cloudfront

Advertisement


Home > Politics - Gossip

‘సంకీర్ణ పీఠం’ పైనే పవన్ ఆశలు!

‘సంకీర్ణ పీఠం’ పైనే పవన్ ఆశలు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలి అభ్యర్థుల జాబితా విడుదల అయింది. అధికారం కోసం తలపడుతున్న రెండు ప్రధాన పార్టీల నుంచి కాకుండా.. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన తొలి జాబితాను విడుదల చేయడం విశేషం. రాజమండ్రిలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్... ఆ సభనే తొలి ఎన్నికల ప్రచార సభగా మార్చుకునే వ్యూహంతో... బుధవారం రోజు సుదీర్ఘమైన కసరత్తు చేసి.. అర్ధరాత్రి దాటిన తర్వాత.. జాబితాను విడుదల చేశారు. ఈ తొలిజాబితాను పరిశీలిస్తే చాలు.. రాబోయే ఎన్నికల విషయంలో ఫలితాల గురించి.. ఆ తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వాలు, అందులో ఉండగల తనపాత్ర గురించి పవన్ కల్యాణ్ ఎలాంటి ఆలోచనలతో ఉన్నారనే సంగతి అర్థమవుతుంది.

తెలుగుదేశం నుంచి వచ్చి చేరిన రావెలకిశోర్ బాబు, కాంగ్రెస్ లో ఇక ప్రస్థానం ముగిసిపోయినట్టే గనుక, పవన్ పంచకు చేరిన నాదెండ్ల మనోహర్ లకు వారి వారి స్థానాల నుంచి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడంలో విశేషం ఏమీలేదు. కానీ.. 2009లో చిరంజీవిని నమ్ముకుని భంగపాటుకు గురై.. తాజాగా పవన్ నీడలోనైనా చట్టసభల్లోకి అడుగుపెట్టాలని కలగంటున్న తోట చంద్రశేఖర్ కు కూడా ఎమ్మెల్యే సీటు కేటాయించడం అనేది మాత్రం కీలకమైన పరిణామంగా కనిపిస్తోంది.

తోట చంద్రశేఖర్ మాజీ ప్రభుత్వాధికారి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యంలో చేరి గుంటూరు ఎంపీగా బరిలోకి దిగారు. 2014 ఎన్నికల సమయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్లీ మరోస్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. రెండు పర్యాయాలూ భంగపాటు తప్పలేదు. పవన్ కల్యాణ్ పార్టీ జనసేన... సుషుప్తావస్థ నుంచి యాక్టివేట్ అయిన నాటినుంచి.. అదే పనిగా.. పవన్ ను అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ ఆర్థిక భారాన్ని మొత్తంగా మోస్తున్నారు.

99 టీవీ ఛానెల్ ను కొనుగోలు చేసినా... జనసేన సోషల్ మీడియా వ్యవహారాలను తానే నడుపుతూ ఉన్నా.. ఆ ఖర్చు మొత్తం తానే భరిస్తున్నారు. ఇంతకాలంగా ఇంత భారీగా ఖర్చుపెడుతూ వస్తున్నది.. కనీసం మూడోసారి అయినా పార్లమెంటులో అడుగుపెట్టడానికేనని అంతా అనుకుంటూ వచ్చారు. కాకపోతే... తాజాగా ఆయన పేరును గుంటూరు వెస్ట్ అసెంబ్లీ స్థానానికి ప్రకటించారు.

ఈ పరిణామాన్ని బట్టి గమనించినప్పుడు.. ఫలితాల తర్వాత.. అధికారంలోకి ఏ పార్టీ రావాలనే విషయాన్ని నిర్ణయించే స్థితిలో జనసేన ఉంటుందని.. అప్పుడు సంకీర్ణంలో చేరి మంత్రి పదవులు పుచ్చుకోవచ్చునని జనసేన భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి వారి ఆశలు పండుతాయో... ఎండుతాయో వేచిచూడాలి.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!