cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్‌ అయోమయం.. పతాక స్థాయికి.!

పవన్‌ అయోమయం.. పతాక స్థాయికి.!

ఎన్నికల వేళ క్షణం తీరిక లేకుండా కష్టపడాల్సింది పోయి, ఇప్పుడు తీరిగ్గా పొత్తుల చర్చలు చేస్తున్నారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌.. అదీ ఆంధ్రప్రదేశ్‌ వెలుపల. అందునా, బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతితో జనసేనాని పొత్తుల చర్చలు చేపట్టడం జనసేన శ్రేణుల్నే విస్మయానికి గురిచేస్తోంది. తెలంగాణలోనూ జనసేన పోటీచేస్తుందనీ, బీఎస్పీ - జనసేన మధ్య పొత్తు వుంటుందని పవన్‌కళ్యాణ్‌, మాయావతితో భేటీ అనంతరం చెప్పారు.

ఇంకా చిత్రమైన విషయమేంటంటే, పవన్‌కళ్యాణ్‌కి మాయావతిని ప్రధాని పదవిలో చూడాలని వుందట. మాయావతి జాతీయస్థాయి నేత అన్నది నిర్వివాదాంశం. ఒకప్పుడు ప్రధాని పదవి కోసం ఆమె పోటీపడ్డ మాటా వాస్తవం. ఇప్పటికీ ఆమెకు ప్రధాని అవ్వాలనే ఆశవున్న మాటా వాస్తవం. కానీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ ఒకప్పటిలా ఇప్పుడు అంత బలంగాలేదు. ఆ మాటకొస్తే, ఈ ఎన్నికలు బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చావో రేవో లాంటివే.

అయినా, బీఎస్పీతో జనసేన పొత్తు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో జనసేనకు ఒరిగేదేముంటుంది.? తెలంగాణలో కాస్తో కూస్తో బీఎస్పీ వల్ల జనసేనకు ఓట్లు రాలే అవకాశం వున్నా, మొత్తంగా తెలంగాణలో జనసేన తన ఉనికిని చాటుకునే పరిస్థితి కూడా లేదాయె. ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్పీ ఉనికి దాదాపుగా లేదనే చెప్పాలి. మరి, జనసేనతో పొత్తుపెట్టుకుని ఆ పార్టీకి పవన్‌కళ్యాణ్‌ ఎన్ని సీట్లు కేటాయించగలరు.? జనసేన పార్టీలో ఇప్పుడు ఇదో కొత్త తలనొప్పిగా మారింది.

మొత్తమ్మీద, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా తన పేరుని చూసుకోవాలనుకుంటున్న పవన్‌కళ్యాణ్‌, ఆ దిశగా సరైన ప్రయత్నాలైతే చేయలేకపోతున్నారన్నది నిర్వివాదాంశం. జాతీయ పార్టీలతో పొత్తులు, చర్చలు నేరమేమీ కాదుగానీ, వాటివల్ల పార్టీకి ఉపయోగమేంటి.? అన్నది ఆలోచించుకోకపోతే ఎలా.? ఏమో, ఎన్నికల ముందర జనసేనాని నుంచి ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో.!