cloudfront

Advertisement


Home > Politics - Gossip

చంద్రబాబు ప్రధాని.. పవన్ ముఖ్యమంత్రి

చంద్రబాబు ప్రధాని.. పవన్ ముఖ్యమంత్రి

వినేవాళ్లు తెలుగోళ్లయితే చెప్పేవాడు చంద్రబాబు అని ఇప్పటివరకూ అనుకున్నాం. ఇప్పుడా ప్లేస్ ని పవన్ కల్యాణ్ భర్తీ చేసేట్టు కనిపిస్తున్నారు. క్యాలీఫ్లవర్లు, క్యాబేజీలు వెంటబెట్టుకుని మరీ తిరుగుతున్నారు. ప్రసంగానికి ముందే వాటన్నిటినీ జనాల చెవుల్లో పెట్టి మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు.

"ప్రధానమంత్రి అయ్యే అవకాశం నాకెప్పుడో వచ్చింది కానీ లోకేష్ వద్దంటే వదులుకున్నానని" చంద్రబాబు చెబుతుంటే పడీపడీ నవ్వుకునేవారు జనాలు. పవన్ కల్యాణ్ కూడా ఇప్పుడు అదే టైపు కామెడీ స్టార్ట్ చేశాడు. "నాకు సీఎం పదవి కావాలంటే బీజేపీతో ఎప్పుడో చేతులు కలిపి ముఖ్యమంత్రిని అయ్యేవాడిని. జనసేనను బీజేపీలో కలపమని అమిత్ షా ఎప్పుడో నాకు ఆఫర్ ఇచ్చాడు." ఇది జనసేనాని తాజా డైలాగ్.

పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ పవన్ ఏ సందర్భంలో ఎలా ముఖ్యమంత్రి అయ్యేవాడో జనానికి కాస్త వివరిస్తే బాగుండేది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మెజార్టీ వస్తే, పవన్ కల్యాణ్ ని ముఖ్యమంత్రిని చేస్తానని అమిత్ షా ఎలా హామీ ఇచ్చారో ఆయనకే తెలియాలి.

నిజానికి 2014లోనే కాదు, 2019లో కూడా బీజేపీకి ఏపీలో అంత సీన్ లేదు. రాష్ట్రంలో అది ప్రభావవంతమైన పార్టీ కాదు. పోనీ జనసేనకు ఏమైనా క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఉండి పాతుకుపోయిన పార్టీనా అంటే అది కూడా కాదు. మరి బీజేపీతో కలిస్తే పవన్ ఎలా సీఎం అవుతారో అర్థంకావడం లేదు.

అప్పట్లో అన్న చిరంజీవి ప్రజారాజ్యంను కాంగ్రెస్ లో కలిపి చారిత్రక తప్పిదం చేశాడని కాబోలు, ఇప్పుడు తమ్ముడు జనసేనని బీజేపీకి అమ్మకానికి పెట్టలేదు. జస్ట్ తాకట్టు పెట్టారంతే. పవన్ కల్యాణ్ అప్పట్లో చంద్రబాబు డైరక్షన్లో పనిచేస్తే, ఇప్పుడు బీజేపీ దర్శకత్వంలో నటిస్తున్నారని చాలామంది నమ్ముతున్నారు. పవన్ మాటలు, చేతలు దీనికి బలం చేకూరుస్తున్నాయి కూడా.

ఎన్నికల టైమ్ దగ్గరపడితే బీజేపీకి జనసేనను తాకట్టుపెట్టారా లేక, అమ్మకానికి పెట్టారా అనే విషయంలో క్లారిటీ వస్తుంది. అప్పటివరకు అభిమానుల దృష్టిలో పవన్ ముఖ్యమంత్రే.