cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్-బాబు గేమ్ ప్లాన్

పవన్-బాబు గేమ్ ప్లాన్

ఉన్నట్లుండి ఉరుములేని పిడుగు మాదిరిగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తుపాను బాధితుల పరామర్శకు బయల్దేరారు. తను పోటీ చేసి వెస్ట్ కానీ వైజాగ్ వైపు కానీ ఆయన వెళ్లలేదు. వెళ్తారా? అన్నది క్లారిటీ లేదు. కానీ ముందుగా తిరుపతి సరిహద్దు ప్రాంతాలను మాత్రం ఎంచుకున్నారు. 

ఎందుకు అన్నది అందరికీ తెలిసిందే. త్వరలో తిరుపతి ఉపఎన్నిక రాబోతోంది. ఆ ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం అందుకోవాలి. కానీ భాజపా అధిష్టానం అంత సులువుగా ఆ ఛాన్స్ ను జనసేనకు వదిలేలా లేదు. అందుకోసం ఏదో విధంగా షో చేసి, తనకు అక్కడ బలం వుందని చూపించి, వ్యవహారం నడిపించాలి. ఇప్పుడు అదే జరుగుతోంది.

కానీ ఇక్కడ రెండు విషయాలు వున్నాయి. తిరుపతి స్థానాన్ని జనసేనకు భాజపా వదిలేయడం ఒకటి. ఆ స్థానంలో పోటీ చేసి జనసేన సాధించేది మరొకటి. 

ముందు మొదటి సంగతి చూద్దాం. తిరుపతిలో ఉపఎన్నిక జరిగేది లోక్ సభ స్థానానికి. 2019 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే జనసేన దారుణంగా విఫలమైంది. ఒక్క అసెంబ్లీ స్థానం గెల్చుగలిగింది. అది కూడా ఇప్పుడు దాదాపు లేనట్లే. జనసేన అధిపతి రెండు చోట్ల పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. అలా అని పవన్ కళ్యాణ్ సభలకు జనం రాలేదా అంటే విపరీతంగా వచ్చారు. ఆయన రోడ్ షోల్లో కార్లు, బైకులు వెల్లువలా పరుగెత్తలేదా అంటే పరుగెత్తాయి. 

ఇప్పుడు తుపాను బాధితుల పరామర్శ కార్యక్రమంలో కన్నా ఎక్కవగా అప్పట్లో హడావుడి కనిపించింది. సరే, ఈ అభిమానుల హడావుడి అలా వుంచి, 2019 నాటికి ఇప్పటికీ జనసేన సంస్థాగతంగా ఏమన్నా బలపడిందా? మండల, జిల్లా, నియోజకవర్గ కమిటీలు ఏమన్నా ఏర్పాటు చేసారా? పార్టీ వ్యవస్థను బలోపేతం చేసారా? పోనీ ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు జనసేనలో చేరారా? లేదు కదా?

మరి ఏ బలం చూసుకుని తిరుపతి నుంచి పోటీ చేయాలని పవన్ ఉవ్విళ్లూరుతున్నారు? ఇది అసలు సిసలు ప్రశ్న. భాజపా నుంచి ఎలాగైనా తిరుపతి నుంచి పోటీ చేయడానికి అనుమతి సంపాదించి జనసేన బావుకునేది ఏముంది? లోక్ సభ స్థానానికి పోటీ చేయడానికి సరైన అభ్యర్థి కావాలి. గెలుపు మీద నమ్మకంతో హీనంలో హీనం ఓ పది నుంచి పదిహేను కోట్లు ఖర్చు చేయడానికి సిద్దపడాలి. అలాంటి సీన్ జనసేనలో వుందా? మరి ఏమిటి జనసేన అధినేత పవన్ ఎత్తుగడ? 

ఇక్కడే రాజకీయ వర్గాల్లో పవన్ గేమ్ ప్లాన్ వేరే అంటూ రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు భాజపాకు దగ్గరై వుండొచ్చు కానీ పవన్ మనసులో వున్నది ఎప్పటికీ చంద్రబాబే. వైఎస్ఆర్ టైమ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును మెగాస్టార్ చీల్చి, కాంగ్రెస్ విజయానికి సహకారం అందినట్లు, చంద్రబాబు టైమ్ లో కూడా అదే ప్రయత్నం పవన్ చేసారు. 

జగన్ ఓటు బ్యాంక్ చీల్చాలనే చంద్రబాబుకు దూరం జరిగారు తప్ప, మనసులో ఒరిజినల్ అలాగే వుంది అన్నది ఆ వ్యాఖ్యానాల సారాంశం. అలాగే 2019లో అధికారం పోగానే తన దగ్గర మనుషులను భాజపాలోకి పంపించినట్లు, పవన్ పార్టీని కూడా భాజపాకు దగ్గర చేసింది చంద్రబాబు ఎత్తుగడే తప్ప వేరు కాదని రాజకీయ వర్గాల కామెంట్.

ఇప్పుడు ఈ నేపథ్యంలో తిరుపతి వ్యవహారాన్ని పరిశీలిస్తే.. తెలంగాణలో ఏమయింది. భాజపా ఎదగడం వల్ల కాంగ్రెస్ కుదేలయిపోయింది. తెలుగుదేశం ఆ గడ్డ మీద నుంచి మాయం అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఆంధ్రలో వస్తుందేమో అని తెలుగుదేశం భయపడుతోంది.

