cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్‌కల్యాణ్‌ బేరం.. సీఎం పీఠం!

పవన్‌కల్యాణ్‌ బేరం.. సీఎం పీఠం!

'ఒక్క ఛాన్స్‌ ఇచ్చి చూడండి... ఇక ఎప్పుడూ నేనే సీఎం అయ్యేలాగా పరిపాలిస్తా' అనేది పవన్‌కల్యాణ్‌ ఈ రాష్ట్ర ప్రజలకు ఇస్తున్న వాగ్దానం. ప్రజలతో ఆయన చాలా స్పష్టంగా 'సీఎం పీఠం' కోసం బేరం పెడుతున్నారు. కేవలం ప్రజలతో మాత్రమేనా...

అటు ప్రజలతో కానివ్వండి... చంద్రబాబునాయుడుతో కానివ్వండి.. జగన్మోహన్‌ రెడ్డితో కానివ్వండి.. పవన్‌కల్యాణ్‌ పెట్టగల బేరం ఇదొక్కటే. 'సీఎం పీఠం' మాత్రమే. కాస్తలోతుగా గమనిస్తే ఆ సంగతి అర్థమవుతుంది.

నిన్నటిదాకా చంద్రబాబునాయుడు అపారమైన అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం అన్న నోటితోనే ఇవాళ ఆయన అవినీతిని గురించి చాటింపు వేస్తున్నారు. జగన్మోహన్‌ రెడ్డి అవినీతి పరుడని తొలినుంచి ఈసడించారు...

కానీ, 2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత.. 'ఈ ఇద్దరికి అండగా నిలవడం గానీ, అండతీసుకోవడం గానీ.. పవన్‌కల్యాణ్‌ చేయరు' అని గ్యారంటీ ఏమిటి? పవన్‌ ఆమేరకు మాట ఇవ్వగలరా? తన సభల్లో, పోరాటయాత్రలో ఆ విషయాన్ని నిజాయితీగా ప్రజలముందు చెప్పగలరా? కాదూ, కూడదూ... 'సీఎం పీఠం బేరం' నుంచి పక్కకు తప్పుకునేదే లేదనేట్టు ఊరకుంటారా?

జనసేన పరిణామాలపై గ్రేటాంధ్ర కథనం...
పవన్‌కల్యాణ్‌ సినిమాలకంటె పొలిటికల్‌గానే మాంఛి ఫైర్‌ ఉన్న హీరో అని అనిపించుకున్నాడు. అందులో ఎలాంటి సందేహమూలేదు... తొలి సినిమాలతో పాటు, కెరీర్‌ బెస్ట్‌ సినిమాలు అనదగిన తొలిప్రేమ, ఖుషి వంటి చిత్రాల్లో పవన్‌ చాలా స్మూత్‌, జోవియల్‌ కుర్రాడిగానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సినిమాలు చేసినా.. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఆవేశం, బీభత్సమైన ఫైర్‌ ఉన్నవి లేవు.. ఒకవేళ ఉన్నా అది యాక్షన్‌ మాత్రమే అనే సంగతి చూస్తున్న అందరికీ తెలుసు.

కానీ పవన్‌కల్యాణ్‌ రాజకీయాల్లోకి ఇచ్చిన ఎంట్రీ.. ఒక సంచలనం. పైగా అందులో 'టేక్‌' ల్లేవు... యాక్షన్‌-కట్‌లు లేవు, బట్టీపట్టిన స్క్రిప్టులు లేవు.. ఉన్నదెల్లా ఒకటే- దూకుడు! అన్నకు అనుజుడిగా.. యువరాజ్యం అధినేతగా.. ఎన్నికల ప్రచార సభల్లో 'ఈ కాంగ్రెసోళ్ల పంచెలూడగొట్టి తరమండి' అంటూ ఆయన పొలికేకలు పెట్టినప్పుడు జనం విస్తుపోయారు. ఆ తరహా మాటలు అప్పటిదాకా రాజకీయ ప్రచారాల్లో మనం ఎరగం. అలా మాస్టర్‌ స్ట్రోక్‌తో మొదలైన పవన్‌ జర్నీ... రాజకీయాల్లో అన్న-రాజ్యంతో పాటూ అస్తమించి, ఆ తర్వాత.. 2014కు ముందు మళ్లీ ఉదయించి.. నాలుగేళ్ల పాటు సుప్త చేతనావస్థలో నిద్రలో గడిపి, ఆ తర్వాత జాగృతమై... ఏడాదిలోగా సీఎం పీఠాన్ని దొరకబుచ్చుకునే మహోన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నది.

