Advertisement


Home > Politics - Gossip
పవన్‌కళ్యాణ్‌ అంటే అంతేనా.?

కూరలో కరివేపాకు ప్రాధాన్యత గురించి కొత్తగా చెప్పేదేముంది.? కూర వండడానికి కరివేపాకు అవసరం, వండాక, అందులో అది అనవసరం. రాజకీయాల్లోనూ అంతే. కొందర్ని కరివేపాకులా వాడుకుని వదిలేయడం రాజకీయ నాయకులకి, పార్టీలకీ వెన్నతో పెట్టిన విద్యే.

కానీ, చిన్న తేడా. వాడుకుని, విసిరి పారేయడం, మళ్ళీ అవసరమైనప్పుడు అక్కున చేర్చుకోవడం.. ఇదీ పొలిటికల్‌ కరివేపాకుకి రాజకీయాల్లో వున్న ప్రాధాన్యత. పొలిటికల్‌ కరివేపాకు గురించి రాజకీయాల్లో చాలా అసభ్యకరమైన ప్రస్తావనలు వుంటాయనుకోండి.. అది వేరే విషయం. 

అసలు విషయమేంటంటే, సినీ నటుడు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ. ఉద్దానం కిడ్నీ బాధితుల వ్యవహారానికి సంబంధించి, పవన్‌కళ్యాణ్‌ పేరుని అధికార తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చింది. దొంగలు పడ్డ ఆర్నెళ్ళకు.. అన్న చంద్రన్న, ఈ ఎపిసోడ్‌లో పవన్‌కళ్యాణ్‌ పేరు దాదాపు ఆరు నెలల తర్వాతనే మళ్ళీ తెరపైకొచ్చిందండోయ్‌.! 

అప్పుడెప్పుడో పవన్‌కళ్యాణ్‌, ఉద్దానం ప్రాంతానికి వెళ్ళారు. సినిమా ఫంక్షన్‌ తరహాలో, కిడ్నీ వ్యాధిగ్రస్తుల్ని తన ఈవెంట్‌కి రప్పించుకున్నారు. వీరావేశంతో ప్రసంగించేశారు, ప్రభుత్వానికి సవాల్‌ విసిరేశారు. డెడ్‌లైన్‌ కూడా పెట్టేశారు. అఫ్‌కోర్స్‌, ఆ తర్వాత అవన్నీ మర్చిపోయారనుకోండి.. అది వేరే విషయం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని కలుస్తానన్న పవన్‌, ఇప్పటిదాకా కలవలేదాయె.!

పవన్‌ ఎలాగూ తనను కలవలేదు గనుక, తానే పవన్‌కళ్యాణ్‌ని రప్పించుకోవాలనుకున్నట్లున్నారు చంద్రబాబు. తప్పదు, అవసరం చంద్రబాబుది. బీజేపీ గనుక తమని వదిలేస్తే, ఆంధ్రప్రదేశ్‌లో దిక్కులేకుండా పోతుందన్నది చంద్రబాబు భయం. ఇంకేముంది, 'హార్వార్డ్‌ యూనివర్సిటీ పరిశోధనా బృందం రాక' అనే సాకు చూపి, పవన్‌కి టీడీపీ సర్కార్‌ ఆహ్వానం పలుకుతోంది. 

మరి, పవన్‌ - చంద్రబాబు వద్దకు వెళతారా.? వెళ్ళడానికి రెడీగానే వున్నారు, కానీ చంద్రబాబుకి ఖాళీ లేకపోవడంతో 'భేటీ' కొంత ఆలస్యమని, అధికార పార్టీకి వంతపాడే మీడియా ప్రచారం షురూ చేసింది. మామూలుగా అయితే, పవన్‌ ఈ విషయంలో చంద్రబాబుని కలవడమే అసంబద్ధం, అర్థరహితం. కానీ, అక్కడున్నది పవన్‌కళ్యాణ్‌ కదా.! తనను చంద్రబాబు కరివేపాకులా వాడుకుని పారేస్తున్న వైనం తెలిసీ, ఆయన మీద స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తూనే వున్నారు. 

ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో చాలా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.. దురదృష్టకర సంఘటనలూ జరిగాయి. డ్రగ్స్‌ వ్యవహారం తెలంగాణని, తెలుగు సినీ పరిశ్రమనీ కుదిపేస్తోంటే, అనేక కుంభకోణాలు ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూశాయి. 2019 ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న జనసేనాధినేత ఈ అంశాలపై స్పందించలేదాయె. దేశభక్తికి కేరాఫ్‌ అడ్రస్‌ తానేనని చెప్పుకునే పవన్‌, పాకిస్తాన్‌ - చైనాల నుంచి భారత్‌కి ఎదురవుతున్న సవాళ్ళపైనా స్పందించకపోవడం విశేషమే. 

కానీ, చంద్రబాబు పిలిచేశారు కదా, ‘కాటమరాయుడు’ పంచె సరిచేసుకుని ఆయన వద్దకు పరుగెత్తడం దాదాపు ఖాయమే. ఎనీ డౌట్స్‌.?