తెలుగుదేశం అను'కుల' మీడియా కూడా ఇదే పాయింట్ ను పదే పదే ప్రస్తావించి వైకాపాను భయపెట్టాలని చూస్తోంది. ఆ విధంగా ఆంధ్రలో తెలుగుదేశాన్ని అణగదొక్కకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. 

ఇప్పుడు తిరుపతిలో జనసేన కాక భాజపా పోటీ చేస్తే ఏమవుతుంది? జనసేన మొహమాటానికి అయినా భాజపాను బలపర్చాలి. పవన్ ఒక్కసారి అయినా అక్కడి వెళ్లి ప్రచారం చేయాలి. అలా కాకుండా తెలంగాణలో మాదిరిగా ఓ ప్రకటన ఇచ్చి ఊరుకుంటే ఇక పొత్తు ధర్మం ఏముంటుంది? అదృష్టమో, దురదృష్టమో భాజపా పొరపాటున గెలవడమో, రెండో స్థానంలో వుండడమో జరిగితే తేదేపా పరిస్థితి ఏమిటి? ఒకటో ప్రమాద హెచ్చరిక మోగినట్లే. అలా జరగకూడదు అంటే ఏం చేయాలి?

భాజపా తిరుపతిలో పోటీ చేయకూడదు. జనసేన నామ మాత్రపు పోటీ ఇవ్వాలి. 2019లో మాదిరిగానే తేదేపాకు ఇబ్బందిలేని విధంగా ఏదో విధంగా పోటీ ఇచ్చి తప్పుకోవచ్చు. అప్పుడు ముందు ప్రస్తావించినట్లే అదృష్టమో, దురదృష్టమో గెలవడమో, రెండో స్ధానానికి పరిమితం కావడమో అన్నది తేదేపా వ్యవహారం అవుతుంది. రెండో స్థానానికి  పరిమితం అయినా, గతంలో కంటే కాస్త ఎక్కువ ఓట్లు వచ్చాయి అనుకోండి. జనం ముందు కాస్త తలెత్తుకోవచ్చు. 

ఇదే పవన్ గేమ్ ప్లాన్ తప్పు మరోటి కాదు అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న కథనాల సారాశం. ఈ గేమ్ ప్లాన్ కాదు అని చెప్పడానికి కూడా సరిపడా లాజిక్ లు దొరకడం లేదు. ఎందుకంటే పవన్ కు బలమైన పార్టీ వ్యవస్థ లేదు. అభ్యర్థులు లేరు. నిధులు వున్నాయని అనలేము.

కేవలం భాజపా అండ మాత్రమే వుంటుంది. అయినా ఎందుకు తిరుపతి కోసం అంత గట్టి పట్టు పట్టి హడావుడి చేస్తున్నారు అంటే ఆ గేమ్ ప్లాన్ ఇదేనా అని అనుకోవాల్సి వస్తుంది.

కానీ భాజపా జనాలు తక్కువ వాళ్లేం కాదు. వాళ్లకు తెలియని రాజకీయాలు కాదు. నిజంగా పవన్ కు తిరుపతి వదిలేయాలని వుంటే ఇంత హడావుడి వుండదు. ఢిల్లీ వెళ్లినపుడే ఓకె అనేసి వుండేవారు. పైగా జిహెచ్ఎంసి ఎన్నికల్లో త్యాగం కూడా చేసి వున్నారు కదా. 

ఆ వేడి మీద కూడా ఊ అనని భాజపా, తెలంగాణ ఎన్నికల్లో విజయం అనే కిక్ మీద వున్నపుడు ఊ అంటుందా? పైగా తెలుగుదేశం పార్టీని ముందుగా పక్కకు తప్పించడం అన్న ఎజెండా భాజపాకు వుందీ అనుకుంటే ఈ తిరుపతి ఎన్నిక ద్వారా వచ్చిన అవకాశాన్ని వదలుకుంటుందా? అన్నింటికి మించి పవన్ ను ఎక్కడ, ఎప్పుడు, ఎంత వరకు, ఎలా వాడుకోవాలో అన్నది ముందుగానే భాజపా డిసైడ్ అయిపోయి వుంది. 

జనసేనకు ప్రచారం వచ్చే పని అస్సలు చేయడం లేదు. ఆంధ్రలో ఏ ఉద్యమం చేసినా ఒంటరిగానే చేస్తోంది తప్ప జనసేనను కలపుకోవడం లేదు. ఇలాంటి నేపథ్యంలో పవన్ గేమ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా? అన్నది అనుమానమే. అదే సమయంలో తిరుపతి ఎన్నిక అన్నది జనసేన-భాజపా బంధానికి లిట్మస్ టెస్ట్ కూడా. 

సీటు ఇవ్వకపోతే జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది ఆసక్తికరం. తలదించుకు ఊరుకుంటే హీనమైనపోతుంది. ఎదురుతిరిగినా, అలిగినా బంధం వీగిపోతుంది. మొత్తం మీద పవన్ గేమ్ ప్లాన్ ఎలా వుంటుందో, దాని వెనుక ఘోస్ట్ రైటర్ అయిన తేదేపా కొత్త ఎత్తులు ఎలా వేస్తుందో మునుముందు తెలుస్తుంది.

చాణక్య

 


×