తెదేపాకు జెల్లకొట్టడమే అనూహ్యం!
పవన్‌కల్యాణ్‌ గత ఏడాదిలో ఎక్కడైనా రాజకీయ సభలు పెట్టి ప్రసంగించినా కూడా.. 'మాది కొత్తపార్టీ.. 2019 ఎన్నికల్లో మాకు బలం ఉన్న కొన్నిస్థానాల్లో మాత్రమే పోటీచేస్తాం' అని చెబుతుండేవారు. ఆ తర్వాత కొన్నాళ్లకు 'తమ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తుం'దని కూడా ప్రకటించారు. ఈ ప్రకటన తొలుత పెద్ద ప్రకంపనాల్ని సృష్టించలేదు. ఎందుకంటే.. అప్పటికి ఆయన తెలుగుదేశం కోటరీ మనిషిలాగానే ఉన్నారు. సామాన్య ప్రజల్లో ఎవరు వెళ్లి పవన్‌ వద్ద తమ కష్టాల గురించి మొర పెట్టుకున్నప్పటికీ.. చంద్రబాబు మీద ఈగవాలనిచ్చే వాళ్లుకాదు. 'నేను సీఎంగారి దృష్టికి తీసుకెళ్తా' అనే మెరమెచ్చు మాటలు మాత్రమే చెబుతుండే వాళ్లు. ఏం జరిగిందో తెలియదు గానీ.. ఈ ఏడాది ఆరంభంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు, ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ మీద అనూహ్యంగా విరుచుకుపడ్డారు.

దానికి కొంతకాలం ముందు నుంచి జెఎఫ్‌సి అంటూ విభజనచట్టం వలన నష్టాల గురించి.. కసరత్తు చేసినప్పుడు కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా కొన్నివ్యాఖ్యలు చేసినా.. ఈ రేంజిలో ఆయన టెంకిజెల్ల కొడతారని ఎవరూ ఊహించలేదు. గుంటూరు సభ ఆదిగా తెలుగుదేశం మీద విరుచుకుపడడం ప్రారంభించారు. 2014లో నేను వారికిసాయం చేశానేతప్ప.. వారి కూటమిలో నేను సభ్యుడినికాదు.. అంటూ అదివరలో కూడా చాలాసార్లు చెప్పారు. కానీ వ్యవహారం చంద్రబాబుకు అనుకూలంగానే ఉంటూ వచ్చింది.

అనూహ్యమైన ఈ విమర్శల దాడి మొదలుపెట్టిన తర్వాత.. తెలుగుదేశం పార్టీ పరువు తీయడంలో పవన్‌కల్యాణ్‌ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అవినీతి మితిమీరిపోయిందంటూ విమర్శలు ప్రారంభించారు. నిజానికి అప్పటిదాకా ఆయనను కీర్తిస్తూ వచ్చిన తెలుగుదేశం శ్రేణుల సహా చంద్రబాబు కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. దీనిని జీర్ణం చేసుకోవడానికి వారికి చాలా సమయం అవసరమైంది. పవన్‌ తన పోరాటయాత్ర మొత్తం ఫోకస్‌ తెదేపా మీదనే పెట్టారు. తొలివిడతలో ఉత్తరాంధ్ర యాత్రకు ఫుల్‌స్టాప్‌ పెట్టిన తర్వాత.. తెలుగుదేశం ఇప్పటికి తేరుకుని ఇక పవన్‌ను కూడా జగన్‌లాగా బద్ధశత్రువుగా ఎంచి ఎదురుదాడి చేయాల్సిందే అనే నిర్ణయానికి వచ్చింది.

