Advertisement


Home > Politics - Gossip
ఉత్తరాంధ్రను పవన్ అవమానిస్తున్నారా?

ఉత్తరాంధ్ర ప్రజలకు సౌమ్యులుగా పేరుంది. అందుచేత వారు పోరాటాలను ఎరగని అచేతనులు అనుకుంటే తప్పు. వారికి పోరాటాలు తెలియదనుకోవడమూ చరిత్ర మీద అవగాహన లేకపోవడమే. అన్నింటినీ మించి వారి పోరాటాలను ప్రస్తుతించడానికి పొరుగువారి పోరాటాలను ఉపమాలంకారాలుగా అరువు తెచ్చుకోవడం ఇంకా పెద్ద అవమానం. 30 రోజుల పాటూ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, అరకు ప్రాంతంలో కూడా పర్యటించిన తర్వాత.. పవన్ కల్యాణ్ ముక్తాయిస్తూ చెప్పిన మాటలు తమకు అవమానం గానే ఉన్నాయని ఉత్తరాంధ్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

30 రోజుల పాటూ ఉత్తరాంధ్రంలో తిరిగిన తర్వాత జనంతో కలిసిన తర్వాత.. వారి కష్టాలను విన్న తర్వాత... దృక్పథాలను గమనించిన తర్వాత.. పవన్ కల్యాణ్ ఏదో ఒక సాకు పెట్టి మొత్తానికి హైదరాబాదు చేరుకున్నారు. అంతవరకు బాగానే ఉంది... ఆ సందర్భంగా తాను ఏ రకంగా స్పందించబోతున్నాడో, వారికి దన్నుగా నిలవబోతున్నాడో ఆయన తన వేదిక ట్విటర్ ద్వారా పంచుకుని ఉంటే సబబుగా ఉండేది.

ఉత్తరాంధ్ర గడ్డ మీద తనకు వీర తెలంగాణ స్ఫూర్తి కనిపించిందంటూ పవన్ చెప్పడం ఈ ప్రాంతవాసులకు గిట్టలేదు. తమ పోరాటాలకు ఒక అస్తిత్వం లేదా? తెలంగాణతో పోలిస్తే తప్ప తమ పోరాటాలు విలువైనవిగా కనిపించడం లేదా అని వారు బాధ పడుతున్నారు. తెలంగాణలో పార్టీ ఉంటుందో ఉండదో కూడా క్లారిటీగా చెప్పే పరిస్థితిలో లేని పవన్ కల్యాణ్.. తెలంగాణ పోలిక తెచ్చి.. ఉత్తరాంధ్ర వారి స్ఫూర్తిని అభినందించడంలో ఆంతర్యం ఏమిటో ఆయనకే తెలియాలి.

అయినా 30రోజుల పర్యటన తర్వాత.. పవన్ కల్యాణ్ ఆ ప్రాంత పర్యటనలో తానేం గమనించానో చెబుతున్నారు. నిజానికి ఇది చరిత్ర కారులు చేసే పని... ఒక ప్రాంతంలో పర్యటించిన తర్వాత.. అక్కడ తాము గమనించినదేమిటో.. వారి కష్టాలేమిటో.. కన్నీళ్లేమిటో చరిత్రకారులు రచయితలు చెప్పాలి. నాయకులు కాదు. నాయుకలు అయిన వారు.. సూటిగా ఆ ప్రాంతానికి తాను ఏం చేయదలచుకున్నానో.. వారి కష్టాలను దూరం చేయడానికి తాను ఏం చేయబోతున్నాడో నాయకుడు చెప్పాలి. కానీ పవన్ మాటలు ఆ తరహాలో లేకుండా.. తెలంగాణతో ఉత్తరాంధ్రను పోలుస్తూ వారి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ పలువురు భావిస్తున్నారు.