cloudfront

Advertisement


Home > Politics - Gossip

వాళ్లను నమ్ముకుంటే పవన్ మునగడా?

వాళ్లను నమ్ముకుంటే పవన్ మునగడా?

ఆంధ్రప్రదేశ్ లో తమకంటూ అతీగతీలేని వామపక్ష పార్టీలు.. పవన్ కల్యాణ్ ను ఆసరాగా చేసుకుని.. అంతో ఇంతో సీట్లు గెలుచుకోవాలని ఆశపడుతున్నాయి. అయితే పవన్ జనసేన పార్టీని యాక్టివేట్ చేసిన తర్వాత.. వామపక్షాలతో చెట్టపట్టాలేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లు వారిని దూరంపెట్టాడు. వారు ఎగబడి వచ్చినా కూడా మొహం చాటేశాడు. ఇప్పుడు ఏమైందో ఏమో.. మళ్లీ నెత్తిన పెట్టుకుంటున్నాడు. అయితే.. భాజపాకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు దేశవ్యాప్తంగా ఒక కొత్త కూటమిని తయారుచేస్తున్న నేపథ్యంలో.. వామపక్షాలు ఆ కూటమిలోకి అనివార్యంగా చేరితే గనుక.. ఏపీ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? వామపక్షాలను నమ్ముకుంటే పవన్ నట్టేట మునుగుతాడా అనే చర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి చాలారోజులు అయినప్పటికీ, ఆయన గత సంవత్సర కాలంగానే రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. పవన్ తాను, చిన్నప్పటి నుండీ కమ్యూనిష్ట్ భావాలను ఇష్టపడేవాడినని, తాను ఛేగువేరా అభిమానిని అని కూడా చెప్పుకుంటారు. బహుశా ఆ కారణంతో ఏమోగానీ, ఏపీలోని కమ్యూనిష్ట్ పార్టీలయిన సిపియం, సిపిఐలు వెంటనే పవన్ తో దోస్తీకి ఉత్సాహం చూపించేసాయి. యువతలో పవన్ కు ఉన్న ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకుని, జనసేనతో జతకట్టి ఏపీలో ఎన్నో కొన్ని సీట్లు గెలవొచ్చనే భావించాయి. పవన్ మీద విమర్శలు వచ్చినపుడు, ఆయన అభిమానుల కంటే ఏపీలోని వామపక్ష పార్టీలే ఎక్కువగా స్పందించి, పవన్ ను వెనుకేసుకు రావడం, ఏపీ రాజకీయాలను గమనిస్తున్న వారెవరైనా ఇట్టే గ్రహించవచ్చు.

వామపక్ష పార్టీలు పవన్ పై ఎంత విశ్వాసం చూపినప్పటకీ, ఆయన మాత్రం వాటితో ఇప్పటికీ దోబూచులాడుతున్నారనే చెప్పాలి. జనసేన చేపడుతున్న అన్ని కార్యక్రమాలకు వామపక్షాలతో కలిసి హాజరైన పవన్, ఏపీలో వామపక్షాలు చేపట్టిన నిరసనలకు మాత్రం డుమ్మాకొడుతున్నారు. వామ పక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేకహోదా నిరసన కార్యక్రమానికి హాజరుకాకపోగా, కనీసం తన ప్రతినిధులను కూడా పవన్ పంపలేకపోయారు. వారితో కలవడం పట్ల, పొత్తు పట్ల కూడా పవన్ ఇప్పటి వరకు సరిగా స్పందించడం లేదని చెప్పవచ్చు.

తెలంగాణలో జరుగుతున్న ముందస్తు ఎన్నికలలో జనసేనతో పొత్తు ఉంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న సిపియం, సిపిఐ పార్టీలు, పవన్ ఎంతకూ పొత్తు విషయం తేల్చక, నానుస్తుండటంతో విధిలేక విడివిడిగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఏపీలో మాత్రం జనసేనతో ఎన్నికల పొత్తు కోసం వామపక్షాలు తహతహలాడుతున్నాయి. తాజాగా ఏపీ సియం చంద్రబాబు బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్త కూటమికి ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం, ఇప్పటికే కాంగ్రెస్ తో జతకట్టిన చంద్రబాబు చొరవకు వామపక్ష పార్టీల జాతీయ నాయకత్వాలు మద్దతు తెలుపుతుండటంతో, జనసేన వామపక్ష పార్టీల పొత్తు ప్రశ్నార్ధకం కానుంది.

వామపక్ష పార్టీల జాతీయ నాయకత్వం కాంగ్రెస్, చంద్రబాబుతో కలిసి బిజెపికి వ్యతిరేకంగా కూటమి కడితే, ఏపీలోని సిపియం, సిపిఐ పార్టీల శాఖలు కూడా ఆ దారిలో నడవక తప్పదు. ఏపీలో పార్టీ సంస్ధాగత నిర్మాణం ఇంకా మొదలుపెట్టని జనసేన పార్టీ, వామపక్షాలు కూడా కలిసి రాకపోతే ఏపీ ఎన్నికలలో మునగడం ఖాయమని పరిశీలకుల భావన. ఒకవేళ ఎర్రపార్టీలను నమ్ముకుని.. తనకు ఎటూ క్షేత్రస్థాయి బలం లేదు గనుక.. వారి క్షేత్రస్థాయి బలాన్ని నమ్ముకుని రాజకీయాలు చేయాలని పవన్ కల్యాణ్ అనుకుంటే మాత్రం దెబ్బతింటాడని పలువురు భావిస్తున్నారు.

ఆ పార్టీకి మినిమం మెజారిటీ గ్యారెంటీ!... ఎందుకో తెలుసా?