ఫోకస్‌.. ఓన్లీ లోకల్‌
ఎటూ తెలుగుదేశంతో సున్నం పెట్టుకోవడం కూడా అయింది. భాజపాతో సున్నం పెట్టుకోకపోయినా.. స్నేహం పెట్టుకున్నా కూడా పుట్టిమునిగే పరిస్థితి గనుక.. రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి తనపాట్లు తను పడాల్సిందే అని పవన్‌ నిర్ణయించుకున్నారు. పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరుగుతున్న జగన్‌కు లభిస్తున్న ఆదరణ, దాని ప్రభావం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. కానీ.. ప్రధానంగా సమయాభావం, జగన్‌లాగా పాదయాత్ర తప్ప మరో వ్యాపకం లేనట్టుగా, మరో ప్రపంచాన్ని ఎరగనట్టుగా సమయం కేటాయించగల తీరు లేకపోవడం వల్ల.. ఆయ మామూలు యాత్రకే పూనుకున్నారు. అయితే ఇక్కడ ఆయన ఒకవ్యూహం అనుసరించారు.

గతంలో వైఎస్సార్‌, చంద్రబాబు, ఇప్పుడు జగన్‌ ఎవ్వరు యాత్రలు చేస్తున్నా సార్వజనీనమైన రాష్ట్రానికి అంతటికీ వర్తించే అంశాలే తీసుకున్నారు. పవన్‌ కాస్త డిఫరెంట్‌ ఎప్రోచ్‌తో వెళ్లారు. లోకల్‌ సమస్యల మీదే ఫోకస్‌ పెట్టారు. తద్వారా లోకల్‌ పీపుల్‌ను ఎట్రాక్ట్‌ చేయవచ్చుననుకున్నారు. వ్యూహాత్మకంగా యాత్రను ఉత్తరాంధ్రలో ప్రారంభించారు. సహజంగానే జనస్పందన విపరీతంగా వచ్చింది.

రెండురోజులు తన పార్టీకి మద్దతిచ్చి గెలిపించాల్సిందిగా కోరిన.. జనస్పందన చూసుకుని.. ఆ తర్వాత.. నన్ను సీఎం చేయండి అనేపాట ప్రారంభించారు. ప్రత్యేకహోదా, జోన్‌, కడప ఉక్కులాంటి అంశాలన్నీ ఆయనకు తృణప్రాయాలు.. గడ్డిపోచతో సమానం. అందరూ వాటినే అడుగుతున్నప్పుడు.. తాను కూడా అవే అడిగితే.. ఇక వెరైటీ ఏముంటుంది? అనే సూత్రాన్ని ఆయన నమ్ముకున్నారు. లోకల్‌ సమస్యల మీదనే గరిష్టంగా ఫోకస పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా విమర్శలు కురిపిస్తున్నారు.

చేవలేని సవాళ్లు...
రాజకీయాల్లో ప్రత్యర్థిని ఇరుకునపెట్టడం అనే లక్ష్యంతో పవన్‌ చేసే సవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జెఎఫ్‌సి సమయంలోనే.. హఠాత్తుగా పుట్టిన ఆలోచనతో.. తెదేపా, వైకాపాలకు దమ్ముంటే అవిశ్వాసం పెట్టాలన్నారు. కావలిస్తే.. నేను మీవెంట ఉంటా, అధికారం మీరే తీసుకోండి, క్రెడిట్‌ మీరే తీసుకోండి నాకొద్దు.. నాకు పని జరిగితే చాలు అన్నారు. బలంమొత్తం నేను సమీకరిస్తా అన్నారు. వారు అవిశ్వాసానికి సిద్ధపడిన తర్వాత... ఆయన కిక్కురు మనలేదు. తాను హోదా మాటెత్తరు.. ఆ మాటెత్తిన ఆ రెండు పార్టీలను సమర్థించరు. దానికితోడు ఇప్పుడు ప్లేటుమార్చి తనకు అధికారం కూడా కావాలంటున్నారు. వాళ్లు అవినీతి పరులని, చేతకాని వాళ్లని నిందలేస్తున్నారు.

