cloudfront

Advertisement


Home > Politics - Gossip

పవన్ Vs బాబు... సెల్ఫ్ గోల్స్ లో పోటాపోటీ

పవన్ Vs బాబు... సెల్ఫ్ గోల్స్ లో పోటాపోటీ

గతం మర్చిపోయి నీతులు చెప్పాలని చూస్తూ.. చంద్రబాబు, పవన్ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నారు. నాలుగున్నరేళ్లుగా జరుగుతున్నదీ, అంతకుముందు జరిగిందీ అంతా మర్చిపోయి గజినీల్లా మారిపోయిన బాబు, పవన్.. జనాలని వెర్రివాళ్లను చేయాలనుకునే క్రమంలో తాము నవ్వులపాలవుతున్నామనే విషయాన్ని మరిచిపోతున్నారు. గతం గురించి చెప్పినప్పుడల్లా వీళ్లు నీళ్లు నమలాల్సి వస్తోంది.

ఎన్డీఏలో ఉన్నప్పుడు మోదీని ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగిడి.. ఇప్పుడు ప్రధాని పదవికే అతను అనర్హుడంటున్న చంద్రబాబు.. అప్పుడేం చేశావయ్యా అంటే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటూ పక్కకు తప్పుకుంటారు. హోదా కంటే ప్యాకేజీయే బెస్ట్ అన్న నోటితోనే హోదాయే మా డిమాండ్ అంటున్నారు.

తెలంగాణలో పార్టీ మారిన వాళ్లని చిత్తుగా ఓడించండి అంటూ జనాలకి ఉపదేశమిచ్చిన బాబు.. ఏపీలో గోడదూకిన వారు గుర్తొచ్చే సరికి నాలుక కరుచుకున్నారు. ఇక నోట్లరద్దు గురించి బాబు వేసుకున్న సెల్ఫ్ గోల్స్ పెద్ద జోక్స్ గా మారాయి.

ఈ విషయంలో బాబుకి ఏమాత్రం తీసిపోడు పవన్ కల్యాణ్. బాబుతో కలసి కాపురం చేసినప్పుడు కనపడని లొసుగులన్నీ విడాకులు తీసుకున్నాక పవన్ కి భలే గుర్తొస్తున్నాయి. బాబు ఇలాంటోడని నాకు ముందే తెలుసంటూ చెప్పుకుంటారు కానీ, అప్పుడేం చేశావయ్యా పీకే అంటే నోరు మెదపరు.

కాంగ్రెస్ కి ప్రజారాజ్యం అమ్ముడుపోయిందీ.. బీజేపీకి జనసేనను తాకట్టు పెట్టిందీ.. అన్నీతెలిసి కూడా ఇప్పుడు ఆ రెండు పార్టీలూ దొంగలేనంటారు. బాబుతో రాసుకుపూసుకు తిరిగినప్పుడు ఆయనకి ఉత్తరాంధ్ర కష్టాలు కనపడలేదు, ఇసుక మాఫియా గుర్తుకు రాలేదు, సీమ కష్టాలు తెలియనే తెలియవు.

ఇప్పుడు మాత్రం నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయంటూ గొంతు చించుకుంటుంటారు పవన్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చేస్తున్న ప్రతి విమర్శా ఆయనపై ఆయన చేసుకున్నట్టే లెక్క. అవన్నీ జనసేనాని వేసుకుంటున్న సెల్ఫ్ గోల్సే. తాజాగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబుని పార్టీలో చేర్చుకున్న పవన్ గతాన్ని మరోసారి బ్రహ్మాండంగా గుర్తుకు తెచ్చుకున్నారు.

2009 నుంచీ కిషోర్ తనకు తెలుసనీ 2014లోనే ఆయన ఆవేదన గుర్తించాననీ అన్నారు పవన్. మరి ఆరోజు, ఆవేదన గుర్తించిన రోజు పవన్ ఏం చేస్తున్నారు, ఎవరి చంకలో ఉన్నారు. ఆరోజే కిషోర్ బాబుని ఆయన పార్టీలో చేర్చుకోవచ్చు కదా. ఆయన్ను ఆవేదనకు గురిచేసిన టీడీపీ దుష్టపన్నాగం గుర్తించి తాను కూడా వదిలేయొచ్చు కదా.

ఇలా గతం గురించి అంతా మర్చిపోయారనే భ్రమలో నోటికి వచ్చింది మాట్లాడేస్తున్నారు పవన్. గతంలో ఒప్పులుగా కనిపించినవన్నీ ఇప్పుడు చంద్రబాబు, పవన్ కి తప్పులుగా కనిపిస్తున్నాయి. కేంద్రంపై రాళ్లేసే చంద్రబాబు, రాష్ట్రం, కేంద్రం ఇద్దరిపై బురద జల్లాలని చూసే పవన్ కల్యాణ్ ఇద్దరూ ఇప్పుడు బఫూన్స్ గా మారారు. ఎదుటివాళ్లని విమర్శిస్తూ నవ్వులపాలవుతున్నారు. 

తెలంగాణ ఓటరు నాడి... ముళ్లు ఎటువైపు తిరుగుతోంది?... చదవండి గ్రేట్ ఆంధ్ర పేపర్