవరసికి ఎటువంటి ప్రత్యేక వసతులు కల్పించడంలేదన్నారు. తనను భద్రత రీత్యా తమిళనాడులోని జైలుకు మార్చాలని శశికళ చేసిన విజ్ఞప్తిని జైలు అధికారులు నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చారు.

ఆమె మొత్తం శిక్షను పరప్పన అగ్రహారం జైల్లోనే అనుభవిస్తారని స్పష్టం చేశారు. శశికళ  జైల్లో నుంచే తన హవా కొనసాగించింది.  సెల్‌లో కూర్చునే ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. సూచనలు, సలహాలు ఇస్తోంది. చాలాసార్లు మంత్రులు జైల్లో చిన్నమ్మను కలుసుకొని మాటామంతీ జరిపారు. జైల్లో ఉన్న వ్యక్తి అక్రమాస్తుల కేసులో దోషి. ఆమెతో  మంత్రులు మాట్లాడటమేమిటి? పాలకులు దోషి సలహాలు, ఆదేశాలతో పనిచేయడమేమిటి? ఇది నైతికంగా, రాజ్యాంగపరంగా తప్పు కదా.

ఈ అరాచకాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో తమిళనాడుకు చెందిన  'ట్రాఫిక్‌ రామస్వామి' అనే   సామాజిక కార్యకర్త చిన్నమ్మను పరప్పన అగ్రహారం జైలు నుంచి మార్చాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేశారు.  శశికళ కోరినట్లు తమిళనాడు జైలుకు పంపాలని రామస్వామి కోరలేదు.

కర్నాటకలోని తుమకూరు జైలుకు పంపాలని కోరారు. ఏమిటి దీని ప్రత్యేకత? ఇది పూర్తిగా మహిళల జైలు. దీంతో సహజంగానే ఇక్కడ భద్రత, నిబంధనలు కఠినంగా ఉంటాయి. మగవారికి ప్రవేశం ఉండదు.ఎప్పుడంటే అప్పుడు వెళ్లి మాట్లాడటం కుదరదు. శశికళను అక్కడికి పంపితే ఆమె తిక్క కుదురుతుందని, హవా తగ్గుతుందని రామస్వామి భావించారు. సో...శశికళకు జైలు అధికారులు సహకారం అందిస్తున్నారనేది వాస్తవం కావొచ్చు.