మొన్నటికి మొన్న ఉత్తరాంధ్రలోనే తిరుగుతూ కనీసం విశాఖ రైల్వేజోన్‌ గురించి మాటెత్తలేని ఆయన చేతగానితనం గురించి.. తెలుగుదేశం విమర్శించింది. వారికి కూడా ఆయన సవాళ్లు విసిరారు.. సీఎం పదవికి రాజీనామా చేసి చంద్రబాబు, పాదయాత్ర మానుకుని జగన్‌ వస్తే.. తాను కూడా కలిసి రైల్‌ రోకో చేస్తానని సెలవిచ్చారు. ఆ రకంగా ఒక తుస్సు చిచ్చుబుడ్డి లాంటి సవాలు విసిరారు. అంటే ఏమిటన్న మాట... వారిద్దరూ లేకుండా పవన్‌కల్యాణ్‌ దేనికోసమూ ఎలాంటి పోరాటమూ చేయరన్నమాట. మరి వారిని వదిలేసి.. పవన్‌కు ప్రజలు ఎందుకు పట్టంకట్టాలి?

పవన్‌ ఎంత అమాయకత్వంలో, హిపోక్రసీలో బతుకుతున్నాడంటే.. వారిద్దరూ రాకుండా తాను ఏమీచేయను అంటూనే.. వారిద్దరినీ కాలదన్ని తనను సీఎం చేయాలని ప్రజలను కోరుతున్నారు. అదే పెద్దకామెడీ.

సీఎంగిరీపై మోజెలా పుట్టిందంటే...
పవన్‌కల్యాణ్‌ మొన్నటిదాకా చాలా నిస్వార్ధంగానే రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించే మాట్లాడారు. యాత్ర మొదలైన తర్వాతే హఠాత్తుగా సీఎంపదవి బుర్రలోకి చొరబడింది. తన పార్టీ ఈ ఎన్నికల్లో ఎన్నిసీట్లు గెలుచుకోగలుగుతుంది? కింగ్‌మేకర్‌ పొజిషన్‌కు తగిన సీట్లు తమకు దక్కితేచాలు కింగ్‌ అయిపోవడమే లక్ష్యంగా పెట్టుకోవచ్చు.. అనే ఆలోచన మొగ్గతొడిగింది. బహుశా దీనికి పొరుగు రాష్ట్రం కర్నాటకలోని పరిణామాలే ఆయనకు స్ఫూర్తి ఇచ్చాయని అనుకోవాలి. తనకు 15 నుంచి 30 దాకా సీట్లుదక్కితే చాలు. తెదేపా, వైకాపాల్లో ఏ పార్టీ అయినాసరే.. తన మద్ధతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడితే చాలు.. ఇక తాను సీఎం అయిపోయినట్లే అని బహుశా ఆయన అనుకుంటుండవచ్చు.

బాబును సూటిగా అనరుగా...
ఇక అసలు విషయానికి వద్దాం. ఒక్కసారి పవన్‌ ప్రసంగాలను రివైండ్‌ చేసుకుని గుర్తు చేసుకోండి. చంద్రబాబును ఆయన ఏనాడైనా సూటిగా ఏమాటైనా అన్నారా? ఎంతసేపూ మీ కొడుకు అవినీతి చేస్తున్నాడు.. మీ మంత్రులు అవినీతి చేస్తున్నారు.. మీరు కొడుకును ముఖ్యమంత్రి చేయాలంటే మేం సపోర్ట్‌ చేయాలా? అనే మాటలే తప్ప.. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అనేమాట సూటిగా ఆయన నోటమ్మట రాలేదు.

