
దేశ రాజకీయాల్లో పరిస్థితులెలా వున్నా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీకి అంత సీన్ లేదు. తెలంగాణతో పోల్చి చూసినా, బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో చాలా చాలా వీక్ అన్నది నిర్వివాదాంశం. 2014 ఎన్నికల్లో బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలో 'ఫేర్' చేసిందంటే, దానిక్కారణం టీడీపీతో పొత్తు, దానికి అదనంగా బోనస్ రూపంలో వచ్చిన పవన్‌కళ్యాణ్ ఇమేజ్. ఈ విషయం బీజేపీకి కూడా బాగా తెలుసు.
కానీ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడాల్సిందే. అందుకోసమే, బీజేపీ గత కొద్ది రోజులుగా వ్యూహాత్మక ఎత్తుగడలకు దిగుతోంది. జగన్‌కి అపాయింట్మెంట్ రావడం, పవన్ - బీజేపీపై విరుచుకుపడ్తున్నా కొందరు నేతలు పవన్‌ని విమర్శిస్తూ, ఇంకొందరు నేతలు పవన్‌కి 'సోప్' వేస్తుండడం.. ఇదంతా 'కమలం' మార్క్ వ్యూహాలుగానే చెప్పుకోవాలి. మరి, మధ్యలో జగన్‌ని బీజేపీ ఎందుకు 'దగ్గరకి' తీస్తోందట.? టీడీపీని ర్యాగింగ్ చేయడానికే బీజేపీ, జగన్‌ని వాడుకుంటోందన్న విషయం సుస్పష్టమవుతోందిక్కడ.
చాలా విషయాల్లో పవన్, బీజేపీని గట్టిగా విమర్శించినా.. వైఎస్ జగన్ మాత్రం, బీజేపీని విమర్శించే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీకి దగ్గరవడం ద్వారా టీడీపీని కవ్వించి, తద్వారా బీజేపీ - టీడీపీ మధ్య 'బంధం' తెగేలా చేయాలన్నది జగన్ వ్యూహం కావొచ్చుగాక. జగన్ వ్యూహాలెలా వున్నా, బీజేపీ అయితే ఓ ఖచ్చితమైన 'లైన్'లో తన రాజకీయ వ్యూహాల్ని అమలు చేస్తోంది. ఇందులో వేరే మాటకి తావు లేదు.
మార్చి తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వుండదు.. అని బీజేపీ నిన్న మొన్నటిదాకా చెప్పుకొచ్చింది. అదే పాట టీడీపీ కూడా పాడుతూ వచ్చింది. కానీ, దేశంలో చాలా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అలాగే వుండిపోయింది. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాని తీసేసే సాహసం బీజేపీ చెయ్యలేదుగాక చెయ్యలేదు. అంటే, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదన్నమాట. జగన్ నినదించినా, పవన్ ప్రశ్నించినా.. ప్రత్యేక హోదాపై వారిద్దరి 'రాజకీయ ఆలోచనలు' అంత స్ట్రాంగ్‌గా వుండడానికి 'రీజన్' ఇదే మరి.! బీజేపీకి కూడా ఆ విషయం బాగా తెలుసు.
మొత్తమ్మీద, 2019 ఎన్నికల నాటికి టీడీపీపై ప్రభుత్వ వ్యతిరేకత వస్తుందనీ, అప్పటికల్లా జగన్ బలం పుంజుకున్నా, కొత్తగా పవన్‌కళ్యాణ్ సత్తా చాటినా, ఎవరు అధికారంలోకి వస్తారనుకుంటే వారితో అంటకాగడానికి బీజేపీ సిద్ధంగా వుందన్నమాట. అద్గదీ అసలు విషయం. ఇతర పార్టీల బలాల మీద ఆధారపడటం తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో సొంతంగా సీన్ లేదనే విషయమ్మీద బీజేపీకి క్లారిటీ వుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?