'తల పగ తోక చుట్టరికం' అనే సామెత చెప్పినట్లుగా, పవన్‌కల్యాణ్‌ తల చుట్టరికమే.. తోకలతోనే పగ. కొడుకు అవినీతి చేస్తోంటే, మంత్రులు అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతోంటే.. దానికి చంద్రబాబుది బాధ్యత ఉండదా? ఆ అవినీతిలో ఆయనకు భాగం ఉండదా? కానీ పవన్‌ మాత్రం ఆయనను సూటిగా నిందించలేదు. దానికితోడు తెలుగుదేశం మంత్రులు ఇటీవలి వరకూ 'పవన్‌ కల్యాణ్‌ మాకు శత్రువేం కాదు. మేం మళ్లీ కలవం అని ఎన్నడూ చెప్పలేదు' లాంటి నర్మగర్భ ఉపాఖ్యానాలే చేశారు. తెలుగుదేశం మీద అడ్డగోలుగా విరుచుకుపడినట్లు కనిపిస్తూనే.. చంద్రబాబు మీద నేరుగా ఎలాంటి విమర్శల జోలికి వెళ్లకుండా పవన్‌ 'ముందుచూపు'తో వ్యవహరిస్తున్నారేమో అనిపిస్తోంది.

బేరాలకు.. ద్వారములు తెరచియున్నవి!!
పవన్‌ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? ఖచ్చితంగా ఎన్నికల అనంతరం బేరసారాలకు అవకాశాల్ని సజీవంగా ఉంచుకోవడం కోసమే అని భావించాల్సి వస్తోంది. ఎందుకంటే.. పవన్‌కల్యాణ్‌... చంద్రబాబు-తెలుగుదేశాన్ని, జగన్‌-వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను అవినీతి మయంగా అభివర్ణిస్తున్నారు. ఈ విమర్శలన్నీ నిజమే అని అనుకుందాం. అయితే ప్రస్తుతానికి పవన్‌ కల్యాణ్‌ ఒక్కరే ఎలాంటి అవినీతి మరకలేని స్వచ్ఛమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్నవారు గనుక.. ఈ విషయాలను నమ్మిన ప్రజలందరూ జనసేనకే ఓట్లు వేసి గెలిపిస్తారనే అనుకుందాం.

మరి, ఎన్నికల తర్వాత.. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సింపుల్‌ మెజారిటీ కంటె తన పార్టీకి తక్కువ సీట్లు వస్తే పవన్‌కల్యాణ్‌ ఏం చేస్తారు? ఈ విషయంలో పవన్‌ రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇస్తే తప్ప ఆయన మాటలను, వేస్తున్న నిందలను నమ్మడం కష్టం. ఈ మాటలన్నీ అవకాశవాదపు డ్రామాలే అనుకోకుండా ఉండడం కష్టం. ఎన్నికల తర్వాత, ''తన పార్టీ అబ్సొల్యూట్‌ మెజారిటీ సాధిస్తే మాత్రమే తాను ప్రభుత్వం ఏర్పాటుచేస్తాను'' అని పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు మాటఇవ్వాలి.

మెజారిటీ ఏమాత్రం తగ్గినా మహా అయితే ఇండిపెండెంట్లను ఆశ్రయిస్తానే తప్ప.. అవినీతి బురదలో కూరుకుపోయి ఉన్న తెదేపా, వైకాపాల మద్దతు కూడా తీసుకోను అని కూడా పవన్‌ స్పష్టం చేయాలి. ఇదంతా పవన్‌ పార్టీ సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరిస్తే సంగతి.

అలాకాకుండా.. పవన్‌ పార్టీకి తక్కువ సీట్లు వస్తే.. అవినీతి పార్టీలైన తెదేపా, వైకాపాలలో ఏ ఒక్కరికీ తాను మద్దతు ఇవ్వను. వారు మద్దతు ఇచ్చినా పుచ్చుకోను అని ఆయన ప్రమాణం చేయాలి. ఒకసారి ప్రజల ఎదుట ఆ రెండు పార్టీలు అవినీతి మయం అని నిందలు వేసిన తర్వాత.. ఎన్నికల అనంతరం కూడా వారి మొహం చూడకూడదు. సీఎం పీఠం దక్కుతుందని అనగానే.. వారి భుజాలమీదనే సవారీచేస్తూ.. అధికారం కోసం అర్రులు చాచకూడదు. కర్నాటకలో కుమారస్వామి లాగా ప్రజలు తనమీద పెట్టుకున్న నమ్మకాన్ని పలుచన చేసుకోకూడదు. కాంగ్రెస్‌ మద్దతు తీసుకుని చిన్న పొరబాటుచేసినా మళ్లీ దానిని దిద్దుకుని, తిరిగి ఎన్నికలకు వెళ్లిన కేజ్రీవాల్‌ను గుర్తు తెచ్చుకోవాలి.

అలా అని పవన్‌కల్యాణ్‌ ప్రజలకు మాట ఇవ్వాలి!
లేకుంటే- ఆయనను ప్రజలు ఎందుకు నమ్మాలి?

ఇవాళ నన్ను సీఎం చేయండి.. అంటూ ప్రజల ముందు బేరంపెట్టి.. రేపు తనకు ఏ పదో ఇరవయ్యో సీట్లు వస్తే.. నన్ను సీఎం చేస్తే తప్ప.. మీ పార్టీతో  కలవను. కనీసం సీఎం కుర్చీని చెరిసగం కాలం పంచుకుందాం.. లాంటి బేరాలతో ఆయన తిరిగి చంద్రబాబును ఆశ్రయించరు అని ఏంటి గ్యారెంటీ? ఇలాంటి సందేహాలు కలగడంలో తప్పేముంది? అందుకే పవన్‌ ప్రజల ఎదుట ప్రమాణం చేయాలి? తన పార్టీకి ఎక్కువ- తక్కువ- ఎన్ని సీట్లు వచ్చినా సరే.. ఆ పార్టీల జోలికి మాత్రం వెళ్లనుగాక వెళ్లను అనిచెప్పాలి. అప్పుడే, ఆ పార్టీలు అవినీతి మయం అంటూ ఆయన చెబుతున్న మాటలు వినే ప్రజలు, మనస్ఫూర్తిగా ఆయనను విశ్వసించి గెలిపించడానికి అవకాశం ఉంటుంది.

కలలు వాస్తవం కావాలంటే...
ఇప్పుడు తన యాత్రకు లభిస్తున్న జనస్పందనతో పవన్‌కల్యాణ్‌ మేఘాలెక్కినా కూడా చూపు నేలమీద ఉంచుకోవాలి. ఆయన స్వచ్ఛమైన వ్యక్తి అనడంలో సందేహంలేదు. ఇప్పటిదాకా అవినీతి మరకలేదు. కానీ అధికార లాలసత అనేది ఎంతటి స్వచ్ఛతను కూడా కలుషితం చేసేయగలుగుతుంది. అందుకే ఆయన ముందుగా ప్రజలకు మాట ఇస్తేనే సబబు. ఇప్పుడు దక్కుతున్న ప్రజాదరణ యావత్తూ స్థిరమూ, శాశ్వతమూ కాదనే ఆలోచన కూడా కలిగిఉంటే మేలు.

పవన్‌కల్యాణ్‌ అమితంగా ఇష్టపడే కవి వేగుంట మోహనప్రసాద్‌. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చాలాసందర్భాల్లో చెప్పారు. ఆయన కవితా సంకలనం ఒకదానికి పవన్‌ ఆర్థికసాయం చేసి ప్రచురించారు కూడా. అదే మోహనప్రసాద్‌ సినిమా వాళ్ల గురించి ఓ కవిత చెబుతాడు-
''దేహమే గొప్పది
అనాకారి ఆత్మకంటె
నిరాకారి నిరంజనుడికంటె
సినిమా తారే గొప్పది''
..అంటాడు మోహన ప్రసాద్‌.

నిజమే... ప్రస్తుతానికి సినిమా తారలే గొప్పవాళ్లు. అందుకే పవన్‌ సభలకు జనాలు ఎగబడుతున్నారు. కానీ.. ఎన్నికలు వచ్చేలోగా.. సినిమా తారలకంటె ఆత్మ, శివుడు- యోగి (నిరంజనుడు) ఎక్కువని ప్రజలు అర్థం చేసుకునే రోజు వచ్చిందంటే....? ఏమో పవన్‌ ఆశలు, 'పవర్‌' కలలు వాస్తవరూపం దాల్చకపోవచ్చు.
ఈ నిత్యసత్యం గురించి ఆయన ఇప్పటినుంచే స్పృహ కలిగి ఉంటే మంచిది.
-కపిలముని
kapilamuni.a@gmail.com